ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కీలక అప్డేట్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణానికి మరో నాలుగు సంవత్సరాలు పడుతుందని అను కున్నప్పటికీ.. తాజాగా మారిన అంచనాల ప్రకారం.. రాజధానిని కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారాయణ తాజాగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగా.. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చుకావని కూడా వెల్లడించారు.
రాజధాని నిర్మాణానికి పూర్తిగా 64వేల 721 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అదేవిధంగా 2028 నాటికి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం వచ్చే ఎన్నిక ల నాటికి తమకు అతి పెద్ద అజెండా అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో కీలక ప్రాంతాలైన ప్రభుత్వ భవనాలు, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ ఇళ్ల నిర్మాణాలు వంటివాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు.
ఈ నెల 12 లేదా 13వ తేదీల నుంచి రాజధాని పనులు ప్రారంభమై.. శర వేగంగా పుంజుకుంటాయని మంత్రి చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మాణాలను పూర్తి చేయనున్నట్టు వివరించారు. ఇదేసమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా మరో 2000 కోట్ల రూపాయల వరకు(1500 కోట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది) గ్రాంట్ల రూపంలో తీసుకురానున్నట్టు తెలిపారు.
అదేవిధంగా రాజధాని రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లను కూడా మూడేళ్లలోనే వారికి తిరిగి అప్పగిస్తామన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. వారికి ఎట్టి పరిస్థితిలోనూ న్యాయం చేయనున్నట్టు మంత్రి వివరించారు.