బ్రేకింగ్… పోలీసు కస్టడీకి పోసాని

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి సోమవారం మరో షాక్ తగిలింది. ఇప్పటికే గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. పోసానిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు… పోసానిని ఒక్క రోజు విచారించేందుకు పోలీసులకు అనుమతించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని విచారించేందకు కోర్టు పోలీసులకు అనుమతించింది.

వైసీపీ అధికారంలో ఉండగా…ఆ పార్టీ నేతగా కొనసాగిన పోసాని…టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లతో పాటు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోసాని వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీశాయంటూ టీడీపీ, జనసేనలకు చెందిన పలువురు కార్యకర్తలు తమ పరిదిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోసానిపై దాదాపుగా 17 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న పోసాని.. హైకోర్టు ఆర్డర్స్ తో మరికొన్ని కేసుల్లో అరెస్టు నుంచి మినహాయింపు పొందారు.

ఇక విడుదలే తరువాయి అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సందర్భంగా సీఐడీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి… వారు నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే పోసాని ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. ఈ కేసులోనూ బెయిల్ కోసం పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టనుంది. బెయిల్ పై విచారణ జరుగుతున్న రోజే పోసానిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కేసుల్లో ఆయనను విచారించనున్నారు. మరి ఈ విచారణలో పోసాని పోలీసులకు ఎలాంటి వివరాలు చెబుతారోనన్న అంశంపై ఆసక్తి నెలకొంది.