Movie Reviews

సమీక్ష – కృష్ణమ్మ

పేరుకి చిన్న నటుడే అయినా టాలెంట్ లో మాత్రం పెద్ద స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడే హీరోగా సత్యదేవ్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. బ్లఫ్ మాస్టర్ తో ఈ నమ్మకం బలపడిన తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వరస ఫెయిల్యూర్స్ పలకరించాయి. అలా అని కేవలం హీరో వేషాలకే కట్టుబడకుండా చిరంజీవి గాడ్ ఫాదర్ లో విలన్ గానూ రాణించి మెప్పించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన కృష్ణమ్మ మీద ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. మరి వాటిని అందుకుందా లేదా

కథ

విజయవాడ వించిపేటలో గంజాయి రవాణా లాంటి దందాలు చేసే భద్ర(సత్యదేవ్)కు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ప్రింటింగ్ ప్రెస్ నడిపే శివ (కృష్ణ బూర్గుల), (లక్ష్మణ్)తో కలిసి జీవితం గడుపుతూ ఉంటాడు. భద్ర, శివ ఇద్దరికీ చెరో లవ్ స్టోరీ ఉంటుంది. ఊరికి కొత్తగా వచ్చిన ఎస్పి(నంద గోపాల్) వల్ల ఒక అవసరం కోసం చేయని నేరానికి ముగ్గురు జైలుకు వెళ్తారు. శిక్ష పడ్డాక అసలు నిజం బయటపడుతుంది. ఈలోగా ఊహించని దారుణాలు కొన్ని జరిగి భద్ర ప్రతీకారంతో రగిలిపోతాడు. బయటికి వచ్చాక ఏం చేశాడనేది తెరమీద చూడాలి

విశ్లేషణ

రివెంజ్ డ్రామాలు మనకు కొత్తేమి కాదు. ఎంత ఇంటెన్స్ తో చెబుతామనే దాన్ని బట్టే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం, కాకపోవడం ఆధారపడి ఉంటుంది. వెంకటేష్ శత్రువు నుంచి రామ్ చరణ్ రంగస్థలం దాకా ఏదీ తీసుకున్నా అంతర్లీనంగా హీరోకు జరిగిన అన్యాయాన్ని అండర్ ప్లే చేస్తూ చివరికి వచ్చేసరికి ప్రత్యర్థులను చంపే క్రమాన్ని ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యేలా చేయడంతో అవి గొప్ప విజయాలు సాధించాయి. కృష్ణమ్మ దర్శకుడు వివి గోపాలకృష్ణ తీసుకున్న ప్లాట్ లో కొత్తదనం లేకపోయినా దాన్ని ప్రెజెంట్ చేసే విధానంలో భావోద్వేగాలకు పెద్దపీఠ వేసే ప్రయత్నం చేశాడు. ఎంచుకున్న లైన్ లో విషయమున్నా దాన్ని తీర్చిదిద్దడంలో తడబడ్డాడు.

ఓపెనింగ్ సీన్ ని హత్యతో మొదలుపెట్టి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ రూపంలో భద్రతో గతాన్ని చెప్పిస్తాడు. స్నేహితుల నేపధ్యాలు, వాళ్ళ మధ్య ఎంత బాండింగ్ ఉందో చూపించే సన్నివేశాలు, అమ్మాయిల పరిచయం ప్రేమ, పోలీసుల బెదిరింపులు ఇలా రెగ్యులర్ ఫార్మాట్ లో తీసుకెళ్లిన గోపాలకృష్ణ అదంతా సరైన రీతిలో ఎంగేజ్ చేసేలా ఉందో లేదో చూసుకోలేదు. దీంతో కథనం నెమ్మదిగా సాగుతూ ఎలాంటి ముద్ర వేయలేకపోయింది. అరగంటలో చెప్పాల్సిన మ్యాటర్ ని కేవలం ఎమోషన్ రిజిస్టర్ కావాలనే ఉద్దేశంతో ఇంటర్వెల్ దాకా సాగదీయడంతో టైటిల్స్ దగ్గర సృష్టించిన సస్పెన్స్ కాస్తా విశ్రాంతి వచ్చేలోపు చల్లారిపోయింది. ఇది ప్రధాన మైనస్.

