వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం పాపిరెడ్డిపల్లికి వెళుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీడీపీ వర్గీయుల దాడిలో చనిపోయినట్లుగా వైసీపీ ఆరోపిస్తున్న ఆ పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకే జగన్ ఆ గ్రామానికి వెళుతున్నారు. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరిటాల సునీత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గంలోకి జగన్ వస్తున్నారని… దమ్ముంటే అడ్డుకోవాలని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పరిటాల సునీత సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సోమవారం ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ టూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులు చెబుతున్నట్లుగా జగన్ ను రాప్తాడుకు రాకుండా అడ్డుకోవాలని తాము భావించడం లేదని సునీత అన్నారు. జగన్ ను రాప్తాడుకు రాకుండా అడ్డుకోవాలంటే ఆ పని వేరే ఎవ్వరితో పనిలేకుండా తానే జగన్ ను ఆపగలనని ఆమె అన్నారు. జగన్ ను ఆపే దమ్ముంది.. ఆ ధైర్యం కూడా తనకు ఉందని ఆమె అన్నారు. జగన్ హెలికాప్టర్ ను దిగకుండా తిప్పి పంపే శక్తి కూడా తనకు ఉందని కూడా సునీత వ్యాఖ్యానించారు. తమలో ప్రవహిస్తున్నది టీడీపీ, చంద్రబాబు, పరిటాల రవీంద్ర రక్తమని ఆమె మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబు తమకు ఆ సంస్కృతి నేర్పలేదని ఆమె అన్నారు. అందుకే సంయమనం పాటించమని తమ కార్యకర్తలకు చెప్పానని ఆమె అన్నారు.
జగన్ రాప్తాడుకు వస్తాను, చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తామంటే తామెందుకు వద్దంటామని కూడా పరిటాల సునీత అన్నారు. తాము కూడా జగన్ ను రమ్మనే చెబుతున్నామని, పెద్ద దిక్కును కోల్పోయిన బాధితుడి కుటుంబానికి అంతో ఇంతో సాయం చేయమనే చెబుతున్నామన్నారు. సున్నితమైన అంశాలను ఆసరా చేసుకుని టీడీపీ శ్రేణనులను రెచ్చగొట్టేలా తోపుదుర్తి బ్రదర్స్ ఉసిగొల్పే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడిన సునీత… ఇప్పటికైనా వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్వస్తి పలకాలని సూచించారు. వైసీపీ నేతలు ఎంతగా రెచ్చగొట్టినా వాటిని పట్టించుకోవద్దని తన కార్యకర్తలకు చెప్పేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని కూడా సునీత చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates