కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సిలిండర్ పై రూ.50 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు సబ్సీడీ గ్యాస్ కనెక్షన్లతో పాటుగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు, చివరాఖరుకు ఉజ్వల పథకం కింద అందిస్తున్న సిలిండర్లకూ వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ పెరిగిన ధరలను మంగళవారం నుంచే అమలులోకి రానున్నట్లుగా కూడా కేంద్రం ప్రకటించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వంట గ్యాస్ ధరలు పెరిగిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే… పెట్రోెల్, డీజిల్ పై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని కూడా కేంద్రం 2 శాతం మేర పెంచింది. ఈ పెంపుతో పెట్రోల్ పై లీటరుకు రూ.13, డీజిల్ పై లీటరుకు రూ.10 మేర ఎక్సైజ్ సుంకం చేరింది. ఎక్సైజ్ సుంకాన్ని 2 శాతం పెంచినా కూడా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వినియోగదారులపై ఎలాంటి భారం మోపడం లేదని కేంద్రం ప్రకటించింది. పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని చమురు కంపెనీలే భరిస్తాయని, ఈ కారణంగా ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం ప్రకటించింది. పెంచిన ఎక్సైజ్ సుంకాలు సోమవారం అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నట్లు ప్రకటించింది.
వంట గ్యాస్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం .. పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం పెంచకపోవడం గమనార్హం. ఇదే విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఓ సుదీర్ఘ వివరణను ఇచ్చారు. వంట గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న తాము… ఎక్సైజ్ సుంకాలను పెంచినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం పెంచలేదని ఆయన ప్రకటించారు. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కూడా ఆయన ప్రకటించారు. గ్యాస్ ధరలు పెంచినట్లే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates