Movie Reviews

సమీక్ష – భగవంత్ కేసరి

మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ హీరో. తీసిన ఆరు సినిమాల్లో అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకుడు. టాప్ చైర్లో ప్రేక్షకులు కూర్చోబెట్టిన శ్రీలీలకు ప్రధాన పాత్ర. ఇంతకన్నా క్రేజీ కాంబో ఏముంటుంది. అందుకే భగవంత్ కేసరి మీద కేవలం అభిమానులే కాక సాధారణ ప్రేక్షకులు కూడా ప్రత్యేక అంచనాలు పెట్టుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో ఈసారి హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. మరి ఐ డోంట్ కేర్ అంటూ వచ్చిన కేసరి మెచ్చుకునేలా ఉన్నాడా

కథ

జైల్లో శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి(బాలకృష్ణ)మంచివాడని గుర్తించిన పోలీస్ అధికారి(శరత్ కుమార్)అతనితో స్నేహం చేస్తాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కన్ను మూయడంతో జైలర్ కూతురు విజ్జి(శ్రీలీల)ని పెంచే బాధ్యతను భగవంత్ కేసరి తీసుకుని ఆమె తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేర్పించే ప్రయత్నం చేస్తాడు. ఇది జరుగుతున్న క్రమంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించి నెంబర్ వన్ గా ఎదగాలని చూస్తున్న బిజినెస్ మెన్ రాహుల్ సంఘ్వి(అర్జున్ రాంపాల్)తో తలపడాల్సి వస్తుంది. ఈ ఇద్దరి మధ్య శత్రుత్వం ఎక్కడ మొదలైంది, కేసరి గతంలో ఏ నేరం మీద జైలుపాలయ్యాడు, చివరికి పగను లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే స్టోరీ

విశ్లేషణ

కొత్త తరం దర్శకులకు సీనియర్ స్టార్ హీరోలకు సూటయ్యేలా కథలను సిద్ధం చేయడం పెద్ద సవాల్ గా మారింది. అందులోనూ బాలయ్య లాంటి వంద సినిమాల అనుభవమున్న నటశిఖరంతో పని చేస్తున్నప్పుడు మాస్ అంశాలకు సంబంధించి అన్ని కొలతలు ఉన్నాయో లేదో చూసుకుంటూనే కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో కొంచెం తెలివిగానే ఆలోచించాడు. ఏదో రొటీన్ గా అరిగిపోయిన హీరోయిజం పెట్టేసి, హీరోయిన్ తో రెండు పాటలు, విలన్ తో పంచాయితీ లాగా కాకుండా బాలయ్యని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో యాభై ఏళ్ళ వయసున్న వాడిగా ప్రెజెంట్ చేయడం దగ్గరే వినూత్నంగా రాసుకున్నాడు.

టేకాఫ్ నుంచి తన మార్కులోనే వెళ్ళిపోయిన అనిల్ రావిపూడి పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ తర్వాత ఇంటర్వెల్ దాకా నడిపించిన కాజల్ అగర్వాల్ ట్రాక్, శ్రీలీలకు స్ఫూర్తినిప్పించే సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కథనం మెల్లగా నడుస్తుంది. రవిశంకర్ ఎంట్రీ తర్వాత తన ఇంటికి వెళ్లి బాలయ్య వార్నింగ్ ఇచ్చే సీన్ బాగా పేలింది. ఇలాంటివి గతంలో చూసినట్టే అనిపించినా ఫ్యాన్స్ కు అవసరమైన గూస్ బంప్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది. అయితే కీలకమైన ఆదిలాబాద్ అడవుల ఫ్లాష్ బ్యాక్ హడావిడిగా జరిగిపోవడం అంతగా కనెక్ట్ కాలేదు. కేసరి పాత్రకు ఇచ్చిన ట్విస్టు ఆల్రెడీ లీకయ్యిందే కానీ దాన్నుంచి ఆశించినంత హై వోల్టేజ్ పండలేదు.

