నిన్నా మొన్నటి వరకు ఎన్నికల్లో పోటి చేసే విషయంపైనే ముఖం చాటేసిన సీనియర్ నేతలు తాజాగా పోటికి సై అంటున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పార్టీ పోటి చేస్తుందని ప్రకటించారు. మాజీమంత్రి ప్రకటనతో సీనియర్ నేతలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సోమిరెడ్డి ప్రకటనను తిరుపతిలోని సీనియర్ నేతలెవరు ఏమాత్రం ఊహించలేదని సమాచారం.
తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యం కారణంతో అకాస్మాత్తుగా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆరుమాసాల్లోపు ఉపఎన్నికలు జరగుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్ధానం నుండి పోటి చేయటానికి ప్రతిపక్షాల్లో ఏవి కూడా సిద్ధంగా లేవు. కాకపోతే ప్రకటించాలి కాబట్టి ఉపఎన్నికల్లో పోటీకి బీజేపి రెడీ అంటూ కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమధ్య ప్రకటించేశారు. ఇదే విషయమై ఇంతవరకు జనసేన ఏమీ మాట్లాడలేదు. ఇక కాంగ్రెస్, వామపక్షాలు పరిస్ధితి గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీలేదు.
ఇదే సమయంలో టీడీపీ అధిష్టానానికి చాలా ఆసక్తి ఉన్నా స్థానిక నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే ఉప ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంటాయి. నిజానికి పార్టీ తరపున పోటి చేసేంత గట్టి నేతలు కూడా ఎవరూ లేరనే చెప్పాలి. ఈ కారణం వల్లే బీజేపీ పోటి చేస్తే తమ పార్టీ మద్దతిస్తుందని చంద్రబాబు కమలంపార్టీకి రాయబారం పంపారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
అయితే వైసీపీ తరపున బల్లి కుటుంబసభ్యుల్లోనే ఎవరైనా పోటీకి దింపుతారా ? లేకపోతే కొత్త నేతను రంగంలోకి దింపుతారా అన్నది తేలలేదు. బీజేపీ తరపున పోటీ చేయబోయే నేతల్లో ఎక్కువగా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక టీడీపీ తరపున ఇప్పటికే చాలామందిని అభ్యర్ధులుగా ప్రయోగం చేసేసున్నారు. ఎలాగంటే ప్రతి ఎన్నికలోను ఓ కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపటంతో పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. అయితే చంద్రబాబునాయుడు సొంతజిల్లా కాబట్టి ఎవరినో ఒకరిని పోటికి దింపకపోతే పరువు సమస్య.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే సోమిరెడ్డి టీడీపీ పోటి చేస్తుందని ప్రకటించినట్లుంది. అంటే అభ్యర్ధి తేలకపోయినా పోటికి మాత్రం తెలుగుదేశంపార్టీ రెడీ అయిపోయిందన్నమాట. కాంగ్రెస్ నుండి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మళ్ళీ పోటిలో ఉండే అవకాశాలే ఎక్కువున్నాయి. కాబట్టి పోటి ఎలా జరుగుతుందో చూడాల్సిందే. అభ్యర్థిని బట్టి సమీకరణాలు మారే అవకావం లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates