వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన సొంత జిల్లా కడపలో సర్కారీ, అటవీ భూములను దురాక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సజ్జల దురాక్రమణలపై ఫిర్యాదులు అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై సర్వే చేపట్టగా…అందులో వాస్తవం ఉందంటూ తేలింది. అయితే తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి భూ దురాక్రమణలకు పాల్పడలేదని చెబుతూ సజ్జల నేరుగా హైకోర్టునే ఆశ్రయించారు. దీంతో అధికారులు చేపట్టిన సర్వే నివేదికను తెప్పించుకున్న హైకోర్టు…మరోమారు సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే పంట భూములకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో కడప జిల్లా ఆర్డీఓ, జిల్లా అటవీ శాఖాధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్ట్స్ కు చెందిన అడిషనల్ డైరెక్టర్లతో కూడిన బృందం గురువారం సజ్జల భూములను రీసర్వే చేయనుంది. ఈ సర్వేలో శాస్త్రీయ పద్ధతులను అవలంభించి.. సజ్జల భూములుగా చెబుతున్న వాటిలో ఏమాత్రం అటవీ, సర్కారీ భూములు ఉన్నాయన్న విషయాన్ని నిక్కచ్చిగా నిగ్గు తేల్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే…కోర్టు ఆదేశాలతో జరుగుతున్న ఈ రీసర్వేలో తేలే అంశాలనే హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సర్వేలో తేలే అంశాలనే ప్రభుత్వం కూడా అదికారికంగా పరిగణించనుంది. ఫలితంగా ఈ రీసర్వేపై అటు సజ్జలతో పాటు ఇటు అధికారుల బృందం ప్రత్యేక దృష్టి సారించాయి. అదే సమయంలో ఈ రీసర్వేపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొందని చెప్పాలి.
కడప జిల్లా పరిధిలో చింతకొమ్మదిన్నె మండలంలో కర్నూలు-కడప జాతీయ రహదారిని ఆనుకుని సజ్జల కుటుంబానికి పెద్దఎత్తున భూములు ఉన్నాయి. ఈ భూముల్లో సజ్జల ఓ ఫామ్ హౌజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఈ భూముల్లో సజ్జల సందీప్ రెడ్డి పేరిట 71.49 ఎకరాలు, సజ్జల జనార్ధన్ రెడ్డి పేరిట 16.85 ఎకరాలు, వై.సత్యసందీప్ కుమార్ రెడ్డి పేరిట 21.48 ఎకరాలు, సజ్జల విజయకుమారి పేరిట 146.75 ఎకరాల భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూముల్లో 55 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ శాఖల భూములున్నట్లు ఇదివరకటి సర్వేలో తేలింది. మరి గురువారం నాటి రీసర్వేలో ఆ మాట ఎంతమేర నిజమన్నది తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates