కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి ఏపీ శాఖకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. గతంలో అధ్యక్షులుగా ఉన్న వారికి భిన్నంగా సాగుతున్న సోము వీర్రాజు.. పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పక తప్పదు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతారేకాలు వ్యక్తమవుతున్నాయి.
అయినా సోము వీర్రాజు తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటంటే.. తనను కలిసేందుకు వచ్చే వారు తమ వెంట తీసుకువచ్చే శాలువాలకు ఇకపై స్వస్తి చెప్పాలని ఆయన విజ్ఝప్తి చేశారు. నన్ను కలవడానికి వచ్చేవారు శాలువాలు తీసుకురావద్దని, వాటికి బదులుగా పేదలకు ఉపయోగడే వస్త్రాలు తీసుకురావాలని వీర్రాజు పార్టీ శ్రేణులకు సూచించారు. ‘నేటి నుండి పూర్తిస్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను. నన్ను కలిసే సందర్భాల్లో గౌరవార్థంగా తీసుకొచ్చే శాలువాలకు బదులుగా పేదల సహాయం కొరకు ఉపయోగపడే వస్త్రాలు మాత్రమే తీసుకుని రావాల్సిందిగా కోరి ప్రార్ధిస్తున్నాను’ అని ఆయన ఓ విస్పష్ట ప్రకటనను విడుదల చేశారు.
ఈ దిశగా తాను తీసుకున్న ఈ నిర్ణయంపై మరింత వివరణ ఇచ్చిన వీర్రాజు ఏమన్నారంటే… ‘‘పేదల అవసరాలకు వీలుగా మనం వస్త్రదానం కూడా చేయొచ్చు. నిరూపయోగమైన శాలువాలతో వేల రూపాయల వృథా చేసే కార్యక్రమాన్ని నేటితో విరమించుకోవాల్సిందిగా నాయకులు, కార్యకర్తలందరికీ మనవి. పేదలకు పంచేందుకు వీలుగా ఉండే తువ్వాళ్లు, లుంగీలు, పంచలు లాంటి వస్త్రాలు పేదల సహాయార్థం స్వీకరించబడతాయి’ అని సోము వీర్రాజు సదరు ప్రకటనలో చెప్పారు. వీర్రాజు తీసుకున్న ఈ నిర్ణయం ఇతర నేతలు కూడా తీసుకుంటే ఎంత మంచి జరుగుతుందో కదా.
Gulte Telugu Telugu Political and Movie News Updates