ఏపీలో వైసిపి హయాంలో టిడిపి నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు వేధింపులకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను వదలబోమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఆ క్రమంలోనే రెడ్ బుక్ లో పేర్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి చట్టపరంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు పింక్ బుక్ మొదలుబెట్టి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి పింక్ బుక్ ప్రస్తావనను ఎమ్మెల్సీ కవిత తెచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు. బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు, అధికారులు, పోలీసులు వేధిస్తున్నారని, అటువంటి వారి పేర్లను పింక్ బుక్ లో నోట్ చేస్తున్నామని కవిత అన్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులు , అధికారులు అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకున్నారని, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడితే ఏమీ రాదని, పాలనపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కవిత హితవు పలికారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నానని, కవిత వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా పింక్ బుక్ ను మెయిన్ టెయిన్ చేస్తామని, తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేవారు ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టబోమని, అధికారంలోకి రాగానే పింక్ బుక్ ను అమలు చేస్తామని కవిత తేల్చి చెప్పారు. పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటామని, తమ టైం వస్తుందని, అప్పుడు అందరి సంగతి చెప్తామని కవిత హెచ్చరించారు.