కూటమి ప్రభుత్వంలో కలిసి మెలిసి ఉండాలని.. నాయకులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా.. టీడీపీ నేతల తీరు ఏమాత్రం మారడం లేదు. తమ దూకుడు స్వభావంతో వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలోని టీడీపీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవ స్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో రగడపడ్డారు. రోడ్డెక్కి ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏం జరిగింది?
బాపట్ల జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చీరాల. ఇక్కడ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పాలేటి రామారావు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే కొండయ్యకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో చీరాల నుంచి విజయం దక్కించుకున్న కరణం బలరాం వర్గంగా ఉన్న పాలేటి.. 2019 ఎన్నికల తర్వాత.. వైసీపీలోకి వెళ్లారు. అయితే.. మళ్లీ గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనను టీడీపీ స్థానిక నాయకులు పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ, తాను సీనియర్ నాయకుడినని, మాజీ మంత్రినని పాలేటి హవా చలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానంలోని పెద్దల ఆశీస్సులు కూడా తనకే ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని పాలేటి రామారావు నిర్ణయించుకున్నారు. అయితే.. దీనిని స్థానకంగా ఉన్న టీడీపీ నాయకులు విబేదించారు. వైసీపీతో ఇంకా బంధం కొనసాగిస్తున్నారని.. కాబట్టి..ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే అర్హత లేదని వారు చెబుతున్నారు. కానీ, పాలేటి మాత్రం.. తను రాజకీయంగా టీడీపీ మనిషినని.. మధ్యలో జరిగిన దానికి చింతిస్తున్నానని చెబుతూ.. మంగళవారం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే కొండయ్య వర్గం ఆయనను అడ్డుకుంది. ఎమ్మెల్యేకు కూడా సమాచారం ఇవ్వకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా పెడతారని. ప్రశ్నించింది. దీంతో అటు పాలేటి వర్గం, ఇటు కొండయ్య వర్గం దూషించుకున్నాయి.
ఈ క్రమంలో పాలేటి తరఫున వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు రోడ్డెక్కడం మరింత వివాదానికి కారణమైంది. తాము చెప్పినట్టు పాలేటి ఇంకా వైసీపీతోనే అంటకాగుతున్నారని.. ఆయనకు అసలు విగ్రహం పెట్టే అర్హత లేదని కొండయ్య వర్గం నేతలు ఆరోపిస్తూ.. ధర్నా చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు పక్షాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఫలించకపోవడం కేసు పెడతామని హెచ్చరించారు. ఇంతలో జిల్లాకు చెందిన మంత్రి ఒకరు జోక్యం చేసుకుని.. అధిష్టానం దగ్గర తేల్చుకునే వరకు ఎవరూ విగ్రహం పెట్టొద్దని సూచించడంతో ఇరు పక్షాలు శాంతించాయి.