బాక్సాఫీస్ వద్ద విపరీతమైన తాకిడి నెలకొంది. మీడియం బడ్జెట్ సినిమాలన్నీ మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రేక్షకులకు చాలా ఆప్షన్లు దొరికాయి. వాటిలో కాసింత ఎక్కువ దృష్టిని రాబట్టుకుంది మ్యాడ్. సితార నాగవంశీ సమర్పణలో ఆయన సోదరి హారికతో పాటు సాయి సౌజన్య నిర్మాతలుగా పరిచయమైన ఈ యూత్ ఫుల్ డ్రామా మీద టీజర్, ట్రైలర్ వచ్చాక మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేయడంతో ఆడియన్స్ దృష్టి దీని మీద పడింది. మరి మ్యాడ్ టైటిల్ కు న్యాయం జరిగిందా
కథ
రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన మనోజ్(రామ్ నితిన్), అశోక్(నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) అతి తక్కువ సమయంలోనే మంచి స్నేహితులుగా మారిపోతారు. ప్రత్యర్థి కళాశాలతో ఉన్న క్యాంటీన్ గొడవని బాస్కెట్ బాల్ ఆటలో అశోక్ గెలవనివ్వడం ద్వారా వీళ్ళ బంధం మరింత బలపడుతుంది. చెరొకరికి లవ్ స్టోరీ మొదలవుతుంది. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఊహించని పరిణామాలు ప్రియురాళ్లను దూరం చేస్తాయి. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులను ఎలా దాటుకున్నారనేదే తెరమీద చూడాలి
విశ్లేషణ
కొత్త కుర్రాళ్లతో కాలేజీ డ్రామా నడిపించడం అంత సులభం కాదు. అందులోనూ కామెడీనే నమ్ముకుని ఇప్పటి తరం యూత్ ని మెప్పించడం మరీ కష్టం. జంధ్యాల నాలుగుస్తంభాలాటతో మొదలుపెట్టి శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ దాకా ఎందరో ఈ జానర్ ని టచ్ చేసి గొప్ప విజయాలు అందుకున్నారు. మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా ఎంటర్ టైన్మెంట్ నే నమ్ముకున్నాడు. రెండు గంటల పది నిమిషాల పాటు నాన్ స్టాప్ గా నవ్విస్తే చాలని దాని మీద సీరియస్ దృష్టి పెట్టి స్క్రిప్ట్ రాసుకున్నాడు తప్పించి లాజిక్కులు, మ్యాజిక్కులు వగైరాలు పట్టించుకోలేదు. చాలా సింపుల్ గా కుర్రకారు మధ్య నడిచే ఫన్ ఆధారంగా చివరిదాకా ఒకే పంథాలో వెళ్ళాడు.
కొత్తగా హాస్టల్ లో చేరినప్పుడు ర్యాగింగ్ పేరిట జరిగే సరదా వేధింపులు, క్లాస్ రూముల్లో జరిగే సంభాషణలు అన్నీ లైటర్ వీన్ లోనే సాగుతాయి. కొన్ని జోకులకు నిజంగానే నవ్వకుండా ఉండటం కష్టం. ఎప్పుడో తేజ చూపించిన స్టైల్ లో ప్రిన్సిపల్ ని బకరాగా చూపించడం వాస్తవానికి దూరంగా ఉన్నప్పటికీ ఇలాంటి చిన్న చిన్న తప్పులన్నీ ఫ్లోలో కొట్టుకుపోయాయి. 3 ఇడియట్స్ లాంటి వాటి నుంచి స్ఫూర్తి పొందానని కళ్యాణ్ శంకర్ డైలాగు రూపంలో ఓ సీన్ లో తనే బయట పెట్టుకున్నాడు కాబట్టి తప్పుబట్టడానికి లేదు. పాత్రలు సహజంగా ప్రవర్తించడం, వాటి మధ్య సంబంధాలు చాలా న్యాచురల్ గా చూపించడం మ్యాడ్ లో కనెక్టివిటీని పెంచింది.
వినోదం మీదే ఫోకస్ పెట్టిన కళ్యాణ్ శంకర్ సీరియస్ ఎమోషన్స్ కి చోటివ్వలేదు. భావోద్వేగాలను పండించడానికి స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచించలేదు. ఎంత హాస్యాన్నే అజెండాగా పెట్టుకున్నా ఈ పాయింట్ ని కాస్త దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది. కొన్ని చోట్ల నెరేషన్ మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అంత బిల్డప్ ఇచ్చిన క్యాంటీన్ ఎపిసోడ్ ని చాలా మాములుగా డీల్ చేశారు. పక్క కాలేజోడు వస్తే రక్తం వచ్చేలా కొట్టడాన్ని సరిగా జస్టిఫై చేయలేకపోయారు. ముందే చెప్పినట్టు ఇలాంటి లోపాలన్నీ జోకులతో ఎక్కడికక్కడ కవరవుతూ పోయాయి. హాస్టల్ నేపధ్యాన్ని సహజంగా చూపించిన దర్శకుడు దాని టెంపోని ఇంకాస్త పెంచుండాల్సింది.
హీరోలు ముగ్గురికి లవ్ స్టోరీని ప్రాపర్ గా సెట్ చేసుకున్న కళ్యాణ్ శంకర్ వాటిని నడిపించిన తీరు, ముగింపు ఇచ్చిన వైనం బాగున్నాయి. ఎక్కడ అసభ్యత లేకుండా, ఓవర్ చేయించకుండా, కనీసం లిప్ లాక్ జోలికి వెళ్ళకపోవడం ఆకట్టుకుంది. అక్కడక్కడా శృతి తప్పి బూతులు వాడటం నిజానికి అవసరం లేదు. వాటిని మార్చేసి రాసుకుని ఉంటే ఇంకా క్లీన్ గా ఉండేది. కుర్రకారు అంత కన్నా దారుణంగా బయట మాట్లాడుకోవడం నిజమే కానీ తెరపైకి వాటిని జొప్పించే విషయంలో దర్శకుడి విచక్షణే కీలకం కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది అతనే. అవి కూడా మరీ తీవ్ర స్థాయిలో లేకపోవడం వల్ల ఒక దశ దాటాక ఇది క్షమించగలిగే లోపమే అయ్యింది.
ఇక క్యారెక్టర్ల పరంగా ప్రాధాన్యత క్రమంలో నార్నె నవీన్ కు ఎక్కువ బిల్డప్ ఇవ్వాల్సి రావడం వల్ల అవసరం లేకపోయినా ఫైట్ పెట్టడం, కాసింత ఎలివేషన్లు జొప్పించడం కేవలం తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్లేనని అర్థమవుతుంది. దామోదర్ తో అజ్ఞాతంలో మాట్లాడే వెన్నెల పాత్రకు ఇచ్చిన ట్విస్టు మరీ అంత కన్విన్సింగ్ గా లేదు కానీ క్లైమాక్స్ లో దాన్ని అంత సాగదీయకుండా ఉండాల్సింది. ఒకే పాయింట్ మీద నడిపిస్తూ వెళ్లిన కళ్యాణ్ శంకర్ కు సరైన క్యాస్టింగ్ తో పాటు మంచి రైటింగ్ టీమ్ దొరికి బలహీనతలను కవర్ చేసుకుంటూ వచ్చారు. సాంగ్స్ విషయంలోనే ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే థియేటర్ ఎంజాయ్ మెంట్ ఇంకో స్థాయిలో ఉండేది
మ్యాడ్ పూర్తిగా యూత్ ని లక్ష్యంగా పెట్టుకున్నది. ఫ్యామిలీ జనాలకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఒక బ్యాచ్ గా వచ్చే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తమను తాము పోల్చుకుని హ్యాపీగా థియేటర్ నుంచి బయటికి వస్తారు. చిరకాలం నిలిచిపోయే క్లాసిక్ అవుతుందని చెప్పలేం కానీ ఇందులో ఏముంటుందో ఊహించి వెళ్లినవాళ్లకు నిరాశపరచకుండా మెప్పించడంలో కళ్యాణ్ శంకర్ పాసయ్యాడు. అతని ఆలోచనలకు ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బ్రహ్మాండంగా తోడవ్వడంతో సెకండ్ క్లాస్ లో పాస్ అవ్వాల్సినోడు ఫస్ట్ క్లాస్ లో గట్టెక్కాడు. కాలేజీ పుస్తకాలు భుజాన వేసుకుని తిరిగే కుర్రకారుని నవ్వించడంలో మ్యాడ్ ఫెయిల్ కాలేదు. సక్సెస్ అయ్యింది.
