కూటమి పార్టీల నాయకులు టెన్షన్లో మునిగిపోయారు. రాజ్యసభ సీట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ సీట్లను ఆశిస్తున్నవారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి పోటీ ఉంటే ఎన్నికలు పెడతారు. లేకపోతే.. ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది.
దీంతో ఆశావహులు.. ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసిన వారు కూడా.. ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఈ పదువులు దక్కుతాయోనని వారు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ, బీజేపీ కానీ.. చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం.. మూడు సీట్లకు ముగ్గురిని ఇప్పటికే ఖరారు చేశారు. అయితే..వీరిలో ఎవరు ఉన్నారన్నది మాత్రం అత్యంత రహస్యంగా వ్యవహరిస్తున్నారు.
వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ .కృష్ణయ్యలు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. ఆ పార్టీతో పాటు రాజ్యసభ సీట్లను కూడా వదులుకున్నారు. వీరిలో మోపిదేవి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోరుకుంటున్నారు. అయితే.. బీద మస్తాన్ రావు మాత్రం తిరిగి రాజ్యసభలో అడుగు పెట్టాలని కోరుతున్నారు. ఇక, ఆర్. కృష్ణయ్య కూడా.. బీజేపీ తరఫున పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో సీటు ఖాళీగా ఉంది.
దీనికి మాజీ మంత్రి దేవినేని ఉమా సహా అనేక మంది పోటీలో ఉన్నారు. ఇక, సినీరంగానికి చెందిన రాఘవేంద్రరావుపేరు కూడా జోరుగా నే తెరమీదికి వచ్చింది. ఇక, పార్టీ కోసం కష్టపడిన ఎన్నారై సానా సతీష్ కూడా ప్రయత్నంచేశారు. మరికొందరు ఇప్పటికే చంద్రబాబును కలిసి విన్నవించారు. ఇక, జనసేన తరఫున నాగబాబును పంపించాలని పవన్ ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం.