నటీనటులు: సందీప్ మాధవ్-అభయ్ బేతిగంటి-సత్యదేవ్-శత్రు-మనోజ్ నందం ముస్కాన్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: సంజీవ్ రెడ్డి-అప్పిరెడ్డి-దాము రెడ్డి
రచన-దర్శకత్వం: జీవన్ రెడ్డి
ఎవరి మీద అయినా బయోపిక్ తీయాలి అనుకుంటే, అందులో తెలుగులో తీయాలి అనుకుంటే అక్కడ సరిపడా ముడిసరుకు వుందా? లేదా? అన్నది చూడడం కీలకం. ఆపైన ఎవరి మీద బయోపిక్ తీయాలనుకుంటున్నారో, ఆ వ్యక్తిని ఎలివేట్ చేస్తూ వెళ్లి, ఆ వ్యక్తి భావోద్వేగాలతో జనం కనెక్ట్ అయ్యేలా చేయడం ముఖ్యం. మహానటి సినిమాలో సావిత్రి కష్టాలతో, కన్నీళ్లతో జనం మమేకం అయ్యారు కాబట్టి, ఆ సినిమా హిట్ అయింది. ఎన్టీఆర్ బయోపిక్ లో అస్సలు జనం కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు..అంశాలు లేవు. అందుకే అది అంత దారుణంగా ఫ్లాపయింది. ఇప్పుడు వచ్చిన మరో బయోపిక్ జార్జ్ రెడ్డి ది కూడా సినిమాకు అంతగా సెట్ కాలేకపోయిన వ్యవహారమే.
కేరళలో పుట్టి, ఉస్మానియాలో అడుగు పెడతాడు జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్). అక్కడ అప్పటికే రెండు విద్యార్థి సంఘాలు, రెండు రాజకీయ పార్టీల దన్నుతో హవా చలాయిస్తుంటాయి. బడుగు, బలహీన విద్యార్థుల తరపున ఆ రెండు సంఘాల జనాలను ఎదిరిస్తాడు జార్జ్ రెడ్డి. ఆ తరువాత విద్యార్థి సంఘ ఎన్నికల కోసం తనే స్వయంగా ఓ యూనియన్ పెట్టి, గెలుస్తాడు. తరచు దారులకు అడ్డం రావడంతో ప్రత్యర్ధులు పన్నాగం పన్ని జార్జ్ రెడ్డిని అంతం చేస్తారు. ఇదీ కథ.
విప్లవ భావాలు నరనరానా నింపేసుకున్న జార్జ్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడి బయోపిక్ కు కీలకంగా కావాల్సింది, అతగాడి జీవిత పయనంతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం. దురదృష్టవశాత్తూ జార్జ్ రెడ్డి సినిమాలో అది తప్ప అన్నీ వున్నాయి. సినిమాలో దర్శకుడి కష్టం వుంది. కెమేరామన్ టాలెంట్ వుంది. సంగీత దర్శకుడి కృషి వుంది. నిర్మాతల ఖర్చు వుంది. నటీనటుల ప్రతిభ వుంది. ఇలా అన్నీ వున్నాయి. లేనిది ఒక్కటే ప్రేక్షకులను కుర్చీకి కట్టిపడేయగల కథ లేదా కథనం. అదే ఈ సినిమాకు ప్రథాన లోపం.
సినిమా ప్రారంభమైన పది నిమషాల తరువాత నుంచి సినిమా మిగియడానికి పది నిమషాల ముందు వరకు కథ ఏం జరిగింది అంటే చెప్పడానికి ఏమీ వుండదు. అయితే క్యాంటీన్ లో, లేదంటే గ్రవుండ్ లో, ఇంకా కాదంటే కాంపస్ లోని మరోచోట కొట్టేసుకోవడమే. సినిమా చూసిన వాళ్లకు విద్యార్థుల సమస్యల మీదకు దృష్టి పోదు. వాళ్ల తగువుల మీదకే పోతుంది. ఏంటిది? వీళ్లు చదువుకుందుకే వచ్చారా?అన్న ఆలోచనతో అసలు వ్యవహారం పక్కదారి పట్టేస్తుంది.
సినిమా చూసిన వారు జార్జ్ రెడ్డిని ఓ విద్యార్థినాయకుడిగా కన్నా, ఓ ఆవేశపరుడిగానో, మరే విధంగానో అనుకునే ప్రమాదం వచ్చేలా ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసుకోవడం బాధాకరం. పట్టుమని పదేళ్లు రాక ముందే బ్లేడు పట్టుకుని దాడి చేసే విద్య ప్రదర్శించడం, పెద్దయ్యాక తరచు బ్లేడు నోట్లో పెట్టుకునే విన్యాసాలు చేయడం, జేబులో రుమాలుకు బ్లేడ్లు కట్టి, ప్రత్యర్థులను గాయపరచడం వంటి సీన్లు అతని మీద ఓ మంచి అభిప్రాయం ఏర్పడడానికి కానీ, అతనితో ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి కానీ అస్సలు ఉపయోగపడవు. పైగా యూనివర్సిటీలో బడుగు జనాల కష్టాల వ్యవహారం కూడా అలాగే వుంది. కోరి కయ్యానికి కాలుదువ్వినట్లు కనిపిస్తుంది తప్ప, కన్నీళ్లకో, కాస్త చలించడానికో అవకాశం వుంది.
సినిమా నెరేషన్ అంతా డాక్యుమెంటరీ వ్యవహారంగా ఒక పక్క కనిపిస్తుంది. మరోపక్క సినిమాటిక్ లిబర్టీ తీసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. అసలు టైటానిక్, మదరాసుపట్టణం మాదిరిగా సినిమాకు లీడ్ తీసుకోవడం ఎందుకో? తీసుకుంటే తీసుకున్నారు. తరచు ఆ లీడ్ తీసుకున్న క్యారెక్టర్ వ్యవహారాలు చొప్పించడం వల్ల అనసరపు సన్నివేశాలు ఎక్కువయ్యాయనో, లేదా అసలు కథ తక్కువ అయిందనో ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది.
సినిమాలో తీసేయదగ్గ సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి. దర్శకుడు తన అభిరుచి, తన ఆసక్తి మేరకు సినిమాను ప్రెజెంట్ చేయాలని అనుకోవడం వల్ల ఇలాంటి చాలా సీన్లు సినిమాలోకి వచ్చేసాయి. కానీ అలాంటి చాలా సీన్లు తీసేసినా, సినిమాకు ఏ మాత్రం నష్టం జరగదు అన్నది వాస్తవం. అలా చేసి వుంటే సినిమా మరింత షార్ప్ గా, షార్ట్ గా వుండేది.
సినిమా తొలిసగం కేవలం హీరోను, క్యాంపస్ సమస్యలను ఎస్టాబ్లిష్ చేయడానికే వాడుకున్నారు. అందువల్ల అంత టైమ్ అవసరమా? విశ్రాంతి ఎప్పుడు?అనే ఆలోచనలు ప్రేక్షకుడికి కలిగితే అది అతని తప్పు ఎంత మాత్రం కాదు. సినిమా మలిసగంలోకి ఫ్రవేశించాక, క్యాంపస్ సమస్యలకు ప్రజా సమస్యలు తోడవుతాయి. జార్జిరెడ్డి జీవితంలో ఇలాగే జరిగివుండొచ్చు. కానీ ఇవన్నీ కథను, ప్రేక్షకుడి మూడ్ ను బాగా డిస్ట్రబ్ చేసేస్తాయి. శివ సినిమాలో కూడా క్యాంపస్ లో బయట రౌడీ నాయకుడి ప్రమోయం, ఓ చోటా రౌడీ రావడం, ఇలాంటివి అన్నీ వుంటాయి. ఈ సినిమాలోనూ అలాంటి వున్నాయి. రెండింటికీ సారూప్యం కూడా కనిపిస్తుంది. కానీ అక్కడ వున్న బ్రివిటీ ఆఫ్ టేకింగ్ అన్నది, క్లారిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నది ఇక్కడ లేదు. క్యాంపస్ కుర్రాళ్ల ముష్టి యుద్దాల మధ్య కథను ఇరికించినట్లు వుంది కానీ, సరైన కథ ను అల్లుకుని, ఆపై సన్నివేశాలు రాసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు.
సినిమా అంతా ఎలా వున్నా, క్లయిమాక్స్ దగ్గర మాత్రం నేపథ్యసంగీతంతో సీన్ ను ఎలివేట్ చేసి, ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. అది సినిమాకు ప్లస్ పాయింట్ నే. సినిమా మొత్తం మంచి సాంకేతిక విలువలు వున్నాయి. దర్శకుడి టేకింగ్ కానీ, నటీనటుల నుంచి నటన రాబట్టుకోవడం కానీ, సంగీతం, సినిమాటోగ్రఫీ కానీ అన్నీ మెచ్చుతునకలే.
హీరోగా శాండీ బాగానే చేసాడు కానీ, అతని వాయిస్ సరిపోదు. బలమైన డైలాగులను మరింత బలంగా చెప్పించే ప్రయత్నం జరగాల్సింది. కానీ ఆహార్యం రీత్యా జార్జ్ రెడ్డి అంటే ఇలాగే వుండేవాడేమో? అనేటట్లు నటించాడు. మిగిలిన వారంతా కూడా ఓకె. సత్యదేవ్ పాత్రను తీర్చిదిద్దిన తీరే బాగాలేదు.
మొత్తం మీద ఓ మంచి ప్రయత్నం కాస్తా, మంచి స్క్రిప్ట్ అల్లుకోలేకపోవడంతో నీరసమైపోయింది.
రేటింగ్-2.5/5
ఫినిషింగ్ టచ్… క్యాంపస్ లో ఫైటింగ్ లు
This post was last modified on April 19, 2020 11:31 am
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…
ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…