ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ భూతంగా మారుతున్న ఈ రోజుల్లో, కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్‌ను నియంత్రించేందుకు రాష్ట్రాలకే పూర్తి అధికారముందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గనిర్దేశం లభించిందనే చెప్పాలి.
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇస్తూ, మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ – “ఇది రాష్ట్రాల పరిధిలోని అంశం. రాజ్యాంగం రాష్ట్రాలకు చట్టాలు రూపొందించే అధికారం ఇచ్చింది. కేంద్రం తన బాధ్యతను విస్మరించలేదని, ఇప్పటికే 1,410 గేమింగ్ సైట్లను నిషేధించామని” తెలిపారు. దీంతో ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ గేమ్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, కొందరు జీవితాలను కోల్పోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న తరుణంలో కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రకటన కీలక మలుపు తీసుకురావొచ్చు. రాష్ట్రాలు సొంతంగా చట్టాలు రూపొందించుకుని నేరుగా చర్యలు తీసుకోవచ్చు.
ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వాలపై భాద్యత మరింత పెరిగింది. కేంద్రం ఇచ్చిన స్పష్టత నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు సమర్థవంతంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నియంత్రించేలా చట్టాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. గేమింగ్ యాప్స్ ముసుగులో బెట్టింగ్ మాఫియా ఆడుతున్న ఆటకు చెక్ పెట్టాలంటే ఇదే సరైన సమయం.