హైడ్రాపై వసంత ఫైర్.. రేవంత్ న్యాయం చేస్తారని వ్యాఖ్య

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం మరోమారు పెను కలకలం రేపాయి. హఫీజ్ పేట్ పరిదిలోని 17ఎకరాల్లో అక్రమ నిర్మాణాలున్నాయని భావించిన హైడ్రా…వాటిని కూల్చివేసింది. ఈ కూల్చిన నిర్మాణాల్లో ఏపీకి చెందిన కీలక రాజకీయ నేత, టీడీపీ యువ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై తాజాగా వసంత స్పందించారు. హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వసంత… ఈ వ్యవహారాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని, రేవంత్ వద్ద తనకు న్యాయం జరిగి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

హైడ్రా కూల్చివేతల తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న వసంత కృష్ణ ప్రసాద్..తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూముల వ్యవహారంలో ఇదివరకే హైడ్రా నుంచి తనకు నోటీసులు రాగా… తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను తీసుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్దకు వెళ్లానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సదరు పత్రాలన్నింటినీ పరిశీలించిన రంగనాథ్… ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు… ఈ పత్రాలను పరిశీలించి మరింత సమాచారం ఏమైనా అవసరమైతే కబురు పెడతానని చెప్పారని తెలిపారు. తనను చాలా గౌరవంగా కూడా చూసుకున్నారని కూడా వసంత తెలిపారు. అయితే అది జరిగిన తర్వాత తనకు హైడ్రా నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.

హైడ్రా చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని కూడా వసంత సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా కోర్టుకు సెలవు ఉన్న రోజున హైడ్రా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. పేదలైతే… హైడ్రా కూల్చివేతలపై ఎదురు తిరుగుతున్నారని… తాను మాత్రం ఓ బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో హైడ్రాను ఎలా అడ్డుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా చర్యలపై తాను కోర్టును ఆశ్రయిస్తానని కూడా వసంత తెలిపారు. హైడ్రా చేపట్టిన హడావిడి చర్యల కారణంగా తనలాంటి వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని వసంత అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా.. దేశంలో చట్టం ఒకింత కట్టు తప్పి దూకుడుగా సాగినా… అంతిమంగా న్యాయం, ధర్మానిదే గెలుపు అని ఆయన అన్నారు.

హైడ్రా చర్యలపై తాను సీఎం రేవంత్ రెడ్దిని కలుస్తానని వసంత తెలిపారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారని.. రెండు, మూడు రోజుల్లోగా విదేశాల నుంచి రేవంత్ రెడ్డి తిరిగి వస్తారని చెబుతున్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాగానే.. నేరుగా రేవంత్ ను కలుస్తానని ఆయన అన్నారు. రేవంత్ కు తన స్థలం గురించిన వివరాలన్నింటిని వివరిస్తానని తెలిపారు. తనకు ఆ ఆస్తి ఎలా వచ్చిందన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డికి తెలియ జేస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి వద్ద తనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని వసంత అన్నారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం జరిగి తీరుతుందని కూడా వసంత ధీమా వ్యక్తం చేశారు.