రాత్రికి రాత్రి ఫోన్లు మోగాయి.. ఉదయానికల్లా.. చిలకలూరిపేటలోని టీడీపీ కార్యాలయం సండదిగా మారి పోయింది. పల్నాడు జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారు.. టీడీపీ ఆఫీస్‌ను వెతుక్కుంటూ వచ్చేశారు. మరికాసేపటికి వారిని వెతుక్కుంటూ.. మీడియా చానెళ్లు పోగుపడ్డాయి. కట్ చేస్తే.. వారంతా మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ బాధితులు! అసలే.. ఆమెపై స్టోన్ క్రషర్ యజమాని చేసిన ఫిర్యాదుతో కేసు నమోదై ఉన్న తరుణంలో గోరుచుట్టుమీద రోకలి పోటు అన్నట్టుగా.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేసిన రాజకీయం సక్సెస్ అయింది.
ఇక్కడ ఎవరూ ఎవరిపైనా జాలి పడాల్సిన అవసరం లేదు. రాజకీయం అంటే అంతే! ప్రత్యర్థుల తీరు ఇంతే!! అన్నట్టుగా పేట రాజకీయాలు మారుతున్నాయి. గతంలో పుల్లారావు కుమారుడిపై జీఎస్టీ అధికారులు కేసు నమోదు చేసినప్పుడు.. వైసీపీ నాయకులు కూడా ఇలానే చేశారన్న వాదన ఉంది. కాబట్టి.. ఇప్పుడు తన ప్రత్యర్థులపై పుల్లారావు ఇలా చేయడంలో తప్పేలేదు! అనే టాక్ వినిపించింది. ఇక, తాజాగా టీడీపీ ఆఫీసుకు వచ్చిన వారంతా గతంలో రజనీకి సొమ్ము ఇచ్చిన వారే!
చాలా మంది నుంచి రూ.లక్షలు, కోట్ల రూపాయల్లోనే రజనీ సొమ్ములు తీసుకున్నారన్నది బాధితులు చెప్పిన కథనాలను బట్టి తెలుస్తోంది. ఇంటికో పువ్వు.. అన్నట్టుగా రజనీ పరివారం అందిన కాడికి ఆబగా తీనేశారన్నది బాధితులు చెప్పిన మాట. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క గాధ, బాధ! మొత్తంగా కీలకమైన కేసు నడుస్తున్న సమయంలో రజనీని మరింత డైల్యూట్ చేయడంలోనూ.. మరింతగా ఆమెను ఇరుకున పెట్టడంలోనూ.. మాజీ మంత్రి పుల్లారావు వేసిన స్కెచ్ అద్భుత: అనే రేంజ్‌లో ఉందని పార్టీ నేతలు మురిసిపోయారు.
ఇక, రజనీ విషయానికి వస్తే.. నలువైపుల నుంచి చుట్టుముట్టిన వివాదంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క స్టోన్ క్రషర్ యజమాని నుంచే కాకుండా.. సామాన్యుల నుంచి పార్టీ కార్యకర్తల నుంచికూడా ఆమె సొమ్ములు వసూలు చేశారని బయటకు పొక్కడంతో ఎవరూ ఆమెపై సానుభూతి చూపించే పరిస్థితి లేకుండా పోయింది. సహజంగా బీసీ మహిళ అనే సానుభూతి రాజకీయాల్లో ఉంటుంది. కానీ, ఈ సానుభూతి పెరుగుతుందన్న లెక్కలు వేసుకున్న పుల్లారావు.. ఎక్కడా లేటు కాకుండా.. సానుభూతిపై వేటేసేయడం గమనార్హం.