తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్‌రెడ్డి పాలన ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఒకదఫా పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత.. ఇప్పుడు కీలకమైన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. వీటికి మరో మూడు రోజుల్లోనే పోలింగ్ జరగనుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారుకు లిట్మస్ టెస్ట్ ప్రారంభమైం దని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా.. ఎమ్మె ల్సీ ఎన్నికలు అంటే.. పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. కానీ, మారుతున్న రాజకీయాలు.. నేతల వ్యవహార శైలి కారణంగా..ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించిన పోరుగా పరిణమించాయి. నిజానికి ప్రజలు అందరికీ సంబంధించిన ఎన్నికలు కావు. పట్టభద్రులైన ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదేవిధంగా ఉపాధ్యాయులు మాత్రమే ఓట్లు వేస్తారు.
అయినా.. రాజకీయంగా మాత్రం ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యంతో ముడిపడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసిందని.. నూతన ఉద్యోగాలు 50 వేల కు పైగా ఇచ్చిందని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దంచికొడుతోంది. ఇక, బీజేపీ రేవంత్ సర్కారు లోపాలను ఎండగడుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా ఓటింగ్ వేస్తుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలు హాట్ హాట్‌గా మారాయి.
ఇవీ స్థానాలు..
+ కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ
+ కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ
+ ఖమ్మం- వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
బరిలో వీరు..
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలలో బీఆర్ ఎస్ దూరంగా ఉండగా.. కాంగ్రెస్, బీజేపీలు తలపడుతున్నాయి. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ మూడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు కూడా బలమైన వ్యక్తులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పట్టభద్రుల స్థానంలో ప్రత్యక్షంగా తలపడుతుండగా.. బీజేపీ మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీని అభిమానించే వారు.. తమకు మొగ్గు చూపుతారని.. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఆశలు పెట్టుకున్నాయి. ఎలా చూసుకున్నా.. ఈ ఎన్నికలు రేవంత్‌రెడ్డి సర్కారుకు లిట్మస్ టెస్టేనని అంటున్నారు పరిశీలకులు.