వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అసెంబ్లీకి వచ్చే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దఫా జగన్ సమావేశాలు వస్తారా? రారా? అన్నది సందేహమే. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా.. పార్టీ వర్గాల మాట వేరేగా ఉందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభకు వెళ్లే విషయంపై కొందరు ఎమ్మెల్యే లు రెడీ అవుతున్నట్టు సమాచారం.
సభకు రాని వారిని నియంత్రించేందుకు స్పీకర్‌కు అవకాశం ఉంది. సభకు ఎందుకు రావడం లేదో.. చెప్పాలని కోరే హక్కు, వివరణ కోరే హక్కు కూడా స్పీకర్‌కు వున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీలోని ఐదు నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు.. ఈ తలనొప్పి మనకెందుకు..? అనే ధోరణిలోనే ఉన్నారు. వీరు నిండా మునగాలని కోరుకోవడమూ లేదు. ఎందుకంటే.. జగన్ ఎలా చేసినా.. ఆయనకు చెల్లుతుంది. కానీ.. తాజాగా వైసీపీ తరఫున పోరాటం చేసి.. కూటమిని ఎదిరించి గెలిచిన వారు ఇలా అనుకునే పరిస్థితి లేదు.
పైగా ఒకరిద్దరు కొత్త ముఖాలు కూడా ఉన్నారు. దీంతో వీరంతా భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకపోతే.. ప్రజలకు ముఖం చూపించలేక పోతున్నామన్న ఆవేదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఐదారుగురు ఎమ్మెల్యేలు తాడేపల్లి శాసనాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే.. దీనిని ముందుగానే గమనించినట్టు.. వైసీపీ కూడా అలర్ట్ అయింది. కూటమివలలో చిక్కుకోవద్దంటూ.. సదరు ఎమ్మెల్యేలకు వర్తమానం పంపుతున్నట్టు సమాచారం.
“అధినేత తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ జవదాటొద్దు. కూటమి నేతలు రెచ్చగొట్టినా మీరు సంయమనం పాటించాలి“ అని బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగానే చెబుతున్నారు. సో.. దీనిని బట్టి తాడేపల్లి శాసనం ఈ దఫా పనిచేయకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. పైగా కీలకమైన పూర్తిస్థాయి బడ్జట్ సమావేశాలు కావడంతో హాజరుకు ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates