పెహల్ గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా ఉగ్ర దాడికి సంపూర్ణంగా మద్దతు పలికిన పాకిస్తాన్ పై కఠిన చర్యలకు కూడా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వరుసబెట్టి ఫోన్లు చేశారు. మీ పరిధిలోని రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ జాతీయులను తక్షణమే పాక్ కు పంపేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎంలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. వెరసి భారత్ లోని పాక్ జాతీయులను వారి దేశానికి పంపే దిశగా చర్యలు వేగవంతం అయ్యాయి.
పెహల్ గాం ఉగ్ర దాడిలో ఏకంగా 26 మంది పర్యాటకులు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. ఓ వైపు మృతులను ఇప్పటికే వారి స్వస్థలాలకు పంపిన కేంద్రం.. పాక్ పై కఠిన చర్యలను ప్రకటించింది. పాక్ తో అన్ని రకాల సంబంధాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం… ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ ను కూడా దేశం వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వివిధ కారణాలతో భారత్ వచ్చిన పాక్ జాతీయులు తక్షణమే దేశం వదిలి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యలను పక్కాగా అమలు చేసి… దేశంలోని పాక్ జాతీయులను తక్షణమే పాక్ తరలించేలా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం కేంద్రం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం భారత్ లోని వివిధ ప్రాంతాల్లో 200 మంది దాకా పాక్ జాతీయులు ఉన్నట్లుగా సమాచారం. పర్యాటకులుగా వచ్చిన వారు అతి స్వల్పంగా ఉంటే… వైద్య చికిత్సల కోసం వచ్చిన వారు అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉగ్ర దాడి నేపథ్యంలో వీరి వీసాలను ఇప్పటికే కేంద్రం రద్దు చేసేసింది. అంతేకాకుండా పాక్ జాతీయులు భారత్ ను వీడేందుకు కేవలం 48 గంటల వ్యవధిని మాత్రమే ఇస్తున్నట్లుగా కూడా కేంద్రం డెడ్ లైన్ పెట్టింది. ఈ డెడ్ లైన్ పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలను అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిర్దేశిత సమయంలోగానే పాక్ జాతీయులను దేశం దాటించేయాలని అమిత్ షా ఓ లక్ష్యంతో కదులుతున్నట్లుగా సమాచారం. ఇకపై పాక్ జాతీయులకు ఏ కారణం చేత కూడా వీసాలను జారీ చేయరాదని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా ఇకపై భారత్ లో పాక్ జాతీయుల జాడే కనిపించదని చెప్పక తప్పదు.