వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాయిరెడ్డికి క్రెడిబులిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజ శేఖర్ తో తనకు సంబంధం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోని తాజాగా విజయసాయిరెడ్డిపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని జగన్ షాకింగ్ కామెంట్ చేశారు.
వైసీపీకి సరిపడా ఎమ్మెల్యే లేరని, మరోసారి రాజ్యసభ అవకాశం తనకు ఉండదని విజయసాయి రెడ్డి భావించారని ఆరోపించారు. కాబట్టే కూటమి, చంద్రబాబుకు మేలు జరిగేలాగా ప్రలోభాలకు లొంగిపోయారని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటువంటి విజయసాయిరెడ్డి చెప్పిన స్టేట్మెంట్ కు విలువ ఎక్కడ ఉంటుందని జగన్ ప్రశ్నించారు. లోక్ సభ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం ఉందని జగన్ ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ లను జైల్లో పెట్టిన చరిత్ర లేదని, సీనియర్ అధికారులకు పోస్టింగ్ లేకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.
లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక ఫైల్ అయినా సరే సీఎంవోలోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా అని చంద్రబాబుకు జగన్ సవాల్ చేశారు. అరెస్టయిన ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకి ఈ వ్యవహారంతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. అప్రూవర్ గా మారలేదన్న కారణంతోనే కసిరెడ్డిని నిందితుడిగా చేర్చారని జగన్ ఆరోపించారు. ఇక, ఐపీఎస్ లు కాంతి రాణా, జాషువా, విశాల్ గున్నిలను కూడా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని జగన్ ఆరోపించారు.
లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఈరోజు బెయిల్ పై బయట ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో గల్లీగల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయని, మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో అవి నడుస్తున్నాయని ఆరోపించారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, మోసాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే లిక్కర్ కుంభకోణం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.