Movie Reviews

సమీక్ష – ఓం భీమ్ బుష్

వెరైటీ ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిలో పడిన సినిమా ఓం భీమ్ బుష్. గత ఏడాది సామజవరగమనతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న హీరో శ్రీవిష్ణు ఈసారి కూడా కామెడీనే నమ్ముకున్నాడు. హుషారుతో కుర్రకారు మెప్పు పొందిన శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా యువి సంస్థకు చెందిన వి సెల్యులాయిడ్ నిర్మించడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి రిలీజ్ దక్కింది. నో లాజిక్ ఓన్లీ మేజిక్ అంటూ చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకుండా బరిలో దిగిన ఈ కామెడీ థ్రిల్లర్ మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో చూద్దాం

కథ

తేలిగ్గా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో విచిత్రమైన పనులు చేసే స్నేహితులు క్రిష్(శ్రీవిష్ణు), వినయ్(ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ) లు భైరవపురం అనే గ్రామానికి చేరుకొని బ్యాంగ్ బ్రదర్స్ పేరుతో వ్యాపారం మొదలుపెడతారు. జనాల సమస్యలు తీరుస్తూ వాళ్ళ అభిమానం పొందుతున్న టైంలో ఊరి చివరన ఉన్న సంపంగి మహల్లో నిధిని బయటికి తీసుకొస్తే మీరు మోసగాళ్లు కాదని ఋజువవుతుందని స్థానిక అఘోరాలు సవాల్ విసురుతారు. ఒప్పుకున్న బ్యాంగ్ బ్రోస్ అక్కడికి వెళ్ళాక జరిగే పరిణామాలే స్టోరీ.

విశ్లేషణ

కామెడీ రెండు రకాలు. ఒకటి తర్కానికి అనుగుణంగా మనం నమ్మేలా సాగేది. ఇవివి, జంధ్యాల టైప్. ఇప్పటి వాళ్లలో అనుదీప్ కొంచెం ఫాలో అవుతాడు. ఇంకో క్యాటగిరీ లాజిక్స్ లేకుండా జోక్స్ నుంచి పుట్టే సందర్భాలతో టైం పాస్ చేయించడం. దర్శకడు శ్రీహర్ష కొనుగంటి దీన్ని ఎంచుకున్నాడు. ఫ్రెండ్స్ గ్యాంగ్ యునివర్సిటీ డీన్ ని మోసం చేసి డాక్టరేట్లు సంపాదించడం నుంచి ఒక వ్యాన్ వేసుకొచ్చి జనాలను గొర్రెల్లా మోసం చేయడం దాకా ఏదీ నమ్మశక్యంగా ఉండదు. కానీ వాళ్ళ పనులు కితకితాలు పెడతాయి. మాటలు చక్కిలిగింతలు పుట్టిస్తాయి. ఇలా జరగడం సాధ్యమేనా అని ఆలోచించే లోపే పెదవులకు పని చెప్పడం టార్గెట్ గా పెట్టుకుని సక్సెసయ్యాడు శ్రీహర్ష.

అలా అని ఇప్పటిదాకా దేంట్లోనూ చూడని పాయింట్ తీసుకోలేదు. పాడుబడిన బంగాళాలో దెయ్యం ఉంటే దాంట్లో హీరో బృందం వెళ్లడం చాలాసార్లు చూసిందే. కానీ శ్రీహర్ష తెలివిగా సంపంగికి వెరైటీ ఫ్లాష్ బ్యాక్ పెట్టి దాని ద్వారా ఒక చిన్న సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలాంటి బరువు లేకుండా సరదాగా కాలక్షేపం చేయిస్తుంది. మరీ పొట్ట చెక్కలయ్యేంత కాకపోయినా హాస్యానికి లోటు లేకుండా ఒకదశ వరకు బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. సంపంగి మహల్లో ఎంట్రీ దగ్గర ఇంటర్వెల్ కట్ చేసి రెండో సగానికి ఆసక్తికరమైన లీడ్ ఇస్తాడు. ఇక్కడి నుంచి డబుల్ ఫన్ ఆశిస్తాం. కానీ శ్రీహర్ష రెండో సగంలో అవసరం లేని లాజిక్స్ కి చోటివ్వబోయాడు.

బ్యాంగ్ బ్రోస్ బంగాళాలో వెతికే క్రమం చంద్రముఖి, కాంచన, గీతాంజలి టైపు ఫ్లేవర్ లోనే ఉన్నప్పటికీ శ్రీవిష్ణు, రాహుల్, దర్శిలు తమదైన టైమింగ్ తో వాటిని మోశారు. సంపంగి బయటికి వచ్చాక తన గతాన్ని చెప్పే తీరు, అక్కడ పెట్టిన ట్విస్టులు ఏమంత స్పెషల్ గా అనిపించకపోవడం మైనస్ గా నిలిచింది. వెరైటీగా ఉంటుందని శ్రీవిష్ణుకి ఆమెకు ముడిపెట్టిన తీరు కూడా క్లైమాక్స్ లో పండలేదు. దీని వల్ల చివరి ఘట్టంలో అదిరిపోయే కామెడీ ఉంటుందని ఎదురు చూసిన ఆడియన్స్ కి అక్కడ భావోద్వేగాలను చూపించడంతో ఫీల్ తగ్గిపోయింది. పైగా సంపంగి క్యారెక్టర్ కు ఎంచుకున్న ఆర్టిస్టు సెలక్షన్ కూడా నప్పలేదు. ఇంకొంచెం బెటర్ ఛాయస్ చూడాల్సింది.

