Movie Reviews

సమీక్ష – మంగళవారం

స్టార్ క్యాస్టింగ్ లేకుండా ఒక సినిమా వైపు ఆడియన్స్ చూపు మళ్లేలా చేయడం పెద్ద సవాల్. అందులోనూ దర్శకుడికి ముందో డిజాస్టర్ ఉన్నప్పుడు అదింకా క్లిష్టం. అయినా సరే ఈ ఛాలెంజ్ ని అధిగమించడంలో మంగళవారం బాగానే కష్టపడింది. ఆరెక్స్ 100 లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత మహా సముద్రం రూపంలో గట్టి దెబ్బ తిన్న అజయ్ భూపతి ఈసారి విభిన్నమైన ప్రయత్నం చేశానని, ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతారని చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇంతగా టీమ్ ప్రచారం చేసుకున్న మంగళవారంలో అంత విషయముందా

కథ

గోదావరి జిల్లా మహాలక్ష్మిపురంలో అక్రమ సంబంధాల వ్యవహారాల్లో ఇద్దరు గ్రామస్థులు చనిపోవడంతో ఒక్కసారిగా అందరూ వణికిపోతారు. ఇదంతా అమ్మోరి శాపమని భయపడుతున్న తరుణంలో మరో రెండు ప్రాణాలు పోవడంతో హంతకుడెవరో పట్టుకునేందుకు కంకణం కట్టుకుంటారు. సరిగ్గా ఇక్కడే శైలజ(పాయల్ రాజ్ పుత్)ప్రవేశంతో వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసుని విచారిస్తున్న ఎస్ఐ మీనా(నందితా శ్వేతా)కు కొన్ని ముఖ్యమైన ఆధారాలు దొరుకుతాయి. అసలు ఈ మర్డర్లన్నీ మంగళవారమే ఎందుకు జరుగుతున్నాయి, వాటికి శైలుకి సంబంధం ఏంటి, నిజమైన హంతకుడు ఎవరనే ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.

విశ్లేషణ

సస్పెన్స్, క్రైమ్, హారర్ వాస్తవానికి ఈ మూడు వేర్వేరు అంశాలు. ఏదో ఒకదాని మీద ఆధారపడి తీయడం సర్వ సాధారణం. వీటిని మిక్స్ చేస్తూ థ్రిల్ చేయాలనుకోవడం సాహసం. దర్శకుడు అజయ్ భూపతి దానికి పూనుకున్నాడు. గ్రామంలో అంతుచిక్కని హత్యల నేపథ్యంలో గతంలో ఎన్నో చిత్రాలొచ్చాయి. ఎక్కడిదాకో ఎందుకు మా ఊరి పొలిమేర 2లో ఇదే కదా మెయిన్ పాయింట్. అయితే దాని చుట్టూ రాసుకునే లేయర్లు, ట్విస్టుల మీద ఇలాంటివి మెప్పించడం, ఫెయిల్ కావడం ఆధారపడి ఉంటుంది. మంగళవారం బ్యాక్ డ్రాప్ ఖచ్చితంగా వినూత్నమైందే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ టచ్ చేయని ఒక షాకింగ్ పాయింట్ ని స్పృశించారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైన్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చిన అజయ్ భూపతి మధ్యలో వచ్చే హత్యలు తప్ప మిగిలినదంతా లైట్ కామెడీతో, ఊళ్ళో ఉండే పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ తో నెట్టుకొచ్చాడు. విసుగు రాకుండా వీలైనంత ఎంగేజ్ చేశాడు కానీ కన్నార్పకుండా చూసేంత కంటెంట్ లేకపోవడంతో టైం పాస్ చేయిస్తూ తేలికగా గడిచిపోతుంది. విశ్రాంతికి ముందు పాయల్ రాజ్ పుత్ వచ్చేదాకా ఈ టోన్ లో మార్పు ఉండదు. జరుగుతున్న మిస్టరీకి ఆమెకు ఏదో కనెక్షన్ ఉందన్న సందేహం లేవనెత్తి రెండో సగం కోసం ప్రిపేర్ చేస్తాడు. విపరీతమైన అంచనాలు లేకుండా వచ్చిన కామన్ ఆడియన్స్ ని మెప్పించేందుకు ఇదో రకం తెలివైన ఎత్తుగడ.

ఒక మూడ్ ని సృష్టించి అందులోనే గంటంపావు ప్రయాణం చేయించిన అజయ్ భూపతి శైలు ఫ్లాష్ బ్యాక్ అయ్యాక నెమ్మదించడం కొంత ప్రభావం చూపించింది. ఆమె తాలూకు లవ్ స్టోరీ, పాటలు లెన్త్ కోసం ఉపయోగపడ్డాయి తప్పించి ప్రేక్షకుల కోణంలో అంత నిడివి అవసరం లేనిదిగానే తోస్తుంది. శైలు తాలూకు అసలు సమస్యని ఓపెన్ చేశాక స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. వంశీ అన్వేషణ తరహాలో అప్పటిదాకా అసలు విలన్ ఎవరని ఎదురు చూసిన ఆడియన్స్ ని పున్నమినాగు టైపులో టర్న్ చేయడం అప్పటిదాకా జరిగినదానికి కనెక్ట్ అయిన వాళ్లకు మంచి థ్రిల్ ఇస్తుంది. కానీ సగటు కుటుంబ ప్రేక్షకులకు ఇదంతా రుచించడం కొంచెం కష్టమే.

శైలు తాలూకు భావోద్వేగాన్ని తన గతం రూపంలో రిజిస్టర్ చేయాలనుకున్న అజయ్ దానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో అక్కడ టెంపో తగ్గిన ఫీల్ కలుగుతుంది. అయితే చిక్కుముడులను విప్పే క్రమాన్ని ఓల్డ్ స్టయిల్ లో వెళ్లడం ప్లస్ అయ్యింది. 1996లో జరిగే కథ కాబట్టి నెరేషన్ ఇలా చెప్పడం కరెక్టే. కానీ శైలు పడిన సంఘర్షణని మాస్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారనే దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. మంగళవారంలో విరూపాక్ష లాగా హై అనిపించే మొమెంట్స్ వరుసగా రావు. కానీ విసుగు రాకుండా ఏం చేయాలో ఫస్ట్ హ్లాఫ్ లో ప్లాన్ చేసుకున్నట్టు ఫ్లాష్ బ్యాక్ లో కనికట్టు జరగలేదు. కొన్ని ట్విస్టులు ఊహతీతంగా జరగకపోవడం కొంత మైనస్

మంగళవారం థ్రిల్లర్ జానర్ లో ఒక ఎక్స్ పరిమెంట్ గా చెప్పుకోవచ్చు. కానీ కమర్షియల్ గా అంగీకరించే స్థాయి పరిమితంగా ఉండే అవకాశాలను కొట్టి పారేయలేం. అడల్ట్స్ ఓన్లీ అని ముందే చెప్పారు కాబట్టి క్రియేటివ్ కోణంలో చూసుకుంటే అజయ్ భూపతి పాస్ అయినట్టే. డిజాస్టర్ గాయాన్ని కాస్తయినా పోగొట్టి తిరిగి అతనిలో అసలైన టెక్నీషియన్ ని మళ్లీ పరిచయం చేయడానికి మంగళవారం ఉపయోగపడింది. ఎమోషన్,డీప్ క్రైమ్ రెండూ బ్యాలన్స్ చేయడం చాలా కష్టం. అజయ్ భూపతి ఈ విషయంలో తడబడినా తను చెప్పాలనుకున్న అంశాన్ని సరైన రీతిలోనే ప్రెజెంట్ చేశాడు. అక్కడక్కడా అసంతృప్తి చెలరేగినా చివరికి వాటిని మలుపులతో కవర్ చేయడం వర్కౌట్ అయ్యింది. బాక్సాఫీస్ ఫలితాన్ని శాసించేది ఇదే.

నటీనటులు

పాయల్ రాజ్ పుత్ కు పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర దక్కడంతో తనవంతు బెస్ట్ ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డింది. క్యారెక్టర్ తాలూకు డెప్త్ వల్ల కొంచెం హద్దులు దాటాల్సి వచ్చినా ఏ సర్టిఫికెట్ కోణంలో అవి ఆమోదయోగ్యమే. అసభ్యంగా లేదు. నందిత శ్వేత, దివ్య పిళ్ళైల క్యారెక్టర్లు బాగానే వచ్చాయి. అజయ్ ఘోష్, లక్ష్మణ్ లు నవ్వించడానికి ఉపయోగపడ్డారు. అజ్మల్ కి పెద్దగా స్కోప్ దక్కలేదు. చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్లకు తగ్గట్టు నప్పారు. చిన్నా చితకా ఆర్టిస్టులు బోలెడున్నారు. సందర్భానికి తగ్గట్టు వాడుకున్నారు తప్పించి పైన చెప్పిన వాళ్లకు తప్ప మరీ గుర్తుండిపోయే ఛాన్స్ అయితే దక్కలేదు.

సాంకేతిక వర్గం

అజనీష్ లోకనాథ్ పనితనం విరూపాక్షలోనే చూశాం. మంగళవారంలో మరోసారి బీజీఎమ్ తో మేజిక్ చేశాడు. పాటల గురించి గొప్పగా ప్రస్తావించలేం కానీ నేపద్య సంగీతం విషయంలో వంద మార్కులు కొట్టేశాడు. శివేంద్ర దాశరథి ఛాయాగ్రహణం అవుట్ ఫుట్ పరంగా గొప్పగా దోహదపడింది. విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన విధానం అజయ్ ఆలోచనలను ఎలివేట్ చేశాయి. మాధవ్ కుమార్ ఎడిటింగ్ నిడివి ని వీలైనంత క్రిస్పీగానే ఉంచింది కానీ అవసరం లేని సీన్లకు కత్తెర పడాల్సింది. మోహన్ తాళ్ళూరి ఆర్ట్ వర్క్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. కళ్యాణ్ రాఘవ్-తాజుద్దీన్ సంభాషణలు సహజంగా ఉన్నాయి. ముద్ర మీడియా బడ్జెట్ లో ఎక్కడా రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్

పాయల్ నటన
నేపధ్య సంగీతం
షాకింగ్ ఎలిమెంట్స్
ట్విస్టులు

మైనస్ పాయింట్స్

అవసరం లేని పాటలు
కొంత అడల్ట్ కంటెంట్
ఫ్లాష్ బ్యాక్ నిడివి
ఫ్యామిలీ ఎలిమెంట్స్ లేకపోవడం

ఫినిషింగ్ టచ్ : థ్రిల్ వారం

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on November 17, 2023 2:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఖమ్మం టీడీపీ ఆఫీసుకు పెరిగిన డిమాండ్ !

తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు…

5 hours ago

కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…

6 hours ago

రామాయణంపై అప్పుడే వివాదాలు షురూ

గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…

7 hours ago

తండేల్ కోసం రెండు క్లయిమాక్సులు ?

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…

8 hours ago

ఆ మూడూ గెలవకుంటే .. మూడు ముక్కలాటే !

మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…

8 hours ago

ప్రభాస్ పాత్రపై కన్నప్ప క్లారిటీ

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…

9 hours ago