వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందని.. దాదాపు 3200 కోట్లరూపాయలకు పైగానే ప్రజా ధనాన్ని దోచుకున్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బృందం వేగంగా పనిచేస్తోంది. అనేక మందిని అరెస్టు కూడా చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తనను సాక్షిగా పిలిస్తే.. మరిన్ని కీలక విషయాలు..తనకు తెలిసిన అంశాలను సోదాహరణంగా వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం రమేష్ వెల్లడించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇంకా కీలక విషయాలపై దృష్టి పెట్టినట్టుగా లేరని అన్నారు. నెల నెల రూ.5 కోట్ల వరకు జగన్ మనుషులు నొక్కేశారని.. వైన్ దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారని రమేష్ వ్యాఖ్యానించారు.
ఆయా వివరాలన్నీ.. తన వద్ద ఉన్నాయని చెప్పిన ఆయన.. వాటిని అధికారులకు ఇచ్చేందుకు.. మరింత లోతుగా విషయాలను వెల్లడించేందుకు సాక్ష్యాలతో సహా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనను సిట్ పిలిస్తే.. అవన్నీ వారికి వివరిస్తానని వెల్లడించారు. ఉద్యోగులే కాకుండా.. సెక్యూరిటీ సిబ్బంది నుంచి కూడా వేతనాలపై కమీషన్లు తీసుకున్నారని.. ఇది కూడా నెలకు రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పు కొచ్చారు. దీనిపై నా తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.
జగన్‌కు సవాల్
ఇక, తన విద్యుత్ కంపెనీల విషయంలో లాలూచీ పడ్డానన్న జగన్ విమర్శలపైనా ఎంపీ రమేష్ స్పందించారు. తాను అక్రమాలకు ఒడిగట్టినట్టు నిరూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. లేకపోతే.. జగన్ తన పార్టీని మూసేస్తారా? అని సవాల్ రువ్వారు. ప్రస్తుతం రమేష్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఆయనను సిట్ అధికారులు పిలుస్తారా? లేదా? అనేది చూడాలి.