ఫైర్ బ్రాండ్స్ సైలెంట్‌.. వైసీపీలో కీల‌క ఆర్డ‌ర్ ..!

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుల‌కు కొద‌వ‌లేదు. ఎమ్మెల్యేల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. సినీరంగం నుంచి ఇత‌ర క‌ళాకారుల దాకా అనేక మంది వైసీపీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హరించారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. విదేశాల‌కు చెందిన ‘పంచ్‌’ ప్ర‌భాక‌ర్ వంటి వారు.. సైతం.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. తీవ్ర విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌కు దిగారు. ఇక‌, మంత్రులుగా ఉన్న కొడాలి నాని, రోజా.. వంటివారు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు వారంతా సైలెంట్ అయ్యారు. వీరితోపాటు.. అమెరికా స‌హా ఇత‌ర దేశాల‌కు చెందిన వైసీపీ మ‌ద్ద‌తు దారులు కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వారి మాట కూడా వినిపించ‌డం లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగింది? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్టు, ఆయ‌న‌ను ప‌లు స్టేష‌న్ల చుట్టూ తిప్పిన ద‌రిమిలా.. అనేక మంది నాయ‌కులు భ‌య‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఒక కేసులో బెయిల్ వ‌చ్చాక‌.. మ‌రో కేసు న‌మోదు చేయ‌డం కూడా తెలిసిందే.

దీంతో వారు భ‌యానికి గుర‌య్యారు. అదేస‌య‌మంలో పార్టీ నుంచి వారికి స‌రైన మ‌ద్ద‌తు కూడా ల‌భించడం లేదు. అరెస్టయిన వారికి న్యాయ స‌హాయం చేయ‌డం.. సాధ్య‌మైనంత వేగంగా వారు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం వంటివి పార్టీలు చేయాల్సిన ప‌ని. కానీ, ఈ విష‌యంలో వైసీపీ అధినేత చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హరించార‌న్న టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల వారీగా కూడా.. ఇప్పుడు వివాదాలు చెల‌రేగుతున్న నేప‌థ్యంలో వైసీపీ పాత్ర త‌గ్గిపోయింది.

ఈ క్ర‌మంలో ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ అయ్యారు. లేక‌పోతే.. మీడియా ముందు నిరంత‌రం.. వారు అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌లు చేసేవారు. కానీ.. ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున మాట్లాడితే..ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యం వెంటాడుతోంది. ఈ స‌మ‌యంలో వైసీపీ కీల‌క ఆదేశాలు జారీ చేసిందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏమీ కాదు.. మేమున్నాం.. మీరు మీడియా ముందుకు రావాల‌ని కోరుతూ.. ఇటీవ‌ల పార్టీ త‌ర‌ఫున అంత‌ర్గ‌త వాట్సాప్ గ్రూప్‌ల‌లో స‌మాచారం వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు మాత్రం మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ముందుగా వారి భ‌యాన్ని తొల‌గించేందుకు వైసీపీ అధినేత ప్ర‌య‌త్నిస్తారో లేదో చూడాలి.