కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని కొనసాగగా.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నానిని ఓడించిన చిన్ని కొత్తగా బెజవాడ ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మొన్నటిదాకా అంతా బాగానే ఉన్నా.. విశాఖలో అర్సా కంపెనీకి భూముల కేటాయింపుతో ఒక్కసారిగా వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదానికి నాని శ్రీకారం చుడితే… చిన్ని కూడా ఘాటు కౌంటర్లు ఇస్తూ సాగుతున్నారు. ఈ అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఈ పంచాయతీని సర్దుబాటు చేసే వారే లేరా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
సోమవారం పొద్దున్నే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన నాని… వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డితో చిన్నికి సంబంధాలున్నాయంటూ ఓ సంచలన ఆరోపణ గుప్పించారు. నాని, కసిరెడ్డి కంపెనీలకు సంబంధించిన హైదరాబాద్ అడ్రెస్ ఒక్కటేనని, కసిరెడ్డి కంపెనీల్లో చిన్నితో పాటు ఆయన సతీమణికి కూడా వాటాలున్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దుబాయి, అమెరికాల్లోనూ చిన్ని కంపెనీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అంతటితో ఆగని ఆయన కసిరెడ్డితో చిన్నికి సంబంధాలు ఉన్న నేపథ్యంలో మద్యం కుంభకోణంలో కసిరెడ్డితో పాటు చిన్నిని కూడా విచారించాలని నాని డిమాండ్ చేయడం గమనార్హం.
నాని ఆరోపణలపై చిన్ని కూడా వేగంగానే స్పందించారు. హైదరాబాద్ లోని తన కంపెనీ ఉన్న ప్రాంతానికి సమీపంలోనే కసిరెడ్డి కంపెనీ ఉండేదని తెలిపారు. గతంతో కసిరెడ్డితో ఓ మోస్తరు సంబంధాలు ఉన్నా… రాజకీయాల్లోకి వచ్చినంతనే వాటిని వదిలేశానని కూడా చిన్ని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్న చిన్ని.. తనపై చేసిన ఆరోపణలను నానినే నిరూపించాలని డిమాండ్ చేశారు. తనకు అమెరికా, దుబాయి లలో అసలు కంపెనీలే లేవని కూడా చిన్న తేల్చిచెప్పారు. జగన్ కు గూడఛారిగా వ్యవహరించిన నాని తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కూడా చిన్ని తేల్చేశారు. అసలు నాని ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నారు.
ఇదిలా ఉంటే… అర్సా కంపెనీకి చెందిన ప్రమోటర్లలో ఒకప్పటి చిన్ని సన్నిహితులు, వ్యాపార భాగస్వాములే ఉన్నారని, చిన్ని ప్రోత్సాహంతోనే వారు అర్సా కంపెనీని నెలల క్రితం ఏర్పాటు చేసి భూములు దక్కించుకున్నారని నాని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను కూడా చిన్ని తీవ్రంగానే ఖండించారు వాస్తవానికి రాజకీయాల్లోకి రాకముందు వరకు అసలు వీరిద్దరి మధ్య చిన్న వివాదం కూడా లేదు. ఒకవేళ నాని 2024 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలోకి చేరకపోయి ఉంటే కూడా వీరి మధ్య విబేధాలన్న మాటే ఉండేది కాదేమో. నాని వైసీపీలోకి వెళ్లగానే..చిన్ని టీడీపీలో యాక్టివ్ అయిపోయారు. ఏకంగా విజయవాడ ఎంపీ సీటు కోసం అన్నదమ్ముల మధ్యే ఫైట్ జరిగింది.
గతంలో నాని టీడీపీని వీడి వైసీపీలో చేరినా…ఇప్పుడు ఆయన వైసీపీని కూడా వీడారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అదే సమయంలో ఆయన తిరిగి టీడీపీ గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారన్న విశ్లేషణలూ లేకపోలేదు. రాజకీయాలను టీడీపీతోనే మొదలెట్టిన నానికి టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలతో ఇప్పటికీ సత్సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాని, చిన్నిల మధ్య అంతకంతకూ పెరిగిపోతున్న ఈ వైరాన్ని నివారించే దిశగా టీడీపీ నేతలే అడుగులు వేయాలన్న వాదన అయితే బలంగానే వినిపిస్తోంది. మరి ఆ దిశగా ఏ నేత చొరవ తీసుకుని కేశినేని బ్రదర్స్ మధ్య వైరానికి చెక్ పెడతారో చూడాలి.
This post was last modified on May 5, 2025 11:54 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…