వైరల్ వీడియో… పోసానితో సీఐడీ పోలీసుల ఫొటోలు

టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ వైరి వర్గాలకు చెందిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అసభ్యపదజాలంతో దూషించారన్న కేసుల్లో అరెస్టైన పోసాని ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసు కస్టడీ ముగించుకుని పోసాని జైలులోకి వెళుతున్న సందర్భంగా సీఐడీ అధికారులు ఆయనతో పొటోలు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

అసభ్య పదజాలంతో కూడిన దూషణల వ్యవహారంలో నమోదైన దాదాపుగా అన్ని కేసుల్లోనూ పోసానికి ఊరట లభించినా… ఎప్పుడో నమోదైన కేసు బూజును దులిపిన సీఐడీ అధికారులు పోసానికి తిరిగి చుక్కలు చూపిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, అందుకోసం పోసానిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు… పోసానిని ఒకరోజు కస్టడీకి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జైలు నుంచి సీఐడీ అధికారులు పోసానిని కష్టడీలోకి తీసుకుని సాయంత్రం 5 గంటల దాకా విచారించారు.

విచారణ ముగిసిన తర్వాత పోసానిని సీఐడీ అదికారులు తిరిగి జైలుకు తరలించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా… జైలు లోపలికి వెళ్లేందుకు పోసాని సిద్ధపడగా.. ఆయన వెంట వచ్చిన సీఐడీ అధికారులు ఓ ఫొటో కావాలంటూ పోసానిని కోరారు. ఫొటో అడుగుతున్నది సీఐడీ అధికారులు కదా.. పోసాని ఎలా కాదంటారు? ఆయన సరేననగానే… వయసులో ఒకింత సీనియర్ గా ఉన్న ఓ సీఐడీ అధికారి తన ఫోన్ ను తన సహోద్యోగికి ఇచ్చి పోసాని పక్కన నిలబడి ఫొటో తీయించుకున్నారు. ఆ తర్వాత మరో సీఐడీ అధికారి కూడా ఇదే బాటన నడిచారు. ఈ తంతును అంతా రికార్డ్ చేసిన ఓ మీడియా సంస్థ దానిని సోషల్ మీడియాలో పెట్టేసింది.