ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. రాజకీయ పరిష్వంగాన్ని వదిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో నేరాలు ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అన్న ప్రశ్నకు నిన్న మొన్నటి వరకు తెలియదు-గుర్తులేదు-మరిచిపోయాం.. అన్న వారే.. ఇప్పుడు నిజాలు కక్కేస్తున్నారు. కీలకమైన రెండు కారణాలతో గుట్టు బయట పెట్టేస్తున్నారు. ఈ పరిణామం వైసీపీ అధినేత జగన్‌కు ఉచ్చు బిగిసేలా చేస్తోంది.
ముఖ్యంగా మద్యం కుంభకోణం, అదేవిధంగా ముంబై నటి జెత్వానీ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎస్‌లు సహా.. వైసీపీ సానుభూతి పరులు, గతంలో జగన్‌తో కలిసి ముందుకు నడిచిన వారుకూడా అరెస్టయ్యారు. ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే.. తొలుత వీరంతా తమకు సంబంధం లేదని.. తాము నిమిత్తమాత్రులమని చెప్పుకొచ్చారు. కానీ, రోజులు, వారాలు, నెలలు గడుస్తున్న నేపథ్యంలో వారే నోరు విప్పేస్తున్నారు.
దీనికి కారణం జగనేనని తాజాగా కసి రెడ్డి రాజ్ చెప్పేశారు. ఇక, ఐపీఎస్‌ల వంతు మాత్రమే మిగిలి ఉంది. అంటే.. మద్యం కుంభకోణంలో అక్రమాలు.. నిధుల మళ్లింపు.. అంతా కూడా.. జగన్ చెప్పినట్టే జరిగిపో యిందని రాజ్ చెప్పడంతో దాదాపు కేసు కొలిక్కి వచ్చేసింది. మరోవైపు జత్వానీ కేసులో కూడా నేడో రేపో నిజాలు బయటకు వచ్చేస్తాయని విచారణాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసు కూడా జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయమన్న చర్చ సాగుతోంది.
ఇలా ఎందుకు..?
వాస్తవానికి కేసుల్లో చిక్కుకున్నవారు రెండురకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1) తామునిన్నటి దాకా ఎవరి మాట అయితే విన్నారో.. ఎవరు చెప్పినట్టు చేశారో.. వారు ఇప్పుడు తమను వదిలేయడం. 2) తాము నిజాలు చెబితే.. కొంత వరకైనా సేఫ్ కావొచ్చన్న కారణం. ఈ రెండు కారణాలతోనే ప్రస్తుతం మద్యం, జెత్వానీ కేసుల్లో చిక్కుకున్నవారు.. నిజాలు చెప్పేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తే.. అది జగన్‌కు మరింత ఉచ్చును బిగిసేలా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates