టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒక్కసారి చెబితే నిజంగానే వంద సార్లు చెప్పినట్టే. అదేదో సినిమా డైలాగ్ లా స్ఫూరించినా…చంద్రబాబు మాట చెప్పారంటే అది జరిగి తీరుతుంది. ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మరింత శ్రద్ధగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందిస్తున్న చంద్రబాబు.. గతంలో వారికి దక్కకుండాపోయిన సర్కారీ నిధులను కూడా విడుదల చేస్తున్నారు. ఉద్యోగులకు పలు పద్దుల్లో బకాయి పడ్డ నిధులను విడుదల చేసేశారు. ఆ నిధులు ఇఫ్పుడు ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగుల సంఘం ఏపీఎన్జీవో సోమవారం గర్వంగా తెలియజేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉద్యోగులకు క్రమం తప్పకుండా చెల్లించాల్సిన సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ నిధులను విడుదలే చేయలేదు. ఫలితంగా ఈ పద్దుల్లో ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ఎత్తున బకాయి పడింది. వైసీపీ అధికారం దిగిపోయే నాటికి ఈ బకాయిలు ఏకంగా రూ.7 వేల కోట్లను దాటిపోయాయి. ఉద్యోగులపై దాదాపుగా బెదిరింపులకు దిగుతూ పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇదేమిటని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేకపోయారనే చెప్పాలి. అయితే ఉద్యోగుల మాటకు అత్యంత విలువ ఇచ్చే చంద్రబాబు సీఎం కాగానే… ఉద్యోగులంతా ఆయన వద్ద తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు.
ఉద్యోగుల కష్టాలను తెలుసుకున్న చంద్రబాబు చాలా వేగంగా స్పందించారు. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగుల బకాయిల్లో రూ.1,033 కోట్లను చెల్లించి..ఉద్యోగుల కష్టాలను కొంతమేరకైనా తీర్చారు. అసలే నిధుల కొరతతో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉన్నప్పటికీ…వివిధ పద్దుల నుంచి సర్దుబాటు చేసి మరీ చంద్రబాబు వారి బకాయిలు విడుదల చేశారు. తాజాగా మిగిలిన బకాయిలను ఒకే దఫా విడుదల చేయాలని తీర్మానించారు. అందుకోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ఆయన మిగిలిపోయిన రూ.6,200 కోట్లను తక్షణమే ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో శుక్రవారమే ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయగా…సోమవారం ఆ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో పడిపోయాయి.