టీడీపీలో గంటా బృందాన్ని పక్కన పెట్టేసిన బాబు

తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ రాష్ట్ర‌, జాతీయ స్థాయి పార్టీ క‌మిటీల‌కు సంబంధించి పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు బాగానే క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. పార్టీకి దూరంగా ఉంటున్న‌వారు.. పార్టీ నుంచి రేపో మాపో జంప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌వారిని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు. మ‌రీ ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న నేత‌ల‌ను కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విష‌యం టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం టీడీపీని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశారు. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి పొలిట్ బ్యూరో వ‌ర‌కు కూడా పార్టీని మార్చేశారు.

కీల‌క నేత‌లు అనుకున్న‌వారు.. ముఖ్యంగా బీసీల‌కు ప్రాధాన్యం పెంచారు. ఈ క్ర‌మంలోనే అగ్ర‌వ‌ర్ణ నేత‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను ఎక్కువ‌గానే నియ‌మించారు. స్థూలంగా చూస్తే.. పార్టీలో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించేందుకు ఇన్ని ప‌ద‌వులు ఇచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో చిత్రం ఏంటంటే.. నేను పార్టీ బాధ్య‌త‌ల‌ను మోయ‌లేను. నా ఆరోగ్యం, వ‌య‌సు కూడా స‌హ‌క‌రించ‌డం లేదు.. అని మొర‌పెట్టుకుని ఇప్ప‌టికే ఉన్న‌ప‌ద‌విని వ‌దులుకున్న గ‌ల్లా అరుణ‌కుమారికి కూడా చెయ్యిప‌ట్టుకుని తీసుకుని వ‌చ్చి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

అయితే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వంటి కీల‌క నేత‌ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కుతార‌నే పేరున్న నాయ‌కుడిగా గంటా గుర్తింపు పొందారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేసినా ఓడిపోయింది లేదు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో భారీ పోరు ఉంటుంద‌ని, జ‌గ‌న్ గాలి బాగా వీస్తోంద‌ని తెలిసి కూడా విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాదించారు. అలాంటి నాయ‌కుడికి చంద్ర‌బాబు ఎక్క‌డా ఛాన్స్ ఇవ్వ‌లేదు. అంతేకాదు, ఆయ‌న‌కు అనుకూలంగా ఉంటున్న గ‌ణ‌బాబు, మాజీ మంత్రి నారాయ‌ణ‌ల‌కు కూడా పార్టీ క‌మిటీల్లో చోటు పెట్ట‌లేదు.

గ‌త కొన్నాళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు గంటా దూరంగా ఉంటున్నారు. పైగా ఆయ‌న అధికార వైసీపీలోకి చేరిపోతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, ఒక‌టి రెండు సార్లు ఈ ప్ర‌చారంపై స్పందించి, ఖండించిన మంత్రి త‌ర్వాత వాటిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు.కానీ, ఇటీవ‌ల ఏకంగా సీఎం జ‌గ‌న్ అప్పాయింట్‌మెంట్ కూడా ఖ‌రారైంద‌ని, గంటా త‌న కుమారుడు ర‌వితేజ‌ను వైసీపీలో చేర్చ‌నున్నారు. ఆయ‌న సానుభూతి ప‌రుడుగా మారుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇక‌,గంటా పార్టీ వీడితే..తాము కూడా రెడీ అని గ‌ణ‌బాబు వంటి వారు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో వీరికి అవ‌కాశం ఇవ్వ‌లేదని అంటున్నారు. మాజీ మంత్రి నారాయ‌ణ స్వ‌యంగా గంటాకు వియ్యంకుడు కావ‌డంతో ఆయ‌నకు కూడా ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు. మొత్తానికి బాబు వీరు పోయినా ఫ‌ర్వాలేద‌ని డిసైడ్ అయిన‌ట్టున్నారే అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.