నటీనటులు
అధిక శాతం కొత్త మొహాలే అయినా హీరోలు బాగా చేశారు. ముఖ్యంగా డిడిగా సంగీత్ శోభన్ చెలరేగిపోయాడు. తన టైమింగ్ అద్భుతంగా పండింది. బక్కపల్చని దేహంతో పొడుగ్గా ఉన్న ఇతగాడిలో ఫైర్ పూర్తిగా బయటికి తీశారు. తారక్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ క్యారెక్టర్లో సీరియస్ నెస్ ఎక్కువైపోవడంతో అంత ఛాలెంజింగ్ గా అనిపించదు. సెకండ్ హాఫ్ లో దాని టోన్ మార్చారు కానీ మరీ స్పెషల్ అయితే కాదు. రామ్ నితిన్ అందం, చలాకీతనం రెండూ బ్యాలన్స్ అయ్యాయి. సైడ్ ఆర్టిస్టే అయినప్పటికీ వీళ్ళతో సమానంగా గుర్తుండిపోయేది లడ్డుగా చేసిన విష్ణు. అదరగొట్టాడు. హీరోయిన్లు శ్రీగౌరీప్రియరెడ్డి, అనంతిక, గోపికలకు సమాన ప్రాధాన్యం దక్కనప్పటికీ ముగ్గురు ఆకట్టుకున్నారు. రఘుబాబు, మురళీధర్, ఆంటోనీ, శ్రీకాంత్ రెడ్డి, రచ్చ రవి తదితరులు మంచి క్యాస్టింగ్ కుదిరింది
సాంకేతిక వర్గం
మ్యాడ్ లాంటి యూత్ ఫుల్ కంటెంట్ కి కిరాక్ అనిపించే సాంగ్స్ ఉండాలి. కానీ భీమ్స్ సిసిరోలియో నుంచి ఆ స్థాయి పాటలైతే పడలేదు. చూస్తున్నంత సేపు ఓకే కానీ ట్యూన్స్ క్యాచీగా లేకపోవడం మైనస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు బాగానే ఇచ్చాడు. శ్యామ్ దత్ – దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం సహజంగా ఉంది. పరిమితుల మధ్యలోనూ మంచి క్వాలిటీ ఇచ్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. నిడివిని క్రిస్పీగానే ఉంచారు. కళ్యాణ్ శంకర్ తో పాటు స్క్రీన్ ప్లే మాటలు సమకూర్చిన అతని టీమ్ పనితనం బాగుంది. సింపుల్ గా అనిపించినా బాగా నవ్వించారు. బడ్జెట్ పరంగా రిస్క్ లేకుండా లేడీ ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టిన వైనం మరికొందరికి స్ఫూర్తినివ్వొచ్చు.
ప్లస్ పాయింట్స్
సంగీత్ శోభన్ నటన
ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్
కాలేజీ బ్యాక్ డ్రాప్
వర్కౌటైన కామెడీ
మైనస్ పాయింట్స్
కొంచెం సిల్లీ నెరేషన్
పాటలు బెటర్ గా ఉండాల్సింది
అక్కడక్కడా డబుల్ మీనింగులు
ఫినిషింగ్ టచ్ : యూత్ ఫుల్ ‘మ్యాడ్’
రేటింగ్ : 2.75 / 5
This post was last modified on October 6, 2023 11:45 am
డిసెంబర్ లో పుష్ప 2 సునామి ఉంటుందని తెలిసి కూడా దాని తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తో…
చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగంతో రాజుకున్న వివాదం సోషల్…
లక్కీ భాస్కర్.. దీపావళి కానుగా ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన సినిమా. దుల్కర్ సల్మాన్కు తెలుగులో మంచి గుర్తింపే ఉన్నా..…
సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో భారతీయ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే,…
‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ జరిగినపుడల్లా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొన్ని రోజుల కిందట బీహార్లోని పాట్నాలో చేసిన…
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎక్కువగా హీరోయిక్ మూవీస్ చేశారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశారు. ఐతే…