వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి వెళ్లిన జగన్.. గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం లింగమయ్య ఇంటి వద్దే జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులపై గతంలో మాాదిరే ఓ రేంజిలో ఫైర్ అయిన జగన్… చట్టానికి కాకుండా అదికార పక్షానికి కొమ్ముకాసే పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దోషులుగా తేలుస్తామని జగన్ వ్యాఖ్యానించారు. ఆపై ఆ పోలీసులను యూనిఫాం ఊడబీకి ఉద్యోగాల్లేకుండా చేస్తామని జగన్ హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులు అధికారులు తమ తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లింగమయ్యపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడి ఆయనను హత్య చేశారని జగన్ ఆరోపించారు. బేస్ బాల్ బ్యాటుతో టీడీపీ వ్యక్తులు లింగమయ్య తలపై కొట్టగా… ఆ దాడిలో ఆయన చనిపోయారని తెలిపారు. ఈ ఘటనలో 20 మంది దాకా పాలుపంచుకుంటే.. పోలీసులు కేవలం ఇద్దరి మీద కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అధికార పార్టీ నేతను ఎందుకు వదిలేశారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడు స్వయంగా పాపిరెడ్డిపల్లి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, అయినా కూడా ఆయనపై కేసులు నమోదు చేయలేదని జగన్ ఆరోపించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పలు కీలక ఘటనలను జగన్ ప్రస్తావించారు. అందులో భాగంగా ఆయన ఇటీవలే అరెస్టై రోజుల తరబడి జైలులో గడిపిన సినీ ప్రముఖుడు పోసాని కృష్ణ మురళితో మొదలుపెట్టి… ఇంకా జైలు జీవితం గడుపుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఉదంతాలను ప్రస్తావించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టులను కూడా జగన్ ప్రస్తావించారు. వైసీపీ నేతలను వేదించడమే లక్ష్యంగా కూటమి సర్కారు రెడ్ బుక్ పాలనను సాగిస్తోందని ఆయన ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే… ఆ విషయాలను డైవర్ట్ చేసేందుకే టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అయినా మెజారిటీ కలిగిన స్థానిక సంస్థలను గెలవలేమని తెలుసుకుని కూడా టీడీపీ ఎందుకు దౌర్జన్యాలకు దిగుతోందని ఆయన ప్రశ్నించారు.
లింగమయ్య హత్యకు దారి తీసిన రామగిరి మండల పరిషత్ వైస్ చైర్మన్ ఎన్నికను జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నిక జరగాల్సిన రోజున తమకు భద్రత లేదని వైసీపీ ఎంపీటీసీలు కోర్టుకు విన్నవిస్తే… కోర్టు ఆదేశాలతో పోలీసు భద్రత మధ్య ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి తరలివెళ్లారని జగన్ అన్నారు. ఈ సందర్భంగా సెలవుపై ఉన్న రామగిరి ఎస్సై సుధాకర్… అనధికారికంగా సదరు కాన్వాయ్ లోకి ప్రవేశించి వైసీపీ ఎంపీటీసీలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో వీడియో కాల్ లో మాట్లాడించారన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఓ మహిళా ఎంపీటీసీ తల్లిదండ్రులను ఎమ్మెల్యే అనుచరులు బంధించి… టీడీపీకి ఓటేస్తేనే ఆమె తల్లిదండ్రులను వదిలిపెడతామని బెదిరించారని ఆరోపించారు. ఈ తంతు మొత్తం ఎస్సై సుధాకర్ కళ్ల ముందే జరిగిందన్నారు. అయినా కూడా ఆ మహిళా ఎంపీటీసీతో పాటు ఇతర ఎంపీటీసీలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఒప్పుకోలేదని, దాంతో వారిని ఎంపీపీ కార్యాలయానికి కాకుండా పెనుగొండకు తరలించారన్నారు. ఈ విషయం తెలుసుకున్న తమ పార్టీ నేతలు ఉషాశ్రీ చరణ్ , తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు అక్కడికి వెళితే… వారిపైనే కేసులు నమోదు చేశారని జగన్ మండిపడ్డారు.