అసలేం నేరం చేశామో తెలియకుండానే భద్ర, శివ, కోటిలు పోలీసుల ట్రాప్ లో పడటం వరకు బాగానే ఉంది కానీ దాని వెనుక సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ మాములుగా ఉండటం ఇంటెన్సిటీని దెబ్బ తీసింది. ఏదేదో ఊహించుకుని గొప్ప మలుపు కోసం ఎదురు చూస్తున్న టైంలో వాళ్ళు  జైలుకు వెళ్లిపోవడం, పన్నెండేళ్ళు తేలికగా గడిచిపోవడం, బయటికి రాగానే కత్తులతో వేటాడ్డం ఇదంతా వేగంగా జరిగిపోతుంది. మొదటి సగంలో ఎంతో సమయం వృథా చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అవసరం లేకపోయినా స్పీడ్ గా పరిగెత్తడంతో థ్రిల్ కలగదు. పైగా అన్యాయం చేసినవాళ్లను ఎలా చంపుతాడాని ఎదురు చూస్తే అదంతా ఫార్వార్డ్ లా జరిగిపోవడం నిరాశ కలిగిస్తుంది.

ఊహాతీతంగా స్క్రీన్ ప్లే ఉన్నప్పుడే ఇలాంటి డ్రామాలు రక్తి కడతాయి. రక్షించాల్సిన వ్యవస్థలో సామాన్యులను ఒక పోలీసు, లాయర్, రాజకీయ నాయకుడు కలిసి మూకుమ్మడిగా ద్రోహం చేస్తే దాని తాలూకు పగ ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పాలనేదే గోపాలకృష్ణ పాయింట్. వెట్రిమారన్ విచారణ, కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను ఊపేసిన దిశా ఎన్ కౌంటర్ లాంటివి స్ఫూర్తిగా తీసుకుని వాడుకోవడం బాగానే ఉంది కానీ వాటిని సరైన రీతిలో కమర్షియల్ మీటర్ కు అనుగుణంగా రాసుకోవడంలో జరిగిన పొరపాట్ల వల్ల కృష్ణమ్మ ప్రవాహం ఎలాంటి శబ్దం చేయకుండా తేలికగా ప్రయాణం చేస్తుంది. కొరటాల శివ పర్యవేక్షణ జరిగింది కాబట్టి ఈ మాత్రమైనా వచ్చిందేమో మరి

వివి గోపాలకృష్ణలో మంచి టెక్నీషియన్ ఉన్నాడు కానీ రాతలో ఉన్న బలహీనతల వల్ల కృష్ణమ్మని మెప్పించే కంటెంట్ గా మలచలేకపోయాడు. కీలకమైన హంతకుడి పాత్రను డిజైన్ చేసిన విధానం, క్లైమాక్స్ లో దానికిచ్చే ముగింపు రెగ్యులర్ స్టైల్ లో వెళ్లిపోవడం నిరాశని మిగులుస్తుంది. అందులోనూ క్యాస్టింగ్ పరంగా చేసిన కొన్ని తప్పులు ప్రతికూలంగా ప్రభావం చూపించాయి. హాస్టల్ వార్డెన్ భర్త, ఎమ్మెల్యే కొడుకు క్యారెక్టర్లకు సరైన ఛాయస్ ఎంచుకోలేదు. అసలే థియేటర్లకు జనాన్ని రప్పించడం కష్టంగా మారిన తరుణంలో స్టార్లు లేకుండా కేవలం యాక్టర్లను నమ్ముకుని వచ్చిన కృష్ణమ్మకు సరైన బలం తోడయ్యుంటే సులభంగా గట్టేక్కేది.