ఇంటర్వెల్ దాకా బండి హెచ్చుతగ్గులకు గురైనా విశ్రాంతి దగ్గర పెట్టిన భారీ యాక్షన్ పోరాటం మాస్ ప్లస్ ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూశారో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది. ఇక్కడ పెట్టిన డైలాగులు, ఫైట్లు, బ్యాక్ గ్రౌండ్ అన్నీ వేటికవే మంచి కిక్ ఇచ్చేలా సాగాయి. ఇక్కడి నుంచి స్క్రీన్ ప్లే పరుగులు పెట్టాలి. అయితే ఎంతసేపూ బాలయ్యని ఎలివేట్ చేయడం మీదే దృష్టి పెట్టిన రావిపూడి రెండో సగంలో పట్టు తప్పుతున్న వైనాన్ని గుర్తించలేదు. అందుకే అర్జున్ రాంపాల్ చాలాసేపు కనిపించకుండా పోతాడు. శ్రీలీల మీద ఎక్కువ లెన్త్ నడిపించి కేసరి, రాహుల్ మధ్య సంఘర్షణను మర్చిపోయేలా చేస్తాడు. ఇవన్నీ ప్రేక్షకుల దృష్టిని ఒక ఫోకస్ మీద ఉంచలేదు.

ఇలాంటి మసాలా ఎంటర్ టైనర్స్ లో లాజిక్స్ కి చోటు లేకపోయినా మేజిక్ జరగాలి. ముఖ్యమంత్రిని శాశించే రాహుల్ కి ఆఫ్ట్రాల్ ఒక మంత్రి పిఎని పట్టుకోవడానికి నానా తంటాలు పడటం సినిమాటిక్ లిబర్టీ అని సరిపెట్టుకున్నా దాని చుట్టే మెయిన్ ప్లాట్ ని నడిపించడం వల్ల అందులోని కన్విన్సింగ్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. స్కూల్ కు వెళ్లి ఆడపిల్లలను ఉద్దేశించి బాలయ్య చెప్పే మాటలు హత్తుకునేలా ఉంటాయి. అయితే కథకు కొంత మేర మాత్రమే సంబంధం ఉన్న ఇలాంటి థ్రెడ్స్ ని త్వరగా ముగించాలి. కానీ కొంత నిడివి పెంచడంతో అసలు స్టోరీ సైడ్ ట్రాక్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. హెలికాఫ్టర్లతో జాన్ విజయ్ వచ్చి కేసరికి సహాయం చేసే ఎపిసోడ్స్ లాంటివి ఇంకొన్ని పడాల్సింది.

రాహుల్ సంఘ్వితో సంఘర్షణ తాలూకు బేస్ మెంట్ ని బాగానే సెట్ చేసుకున్న అనిల్ రావిపూడి వాళ్ళిద్దరి పగలకు కారణమైన గతాన్ని కొంత రొటీన్ గానే నడిపించాడు. పోలీస్ గెటప్ లో బాలయ్యని ఇంకాస్త ప్రత్యేకంగా డిజైన్ చేసి, పటాస్ రేంజ్ హీరోయిజం పండించి ఉంటే కథనం ఎక్కడికో వెళ్లిపోయింది. భావోద్వేగాలకు పెద్ద పీఠ వేయాలన్న ఉద్దేశంతో సెకండ్ హాఫ్ లో శ్రీలీలకు ట్రైనింగ్ ఇచ్చే వైనం అవసరానికి మించి వెళ్లిపోవడం ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నదే అయినా బాలయ్య రేంజ్ హీరోతో చేస్తున్నపుడు ఏదైనా తన ద్వారా జరిగితేనే ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. ఇలాంటి హెచ్చుతగ్గులు ఫైనల్ ఇంపాక్ట్ మీద ప్రభావం చూపించాయి.

భగవంత్ కేసరిలో రొట్ట కామెడీ, ఐటెం సాంగ్ లాంటి మూస ధోరణులకు వెళ్ళకపోవడం అనిల్ రావిపూడి వేసిన మంచి ఎత్తుగడ. బాలయ్య పాత్రలో ఔచిత్యానికి తగ్గట్టు ఎబ్బెట్టు అంశాలకు చోటు ఇవ్వకపోవడం పెద్ద ప్లస్. కార్పొరేట్ స్థాయి అయితేనే పవర్ ఫుల్ గా అనిపిస్తుందన్న సగటు భావన నుంచి బయటికి వచ్చి ఊర మాస్ విలన్లను సృష్టిస్తే ఇలాంటి వాటిలో హీరోయిజం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. తనకు మళ్ళీ ఎప్పుడో దొరుకుతుందో తెలియని గొప్ప అవకాశాన్ని వీలైనంత బెస్ట్ గా వాడుకునేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నించాడు కానీ తాను నడిపిస్తున్న బండి వేగం అరవై కాకుండా ఎనభైలో తీసుకెళ్లి ఉంటే ప్రయాణం ఇంకాస్త మాజాగా ఉండేది

నటీనటులు

బాలకృష్ణకు కొత్తగా ఛాలెంజ్ విసిరే పాత్రలు కష్టమే. కమర్షియల్ హీరోగా చేసిన ఎన్నో క్యారెక్టర్లతో పాటు భైరవద్వీపంలో కురూపిగా నుంచి అఖండలో అఘోరా దాకా ఎన్నో చేస్తూ వచ్చారు. తెల్లబడిన గెడ్డం, నల్లని జుత్తుతో పెద్దరికం బాధ్యత తీసుకున్న భగవంత్ కేసరిగా బాలయ్య తన నుంచి ఏం ఆశిస్తున్నారో సంపూర్ణంగా ఇచ్చేశారు. యాక్షన్ సీన్స్ లో తన మార్కు మిస్ కాకుండానే ఎమోషన్స్ లో తన బలమెంతో శ్రీలీల కాంబినేషన్ సీన్లలో మళ్ళీ నిరూపించారు. ముఖ్యంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కుతో బాలకృష్ణ బెస్ట్ ఇచ్చారు.

చాలా ప్రాధాన్యం ఉన్న విజ్జి పాపగా శ్రీలీల తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చింది. శిక్షణ తీసుకునే టైంలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు, చిచ్చాతో బాండింగ్ కు సంబంధించిన సీన్లలో హావభావాలు బాగా పలికించింది. కాజల్ అగర్వాల్ మొక్కుబడిగా నిలిచింది. అర్జున్ రాంపాల్ ఫ్రెష్ గా అనిపించాడు. కానీ ఈ తరహా విలనీలు రొటీన్ అయిపోయాయి. రవిశంకర్, జాన్ విజయ్, రఘు బాబు, శ్రీకాంత్ భరత్, మురళీధర్ గౌడ్ తదితరులవి రెగ్యులర్ పాత్రలే. శరత్ కుమార్ కనిపించేది కాసేపే. ఇతర చిన్నా చితక తారాగణం సందర్భానికి తగ్గట్టు కుదిరారు.

సాంకేతిక వర్గం

తమన్ పనితనం నేపధ్య సంగీతం పరంగా నిరాశపరచలేదు. రోర్ అఫ్ కేసరి పేరుతో ఇచ్చిన థీమ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. పాటల విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బెస్ట్ ఆల్బమ్ వచ్చేది. విజువల్ గా బాగున్నాయి కానీ ఆడియో వీకే. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం దర్శకుడు కోరుకున్న గ్రాండియర్ ని, బాలయ్యని బాగా చూపించింది. తమ్మిరాజు ఎడిటింగ్ నీట్ గానే సాగింది. మరీ నిడివి ఎక్కువనిపించే అవకాశం ఇవ్వలేదు. వెంకట్ పోరాటాలు చక్కగా కుదిరాయి. అనిల్ సంభాషణల్లో తెలంగాణ స్లాంగ్ బాగుంది. మునుపటితో పోలిస్తే మెరుపులు తగ్గాయనిపిస్తుంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువల్లో ఎక్కడా రిచ్ నెస్ తగ్గకుండా చూసుకున్నారు.

ప్లస్ పాయింట్స్

బాలయ్య నటన
శ్రీలీల పాత్ర
ఇంటర్వెల్ బ్లాక్
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్

రొటీన్ విలనిజం
పాటలు
సెకండ్ హాఫ్ ల్యాగ్

ఫినిషింగ్ టచ్ : మాస్ ఎమోషనల్ కేసరి

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on October 19, 2023 12:23 pm

Share
Show comments

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

60 minutes ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

7 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

10 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

12 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

13 hours ago