పొన్నవోలు పోరాటం పోసానికి కలిసిరాలేదు

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదిస్తూ నంది అవార్డుల ప్రతిష్ఠను మంటగలిపారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పోసాని ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఓబుళవారిపల్లెకు తరలించారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పార్టీని వీడినా కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… పోసాని అరెస్టును ఖండిస్తూ ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. వైసీపీ ప్రదాన కార్యదర్శిగా ఉన్న ప్రముఖ న్యాయవాదిని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పోసానికి అండగా పంపించారు. పోసానికి బెయిల్ ఇప్పించాల్సిందేనని జగన్ ఆదేశాలు జారీ చేయడంతో పొన్నలోలు శక్తివంచన లేకుండా కృషి చేశారు. రైల్వే కోడూరు కోర్టులో పోసాని బెయిల్ కోసం పొన్నవోలు ఏకంగా 8 గంటల పాటు పోరాడారు. అది కూడా రాత్రి వేళ ఇంతగా పోరాటం జరిగినా కూడా పోసానికి ఉపశమనం అయితే లభించలేదు. రిమాండ్ విధించాలని పోలీసులు…బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు… రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు విడతలవారీగా న్యాయమూర్తి ముందు హోరాహోరీ వాదనలు వినిపించారు.

అయితే చివరకు పొన్నవోలు వాదనలు వీగిపోగా… పోసానికి న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో శుక్రవారం ఉదయం పోసానిని పోలీసులు కడపలోని కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. ఇదిలా ఉంటే… హైదరాబాద్ లో అరెస్ట్ అయిన పోసానిని పోలీసులు ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ ఏకంగా 9 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. సినీ పరిశ్రమపై చేసిన కుల ఆరోపణలకు నేపథ్యమేంటి అన్న దిశగా పోలీసులు పోసానిని పరిపరి విధాలుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో రెండు పర్యాయాలు పోసానికి పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఇందుకోసం వైద్యులు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ పరుగులు పెట్టాల్సి వచ్చింది.