-->

అంబటి మరియు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా అధికార పార్టీలయిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబరాలకు పిలుపునిచ్చారు. మరోవైపు, జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు…పోలీసులతో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. కేవలం ప్రతినిధుల బృందానికి మాత్రమే కలెక్టరేట్ లోకి అనుమతి ఉందని చెబుతూ అంబటిని పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు.

తనను ఎందుకు అడ్డుకుంటున్నారని అంబటి..సీఐ వెంకటేశ్వర్లుతో గొడవకు దిగారు. అందరు నేతలను లోపలికి పంపబోమని, ప్రతినిధుల టీంను మాత్రమే పంపుతామని సీఐ తేల్చి చెప్పారు. నన్ను ఎలా అడ్డుకుంటారు అంటూ పదే పదే అంబటి వాదనకు దిగారు. దీంతో, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులనుద్దేశించి అంబటి అసభ్య పదజాలంతో నోరు జారారు. ఏంటి మీరు చేసేది…బొం* అంటూ దుర్భాషలాడారు. దీంతో, అంబటిపై సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదగా మాట్లాడాలని అంబటికి సీఐ వెంకటేశ్వర్లు వేలు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఓ దశలో వారిద్దరూ బాహాబాహికి దిగుతారా అన్నట్లు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఇద్దరూ సహనం కోల్పోయి నువ్వెంత అంటే నువ్వెంత అని సవాల్ విసురుకున్నారు. అంబటి వైపు సీఐ వెంకటేశ్వర్లు వేలు చూపించి పళ్లుకొరకడంతో..ఏంటి పళ్లు కొరుకుతున్నావ్ అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వేం మాట్లాడుతున్నావ్..అంటే నువ్వేం మాట్లాడుతున్నావ్ అంటూ ఇద్దరూ ఒకరిపైకి ఒకరు వేళ్లు చూపించుకుంటూ దూసుకువచ్చారు. ఈ క్రమంలోనే పక్కన ఉన్న ఎస్ఐ, ఇతర పోలీసులు ఇద్దరికీ సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.