నటీనటులు

నటుడిగా సత్యదేవ్ మరో మెట్టు ఎక్కేందుకు కృష్ణమ్మ ఉపయోగపడింది. మొత్తం సీరియస్ షేడ్ కావడంతో వేరే వేరియేషన్లు అవసరం పడలేదు. తనవరకు పూర్తి న్యాయం చేశాడు. లక్ష్మణ్ మీసాల బాగా కుదిరాడు. సత్యదేవ్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ దొరికింది. విజయ్ బూర్గుల కొంత నాన్ సింక్ అనిపిస్తాడు. అతిరా రాజ్ పర్వాలేదు. ఎక్కువ స్కోప్ దక్కకపోయినా ఉన్నంతలో పాస్ అయిపోయింది.. అర్చన అయ్యర్ మొక్కుబడిగా అలా కనిపించి ఇలా వెళ్ళిపోతుంది. నంద గోపాల్ తనకిచ్చిన లెన్త్ కు తగ్గట్టు బ్యాడ్ పోలీస్ గా ఒదిగిపోయాడు. చిన్నా చితక ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు కానీ ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా ముద్రవేసిన వాళ్ళు తక్కువ.

 సాంకేతిక వర్గం

కాల భైరవ సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది తప్పించి మరీ ఎక్కువ ఎలివేషన్ కు ఉపయోగపడలేదు. తక్కువ పాటలే ఉన్నప్పటికి వాటి ద్వారా కలిగిన ఇంపాక్ట్ అంతగా లేదు. సన్నీ కురపాటి ఛాయాగ్రహణం డీసెంట్ గా సాగింది. బడ్జెట్ అడ్డంకులను దాటుకుని విజువల్స్ ని చూపించే ప్రయత్నం క్వాలిటీని తీసుకొచ్చింది. తమ్మిరాజు ఎడిటింగ్ మరీ విపరీత నిడివికి దారి తీయకపోయినా కొంత కత్తెర వేసుకుంటే ఇంకొంచెం రేసీగా అయ్యేది. బెజవాడ నేపధ్యం కావడంతో నలుగురైదుగురు రచయితలు రాసిన సంభాషణలు సహజంగా ఉన్నా పేలే స్థాయిలో పడలేదు. అరుణాచల క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఓకే. అవసరం మేరకే జాగ్రత్తగా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

సత్యదేవ్  
ఒక ట్విస్టు

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
ఎమోషనల్ డెప్త్ లేకపోవడం  
హీరోయిన్ల ట్రాక్
టెంపో లేని ప్రతీకారం

ఫినిషింగ్ టచ్ : అంత లేదమ్మా

రేటింగ్ : 2.5 / 5 

This post was last modified on May 10, 2024 4:28 pm

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

రౌడీ హీరోతో సుకుమార్ సినిమా – ఛాన్స్ ఉందా

వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…

2 hours ago

అనుమానపడుతూనే అనిరుధ్ మీద పొగడ్తలు

నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…

4 hours ago

ఒంగోలులో ‘టచ్ చేసి చూడు’ అంటున్న పోలీసులు !

రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…

5 hours ago

కల్కిలో కమల్ హాసన్ షాకింగ్ నిడివి

ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…

5 hours ago

నోరు జారానా? ముద్ర‌గ‌డ అంత‌ర్మ‌థ‌నం..!

కాలు జారితే తీసుకోవ‌చ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవ‌డం క‌ష్టం. పైగా ఇది ప‌రువు, ప్ర‌తిష్ట‌ల‌కు కూడా సంబంధించిన…

6 hours ago

పోలింగ్ ఎఫెక్ట్‌: 100 మంది అరెస్టు.. 300 మందిపై ఎఫ్ ఐఆర్‌లు

ఏపీలో ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస‌..…

7 hours ago