కేవలం ఎంటర్ టైన్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అవసరం లేని అంశాలను తగ్గించాల్సింది. ముగ్గురు ఫ్రెండ్స్ బంగాళాలో చేసే అల్లరిని చివరి అరగంట నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి ఉంటే బాగుండేది. ట్రెండ్ పేరుతో సందర్భానికి తగ్గట్టు యూత్ కి కనెక్ట్ అయ్యే భాషను చక్కగా వాడుకున్న శ్రీహర్ష కొన్ని బూతు పదాలు మార్చి వాడినా సరే వాటి అసలు అర్థం వెంటనే గుర్తొస్తుంది. ఇదో కొత్త ప్రయోగమని అలవాటు చేసుకోవాలి. పైగా మహల్లో ఎంట్రీ ఇచ్చాక బ్యాంగ్ బ్రోస్ తప్ప ఇంకెవరూ వచ్చే అవకాశం కథాపరంగా లేకపోవడంతో మెల్లగా ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. దెయ్యంని చూసి దర్శి భయపడే సీన్లు కొన్ని రిపీట్ అనిపించడానికి కారణం ఇదే.

రెండుంపావు గంటల పాటు బుర్రకు పని చెప్పకుండా ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా కేవలం సరదా కోసమే వస్తే ఓం భీమ్ బుష్ ఆ విషయంలో ఎలాంటి నిరాశను కలిగించదు. అలా కాకుండా ఏదో కొత్తగా ఉంటుందని, ఇంతకు ముందెప్పుడూ చూడనిది అనుభూతి చెందాలని కోరుకుంటే మాత్రం కొంచెం ఆలోచించి వెళ్లాల్సి ఉంటుంది. సిల్లీ కామెడీతో జాతి రత్నాలు టైపు బ్యాక్ డ్రాప్ కి హారర్ టచ్ ఇచ్చిన శ్రీహర్ష కొనుగంటి దాని స్థాయిలో అద్భుతం చేశాడని చెప్పలేం కానీ ఆ సినిమాని విపరీతంగా మెచ్చుకున్న జనాలను మెప్పించడంలో యాభై శాతం పైగానే సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ ఎలిమెంట్ క్లిక్ అవ్వడమే బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది

నటీనటులు

శ్రీవిష్ణు ఎప్పటిలాగే సెటిల్డ్ నటనతో మెప్పించాడు. అతి లేకుండా మితమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుని మరోసారి మంచి పాత్ర అందుకున్నాడు. ప్రియదర్శి భయస్తుడిగా నప్పాడు. ఎప్పటిలాగే రాహుల్ రామకృష్ణ నుంచి ఆశించింది ఇందులోనూ దక్కింది. ఎంత వాడుకుంటే అంత ఇచ్చే ఆర్టిస్టు తను. హీరోయిన్ ప్రీతీ ముకుందన్ క్రిష్ లవ్ ట్రాక్ కి పరిమితమై రెండో సగంలో ఒకటి అరా సీన్లు తప్ప కనిపించదు. లుక్స్ ఓకే. అయేషా ఖాన్ ని మాస్ కోసం పెట్టారు కానీ లెన్త్ తక్కువే. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ నిడివి కొంతే అయినా కొంత ప్రాధాన్యం దక్కింది. రచ్చ రవి కొంచెం సౌండ్ ఎక్కువ చేశాడు. ఇతర చిన్నా చితక తారాగణం స్కోప్ తక్కువే

సాంకేతిక వర్గం

సన్నీ ఎంఆర్ సంగీతంలో పెద్దగా మెరుపులు లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు పర్వాలేదు కానీ పాటలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. కొంచెం క్యాచీ ట్యూన్స్ ఉంటే వాటిని ఎంజాయ్ చేసే అవకాశం దక్కేది. రాజ్ తోట ఛాయాగ్రహణం బాగుంది. ఉన్నంతలో బడ్జెట్ పరిమితులు ఉన్నా క్వాలిటీ ఇచ్చాడు. రచయితగా శ్రీహర్ష కొనుగంటి యువతని టార్గెట్ పెట్టుకోవడం వర్కౌట్ అయ్యింది. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వీలైనంత లెన్త్ ని కంట్రోల్ లోనే ఉంచింది. విఎఫెక్స్ క్వాలిటీ ఇంకొంచెం మెరుగ్గా ఉండాల్సింది. కొన్ని గ్రాఫిక్స్ తేలిపోయాయి. వి సెల్యులాయిడ్ – సునీల్ బలుసు నిర్మాణ విలువలు భారీతనానికి పోకుండా రిస్క్ లేకుండా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

విష్ణు, దర్శి, రాహుల్
ట్రెండీ కామెడీ
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్

కొత్త కథేం కాదు
విఎఫెక్స్
అవసరం లేని ఎమోషన్

ఫినిషింగ్ టచ్ : లాజిక్ లేని టైంపాస్ అల్లరి

రేటింగ్ : 2.75/5

This post was last modified on March 22, 2024 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల వల్లే టూరిజం ప్రమోషన్ వేగవంతం: పవన్

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…

7 mins ago

చీరలో వయ్యారాలు వలకబోస్తున్న కొత్త పెళ్లి కూతురు..

తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…

1 hour ago

చాగంటికి చంద్ర‌బాబు దిశానిర్దేశం.. ఏం చెప్పారంటే!

ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న క‌ర్త‌.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వ‌ర‌రావును ఏపీ ప్ర‌భుత్వం `నైతిక విలువ‌ల` స‌ల‌హాదారుగా నియ‌మించిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

కీర్తి సురేష్…గ్లామర్ కండీషన్లు లేవు

మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…

2 hours ago

పుష్ప, దేవరలను రాజకీయాల్లోకి లాగిన అంబటి

ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా…

3 hours ago

రామ్ సినిమాకు వివేక్ & మెర్విన్ – ఎవరు వీళ్ళు?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్…

3 hours ago