తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గర్వంగా నిలబడేలా రాజమౌళి చేస్తే ఆ మార్గాన్ని అనుసరించి నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు వెండితెర అద్భుతాలు మరిన్ని అందించే లక్ష్యంతో వందల కోట్ల పెట్టుబడులతో సాహసాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా వచ్చిందే కల్కి 2898 ఏడి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాకు బుకింగ్స్ భారీగా జరగడంలో ఆశ్చర్యం లేదు కానీ ఓవర్సీస్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల దాకా ఒక సునామిలాగా టికెట్ల కోసం ఎగబడుతున్న వైనం ఎన్నో నెలల తర్వాత కల్కికే కనిపించింది. కేవలం రెండు సినిమాల అనుభవమున్న నాగ అశ్విన్ ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ఆశించిన మాయాజాలాన్ని సృష్టించాడా లేదా చూసేద్దాం పదండి.
కథ
కురుక్షేత్ర యుద్ధంలో పాండవ నాశనాన్ని కోరుకుని కృష్ణుడి మీదే యుద్ధానికి తలపడిన అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) కలియుగం వరకు లోకంలో జరిగే దుర్మార్గాలు చూసే మృత్యువు లేని శాపాన్ని పొందుతాడు. ఆరు వేల సంవత్సరాల తర్వాత ప్రపంచంలోకెల్లా విలాసవంతమైన కాంప్లెక్స్ లో అడుగు పెట్టేందుకు యూనిట్స్ కోసం రకరకాల పనులు చేస్తుంటాడు భైరవ (ప్రభాస్). సమస్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న యాస్కిన్(కమల్ హాసన్) తన మనుషుల ద్వారా అరుదైన గర్భాన్ని మోస్తున్న సుమతి (దీపికా పదుకునే) కోసం వెతుకుతుంటాడు. వీళ్ళందరూ శంభాలాలో కలిసే పరిస్థితి వస్తుంది. దీనికి ముందు తర్వాత జరిగేది అసలు స్టోరీ.
విశ్లేషణ
ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్ ముడిపెట్టడం చాలా కష్టమైన ప్రక్రియ. ఏ మాత్రం బ్యాలన్స్ తప్పినా నవ్వులపాలవుతుంది. ముప్పై ఏళ్ళ క్రితం ఆదిత్య 369 ద్వారా సింగీతం శ్రీనివాసరావుగారు దీన్ని విజయవంతంగా అధిగమించారు. తర్వాత కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ మరీ గుర్తుండిపోయేలా ఎవరూ చేయలేదు. నాగ్ అశ్విన్ తీసుకున్న నేపథ్యం మహాభారత కాలం నుంచి మొదలవుతుంది. యుగపురుషుల జనన మరణాల వెనుక ఒక బ్రహ్మ రహస్యం, సృష్టి కార్యం ఉంటుందనే సూత్రాన్ని అనుసరించి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను ముడిపెడుతూ చాలా సంక్లిష్టమైన పాయింట్ ఎంచుకున్నాడు. జాగ్రత్తగా వినకపోతే కన్ఫ్యూజ్ అయ్యే థీమ్ ఇది.
ముందుగా నాగ్ అశ్విన్ చేసిన పరిశోధనను మెచ్చుకోవాలి. భారతంలో సగటు జనాలు అంతగా గుర్తు పెట్టుకోని అశ్వద్ధామను మెయిన్ లీడ్ గా తీసుకుని దానికి కల్కి అవతారానికి ముడిపెట్టొచ్చనే వాస్తవాన్ని గుర్తించడం తనలోని ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ కి నిదర్శనం. పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో భైరవ ఎంట్రీ అయ్యాక కథనంలో వేగం తగ్గుతుంది. అమితాబ్, దీపికా, శోభన, రాజేంద్రప్రసాద్ తదితరులకు విడివిడిగా టైం కేటాయించడంతో తొలి సగం చాలా మటుకు ఫ్లాట్ గా సాగిపోతుంది. అయినా సరే ఇదెలా సాధ్యమనిపించే కళ్ళు చెదిరే భారీతనం పలు బలహీనతలను కాపాడుకుంటూ వచ్చింది. కల్కికి అండగా నిలవబోయేది ఇదే.
ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి గేరు మారిపోతుంది. అసలేం ఆశించి ఈ సినిమాకు వచ్చామో దాన్ని నెరవేర్చే దిశగా కల్కి పరుగులు పెడతాడు. సుమతిని పశుపతి గ్యాంగ్ ప్రమాదకరమైన కాంప్లెక్స్ నుంచి శంబాలాకు తీసుకెళ్లే క్రమంలో జరిగే ఫైట్, కాపాడేందుకు వచ్చిన అశ్వద్ధామతో కలిసి భైరవ చేసే పోరాటం చప్పట్లు కొట్టిస్తాయి. హీరో విలన్ నేరుగా తలపడే అవకాశం లేకపోవడంతో మాయాబజార్ తరహాలో స్క్రీన్ ప్లే రాసుకున్న నాగ్ అశ్విన్ అసలా ఆలోచనే రాకుండా విజువల్ ఎఫెక్ట్స్ తో కట్టిపడేస్తాడు. చాలా చోట్ల అశ్వద్ధామ డామినేషన్ ఎక్కువై భైరవ వెనుకబడినా సరే గ్రిప్పింగ్ గా సాగే కథనం బోర్ కొట్టించకుండా సాగింది. పాటలే కొంత ఇబ్బంది పెడతాయి.
క్యారెక్టరైజేషన్లు ప్రేక్షకులకు రిజిస్టర్ చేసాక గూస్ బంప్స్ అనిపించే సన్నివేశాలను కూర్చుకుని ఆడియన్స్ భావోద్వేగాలను క్రమం తప్పకుండా పీక్స్ కు తీసుకెళ్లడం రాజమౌళి ఫార్ములా. నాగ్ అశ్విన్ ఈ ఫార్మాట్ లో వెళ్లి ఉంటే కల్కి ఇంకో స్థాయిలో ఉండేది. అలాంటి వాటికి అవకాశమున్నా కమర్షియల్ ఫ్లేవర్ తగలకూడదనే ఉద్దేశంతో స్ట్రిక్ట్ గా సబ్జెక్టుకే కట్టుబడటం వల్ల గ్రాఫ్ పైకి కిందకు లేస్తూ వెళ్ళింది. బాహుబలి విశ్రాంతిలో ప్రభాస్, రానా విగ్రహాలు చూపించే షాట్ వల్ల రోమాలు నిక్కబొడుచుకోవు. దానికి ముందు సెట్ చేసిన బిల్డప్, దాయాదుల మధ్య అధికారం కోసం డ్రామా, ప్రజల కష్టాలు ఇవన్నీ కనెక్ట్ చేస్తూ వెళ్లి ఇంటర్వెల్ ని బ్లాస్ట్ చేసి పడేశారు.
కల్కిలోనూ అలాంటివి ఉండాల్సింది. పైగా రెండు మూడు భాగాలు ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల కాబోలు సినిమా అయ్యాక ఎన్నో ప్రశ్నలు సశేషంగా మిగిలిపోతాయి. భైరవ ఎవరో చివర్లో రివీల్ చేసినా కల్కి ఎప్పుడు, ఎలా వస్తాడనే సస్పెన్స్ ని ఇంకొంచెం బెటర్ గా సెట్ చేయాల్సింది. ప్రీ క్లైమాక్స్ మొదలయ్యే ఇరవై నిముషాల నుంచి ఎండ్ కార్డ్ దాకా ఉక్కిబిక్కిరి చేసిన నాగ్ అశ్విన్ తనలో అసలైన క్రియేటర్ ని అక్కడ చూపిస్తాడు. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోని మేకింగ్ తో ఔరా ఇది టాలీవుడ్ సినిమానేనా అనేంత గొప్పగా ఈలలు వేయిస్తాడు. అశ్వద్ధామ, భైరవ మధ్య ఉన్న లింకుని ఓపెన్ చేసే విధానం జనాన్ని కుర్చీల్లో కుదురుగా ఉండనివ్వదు.
దక్షిణాది జెండా ఆస్కార్ దాకా ఎగరేసిన తరుణంలో కల్కి 2898 ఏడి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో తర్వాత తేలుతుంది కానీ వందల కోట్ల రిస్కులు చేసే సత్తా, ధైర్యం ముందు తెలుగువాళ్ళకే ఉంటుందని నాగ్ అశ్విన్ మరోసారి రుజువు చేశాడు. కేవలం రెండు సినిమాల అనుభవంతో ఇలాంటి కాన్వాస్ ని ఊహించుకోవడమే రిస్క్ అనుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పూనుకోవడం సాహసం. థియేటర్లకు ప్రాణం నిలవాలంటే ఇలాంటి గ్రాండియర్లు ప్రతి శుక్రవారం కాకపోయినా కనీసం రెండు మూడు నెలలకొకటి రావాలి. అందరు హీరోలు ప్రయత్నించాలి. ఊహకందని మాయాజాలంలో విహరింపజేస్తే ప్రేక్షకులు కనకవర్షం కురిపిస్తారు.
నటీనటులు
మ్యాచో మ్యాన్, డార్లింగ్ ప్రభాస్ కు భైరవ పాత్ర ఒక కొత్త మేకోవర్. సరదా, సీరియస్, కొంత గ్రే షేడ్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ ని పొందుపరిచిన తీరు బాగా పేలింది. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత తనలో కామెడీ టైమింగ్ బయటికి తేవడం నచ్చుతుంది. దీపికా పదుకునేది రెగ్యులర్ గా కనిపించే హీరోయిన్ తరహా కాదు. గ్లామర్ అంశాలకు తావివ్వకుండా ఒక తల్లిగా తనను ప్రొజెక్ట్ చేసిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్టయ్యేలా ఉంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సగభాగం పైనే తన అధిపత్యంతో స్క్రీన్ తినేసినంత పని చేశారు. ఇంత వయసులోనూ ఆయన ఎనర్జీకి, పడుతున్న కష్టానికి సెల్యూట్ అనకుండా ఉండలేం. అశ్వద్ధామగా పర్ఫెక్ట్ ఛాయస్.
లోకనాయకుడు కమల్ హాసన్ తనకు మాత్రమే సాధ్యమయ్యే కనికట్టుని కాసేపే అయినా గుర్తుండిపోయేలా పండించారు. నిడివి పరంగా అభిమానులకు నిరాశ కలగవచ్చేమో కానీ సీక్వెల్ మీద ఎంతైనా అంచనాలు పెట్టుకోవచ్చు. దిశా పటానికి తనకిచ్చిన పరిధి తక్కువ. పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు తమ అనుభవంతో నిలబెట్టారు. మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ లది మినిమమ్ స్పేస్. చెప్పడానికేం లేదు. దుల్కర్ సల్మాన్, విజయ దేవరకొండలకు సంబంధించిన ట్విస్టులను ఎక్కువ ఊహించుకోకూడదు. చాలా కాలం తర్వాత సీనియర్ నటి శోభనగారిని చూడటం బాగుంది. రాసుకుంటూ పోతే చేతులు నొప్పి పెట్టేంత క్యాస్టింగ్ ని సెట్ చేశారు అశ్విన్.
సాంకేతిక వర్గం
సంతోష్ నారాయణన్ సంగీతం హాలీవుడ్ స్టాండర్ లో ఉన్న దర్శకుడి టేకింగ్ కు తగ్గట్టు సింక్ అయ్యేందుకు కృషిలోపం లేకుండా కష్టపడింది. తక్కువ పాటలే అయినా మరీ గొప్పగా అనిపించే ట్యూన్లు లేకపోవడం కొంత మైనసయ్యింది. ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ పరంగా నిరాశపరచలేదు. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ ఛాయాగ్రహణం అబ్బురపరుస్తుంది. షూట్ చేసేటప్పుడు లేని ప్రపంచాన్ని గ్రీన్ మ్యాట్ లో ఊహించుకుని తన పనితనాన్ని చూపించడం ఎన్ని అవార్డులు తీసుకొస్తుందో చెప్పలేం. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ లెన్త్ పరంగా తగ్గించే అవకాశాలు చూడాల్సింది. వైజయంతి నిర్మాణ విలువలు ఇది తెలుగు సినిమాని గర్వంగా చెప్పే స్థాయిలో ఉన్నాయి
ప్లస్ పాయింట్స్
అమితాబ్, ప్రభాస్
మూడు ప్రపంచాల నేపథ్యం
విజువల్ ఎఫెక్ట్స్
దర్శకుడి టేకింగ్
మైనస్ పాయింట్స్
హై తగ్గిన ఫస్ట్ హాఫ్
రెండు పాటలు
డ్రామాపాళ్ళు సరిపోలేదు
ఫినిషింగ్ టచ్ : మాయాలోకపు విహారం
రేటింగ్ : 3.25 / 5
This post was last modified on June 27, 2024 11:19 am
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…
అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…