2019-2024 వరకు ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలో విధ్వంసకర పాలన కొనసాగిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మొదలు ప్రజల వరకు అంతా ముక్తకంఠంతో విమర్శించారు. ఆ క్రమంలోనే జగన్ నియంత పాలనకు చరమగీతం పాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారు. జగన్ అండ్ కోకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారంటూ వైసీపీ పాలనపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ మాకొద్దు అని జనం ఇచ్చిన తీర్పు వెలువడిన తేదీ జూన్ 4. అయితే, అటువంటి చరిత్రాత్మక దినాన్ని వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే జగన్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. వైసీపీ రాక్షస పాలనకు ఏడాది క్రితం ప్రజలు ముగింపు పలికారని, ప్రజలను వేధించిన సైకో నేతకు చాచి కొట్టినట్లు బుద్ది చెప్పారని అన్నారు. ఐదేళ్ల పాటు ప్రజలను మోసగించిన జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, వెన్నుపోటు దినమంటూ డ్రామాలు ఆడకూడదని ఎద్దేవా చేశారు. జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని అనగాని విమర్శించారు.
ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని, అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి, చెల్లెళ్లకు వెన్నుపోటు పొడిచిన జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని, ఇదే వైఖరి కొనసాగితే వైసీపీ పరిస్థితి 11 నుంచి గుండుసున్నాకు చేరుకుంటుందని అనగాని సెటైర్లు వేశారు.
జగన్ పై ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు కనిపించకూడదనే వైసీపీ నేతలు వెన్నుపోటు దినం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తాత రాజారెడ్డి దగ్గర నుంచే వెన్నుపోటు ప్రారంభమైందని ఆరోపించారు. బీసీల దగ్గర నుంచి మైన్స్ ను రాజారెడ్డి లాక్కోవడం వెన్నుపోటు కాదా? బాబాయి వివేకాను హత్య చేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు.