గుడివాడ-గన్నవరం నియోజకవర్గాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ.. చర్చకు వచ్చేవే. బలమైన నాయకులుగా… ఒకప్పుడు ఈ రెండు నియోజకవర్గాలను శాసించిన.. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు.. ఇతర పార్టీల నాయకులను కదలకుండా మెదలకుండా కూడా చేశారు. చిత్రం ఏంటంటే.. ఇద్దరూ కూడా.. టీడీపీలో ఎదిగిన వారే.. టీడీపీ పంచన మొలిచిన వారే. కానీ.. తల్లిపాలు తాగి ఏదో చేసినట్టుగా.. ఇద్దరూ టీడీపీకి శత్రువులుగా మారారు. పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అంటారు. అలానే.. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పరిస్తితి తిరగబడింది. రెండు చోట్లా ఆ ఇద్దరు నాయకులు పరాజయం పాలయ్యారు. అంతేకాదు.. వారి అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఇంతకీ చెప్పొచ్చేదంటంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ.. వైసీపీ గూళ్లు ఖాళీ అవుతున్నాయి. గుడివాడలో వైసీపీ కార్యాలయంగా ఉన్న ప్రాంతాన్ని యజమాని తీసుకున్నా రు. దీంతో అక్కడ కార్యాలయం తీసేశారు.
ప్రస్తుతం కీలకమైన కార్యాలయం తీసేయడంతో ఎవరూ ప్రశ్నించేవారు కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో ఎన్నారై వెనిగండ్ల రాము విజయం దక్కించుకున్న గుడివాడలో ఇప్పుడు అభివృద్ధి సుమాలు విరుస్తున్నాయని స్థానికులు సైతం చెప్పుకొంటున్నారు. వర్గ పోరు లేదు. బెదిరింపులు లేవు. నా-నీ.. అనే బేధాభిప్రాయాలు సైతం లేకుండా.. పనులు జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో గుడివాడలో వైసీపీ కి చెందిన క్షేత్రస్థాయి నాయకులు కూడా వెనిగండ్ల వైపు మొగ్గు చూపి.. కండువాలు మార్చుకుంటున్నారు.
ఇక, గన్నవరంలో మాజీ వైసీపీ నాయకుడు, ఎన్నికలకు ముందు టీడీపీ చెంతకు వచ్చిన యార్లగడ్డ వెంక ట్రావు కూడా.. ప్రజలకు చేరువగానే ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా.. ఆయన చేరువగా ఉన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కూడా..యార్లగడ్డ వెంట తిరుగుతుండడం గమనార్హం. మరోవైపు.. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న గన్నవరం పరిధిలో ఒకప్పుడు వంశీకి జైకొట్టిన వారు.. ఇప్పుడు వెంకట్రావుకు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates