వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు.. భాను ప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేస్తామని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమనపై టీటీడీ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌పై ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం కూడాఇదే తొలిసారి అవుతుంది.
ఏం జరిగింది?
కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో భూమన.. టీటీడీ బోర్డుపై నిప్పులు చెరిగారు. తిరుపతి లోని ఎస్వీ గోశాలలో ఈ ఏడాది తొలి మూడు మాసాల్లోనే 100 కు పైగా గోవులు, లేగలు మృతి చెందాయని.. దీనిని టీటీడీ బోర్దు నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. హిందూ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారంటూ.. కొన్ని ఫొటోలతో పాటు ఆయన వరుసగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆరోపించారు. దీనిపై ప్రస్తుత చైర్మన్, ఈవోలు వివరణ ఇచ్చారు.
అనారోగ్యం.. ఇతర కారణాలతో సాధారణంగాఏ గోశాలలో అయినా..ఆవులు మృతి చెందుతాయని.. దీనిని రాజకీయాలకు జోడించి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా .. రాజకీయ అజెండాతో భూమన వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ఆయనపై ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాలతో పాటు.. గత ఇంటెలిజెన్స్ రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఫిర్యాదును రూపొందించారు. దీనిని భాను ప్రకాష్ ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు అందించి.. కేసు నమోదు చేయాలని కోరారు.