బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. కవితపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దాగుడు మూతలుగా ఉన్న కవిత వ్యవహారంపై ఆయన క్లూ ఇచ్చేశారు. “మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ పెట్టుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది. అది కవితే అయినా..మరెవరైనా కూడా!” అని తేల్చి చెప్పారు.
అంటే.. కవిత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో గంగుల చేసిన వ్యాఖ్య లు కీలకంగా మారాయి. నిజానికి కవిత పార్టీ పెట్టుకుంటారని ఎక్కడా ప్రకటించకపోయినా.. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆమె ఆదిశగానే అడుగులు వేస్తున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. కానీ.. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా కవిత పార్టీపై ప్రకటనలు చేయలేదు. ఈ నేపథ్యంలో కమలాకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అంతేకాదు.. కవిత పార్టీ పెట్టుకుంటే.. ఎంత మంది ఆమెకు మద్దతుగా నిలుస్తారో.. అప్పుడు తెలుస్తుందని ఓ చిన్నపాటి హెచ్చరికను కూడా కమలాకర్ చేశారు. ఇదేసమయంలో తనతో పాటు తనలాంటి వారు ఎవరూ కవితతో నడిచే పరిస్థితి లేదని.. తమకు కేసీఆరే నాయకుడని.. ఆయన వెంటే నడుస్తామన్నారు. అయితే.. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిర్గతం చేయడం ఎంతవరకు సమంజసమో.. కవిత ఆలోచించుకోవాలన్న సూచన చేశారు.
ఇక, కవితను తెలంగాణ సమాజం కేసీఆర్ కుమార్తెగానే ఇప్పటి వరకు కూడా చూసిందన్నారు. “ఆమె ఎంపీ అయ్యారు.. తర్వాత.. ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవన్నీ.. కేసీఆర్ ద్వారానే వచ్చాయి. కాబట్టి ఆమెను కేసీఆర్ కూతురుగానే చూస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నాక.. ఏం జరుగుతుందో చూడాలి.” అని గంగుల వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates