వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో 3200 కోట్ల రూపాయలకుపైగానే సొమ్ములు చేతులు, దేశాలు కూడా మారాయని భావిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఒకే విడతలో శుక్రవారం విచారించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన విచారణలో పలు కీలక ప్రశ్నలు సంధించింది. పక్కా ఆధారాలను ఇప్పటికే సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వాటిని నిందితుల ఎదురుగా పెట్టి.. ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా 2019-24 మధ్య ఈ నిందితులకు వచ్చిన ఆస్తులు, బంగళాలు, కార్లపై ఆరా తీసింది.
తాజాగా శుక్రవారం జరిగిన విచారణలో మద్యం కుంభకోణంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, అప్పట్లో సీఎం జగన్‌కు ఓఎస్‌డీగా పనిచేసి కృష్ణమోహన్‌రెడ్డి, మాజీఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, అకౌంటెంట్ గోవిందప్ప బాలాజీలను ఒకే చోట హాజరు పరిచి.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు వీరిని ప్రశ్నించారు. ఈ క్రమంలో కీలక ఆధారాలను, బ్యాంకు స్టేట్‌మెంట్లను, రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న వివరాలను.. ఇప్పటికే విచారించిన నిందుతులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను కూడా వారి ముందు పెట్టి అనేక ప్రశ్నలు సంధించారు.
వీటిలో ప్రధానంగా 2019-24 మధ్య ఖరీదైన కార్లు ఎక్కడ నుంచి కొన్నారు? ఎలా కొన్నారు? వీటికి సొమ్ములు ఎవరిచ్చారు? అనే విషయాలపై కూపీ లాగారు. అంతేకాదు.. సినిమాల్లో పెట్టుబడులు పెట్టిన రాజ్ కసిరెడ్డికి.. ఆ సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అదేవిధంగా బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన బాలాజీ గోవిందప్పను కూడా ఇదే తరహాలో ప్రశ్నించారు. ఆ సొమ్ములు ఎక్కడ నుంచి వచ్చాయి? భారతీ సిమెంట్స్ మీకు ఇస్తున్న వేతనం.. ఎంత? ఇతరత్రా ఆదాయాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అయితే.. ఆయా ప్రశ్నలకు వారు తెలియదు.. గుర్తులేదు.. అనే రొటీన్ సమాధానాలే ఇచ్చినట్టు తెలిసింది. ఇక, ఈ విచారణ ఇప్పటితో ముగియదని.. మరింత లోతుగా విచారించాల్సి ఉంటుందని సిట్ అధికారులు తెలిపారు.