ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు దాదాపుగా వీడిపోయినట్టేనని చెప్పాలి. ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి… సీఐడీ విచారణలో భాగంగా ఈ కుంభకోణానికి సంబందించిన మొత్తం గుట్టును విప్పేసినట్లుగానే తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని కూడా ఆయన పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. జగన్ నేతృత్వంలోనే ఈ కుంభకోణం జరిగిందని, వైసీపీ హయాంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపులు ఎలా స్వీకరించాలి? వాటిని ఎలా?.. ఎవరికి ఇవ్వాలి? అన్న ప్రతి అంశంపై కీలక నిర్ణయాలు జరిగాయని కసిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది.
రాజ్ కసిరెడ్డిని సోమవారం పోలీసులు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా ఆయనను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో కసిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబందించిన అన్ని విషయాలను సమగ్రంగా బయటపెట్టేశారట. ఈ మేరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విచారణకు సంబందించిన అంశాలతో ప్రదాన కథనాలను ప్రచురించింది.
ఈ కథనాల ప్రకారం మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు సూత్రధాని జగనేనని తేలిపోయింది. అంతేకాకుండా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ముడుపులు నాడు సీఎంగా ఉన్న జగన్ కు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి చేరాయట. ఇలా ప్రతి నెలా రూ.50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు సీఎంఓకు చేరేవట. ఈ లెక్కన మద్యం కుంభకోణం ద్వారా జగన్ కు మొత్తంగా రూ.3,200 కోట్లు అందాయని తెలిసింది.
ఇక ఈ మద్యం కుంభకోణంలో తాను విజిల్ బ్లోయర్ ని అని చెప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉందని కసిరెడ్డి వెల్లడించారట. సాయిరెడ్డితో పాటుగా వైసీపీ పీఏసీ కన్వీనర్, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికీ కీలక భూమిక ఉందట. ఇక ఈ కుంభకోణం ద్వారా వసూలయ్యే ముడుపులు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలతో పాటుగా మరో వ్యక్తి బాలాజీలకు కూడా వెళ్లేవని కసిరెడ్డి వెల్లడించారు.
అంటే.. మెజారిటీ వాటా జగన్ కు వెళ్లగా… కొంత మొత్తంలో ఈ ముగ్గురికి వెళ్లాయని తేలిపోయింది. వెరసి తనకు ఈ వ్యవహారంతో సంబంధమే లేదని చెబుతున్న మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలు కూడా అడ్డంగా బుక్కైపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నిధులను బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలు, స్థిరాస్తి కంపెనీల్లోకి తరలించేలా వ్యూహం రచించినట్లుగా కసిరెడ్డి బయబపెట్టేశారు.
ఇదిలా ఉంటే… అసలు మద్యం కుంభకోణానికి సంబందించి ప్రాథమిక అడుగు పడింది కూడా తాడేపల్లిలోనేనని కూడా కసిరెడ్డి సిట్ అదికారులకు తెలిపారు. మద్యం పాలసీ, దాని అమలు, ముడుపుల వసూళ్లకు సంబందించి దఫదఫాలుగా భేటీలు జరగగా…అవన్నీ తాడేపల్లితో పాటు హైదరాబాద్, బెంగళూరుల్లో జరిగాయని కసిరెడ్డి చెప్పారు. ఇక ముడుపులు ఇచ్చిన కంపెనీల నుంచే మద్యం కొనుగోలు చేసినట్లు కూడా ఆయన ఒప్పుకున్నారట.
ప్రతి ఐదు రోజులకోమారు ముడుపులు రావాల్సిందేనని కంపెనీలకు షరతు పెట్టి మరీ వసూలు చేశారట. ఇక మద్యం కుంభకోణంలో కీలక స్థావరంగా పరిగణిస్తున్న ఎస్పీవై డిస్టిలరీస్ ను బెదిరించి మరీ ఆ కంపెనీకి చెందిన ప్లాంటుతో పాటు బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నారట. వైసీపీ సర్కారు వేధింపులు తట్టుకోలేకే మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ కుంభకోణంలో పాలుపంచుకోక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మద్యం కుంభకోణం గుట్టును కసిరెడ్డి విప్పేయగా… దీనిపై కూటమి సర్కారు ఏ తరహా చర్యలకు శ్రీకారం చుడుతుందన్నదానిపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates