సమీక్ష – నారప్ప

2.5/5

2 Hr 33 min   |   Amazon Pime   |   20-11-2021


Cast - Venkatesh, Priyamani, Rao Ramesh, Karthik Rathnam, Rajeev Kanakala, Nassar

Director - Srikanth Addala

Producer - Suresh Babu, Kalaippuli S Thanu

Banner - Suresh Productions Pvt. Ltd., V-Creations

Music - Manisharma

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..పరపీడనపరాయణత్వం అంటాడు శ్రీశ్రీ. ఈ ఒక్క పాయింట్ మీద కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ధనిక..పేద, ఫ్యాక్షనిజం..రౌడీయిజం..కులాల అంతరాలు ఇలా నేపథ్యం ఏదైనా కావచ్చు..బలిసిన వాడు బలహీనుడి బతుకులతో ఆడేసుకోవడం అన్నది కామన్ పాయింట్. తమిళ నాట గత ఏడాది వచ్చిన సినిమానే అసురన్. అక్కడి ఓ ప్రాంతంలో జరిగిన కథ ఆధారంగా రాసిన నవలను తెరకెక్కించిన వైనం. ఈ సినిమాలో వున్న విశేషం ఏమిటంటే కులాల ప్రస్తావన అన్నది లేకుండానే, అంతర్లీనంగా అదే అసలు థ్రెడ్ గా తీసుకుని తయారు చేసిన సినిమా.

తమిళ మూల కథలో వున్న బ్యూటీ ఏమిటంటే, ఒకసారి దెబ్బతిన్న తండ్రి వీలయినంత జాగ్రత్తగా బతికేయడం అలవాటు చేసుకోవడం, ఎదురుదెబ్బ అంటే తెలియని కొడుకులు కోపాలను ఆపుకోలేకపోవడం, అణిగి వుండడం అలవాటు చేసుకున్న తండ్రి కొడుకుల కోసం మళ్లీ తిరగబడడాల్సి రావడం..ఆఖరికి పేదవాడికి తనకున్న దేన్నీ కాపాడుకోవడం సాధ్యం కాదు. ఒక్క చదువు అనే సాధనం ద్వారా సాధించే అధికారం తప్ప. అదే ఈ పీడనల నుంచి తప్పించుకోగలిగే మార్గం అనే పాయింట్ తో ముగించడం.

నారప్ప సినిమాలో తండ్రిగా, ఒకప్పటి కొడుకుగా వెంకటేష్. అతన్ని పెళ్లి చేసుకోబోయిన అమ్మాయిగా అభిరామి, పెళ్లి చేసుకున్న అమ్మాయిగా ప్రియమణి కనిపిస్తారు. నారప్పకు వున్న మూడు ఎకరాలను లాగేసుకోవాలనుకున్న ఊరి పెద్దల ఆలోచనతో స్టార్ట్ అవుతుంది సమస్య. అది అలా అలా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఈ సమస్య మధ్యలోనే అసలు నారప్ప నేపథ్యం కూడా వుంటుంది. రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ మాదిరిగానే వర్తమానంలో ప్రారంభమై, నేపథ్యంలో కాస్త నడచి, మళ్లీ వర్తమానంలో ముగుస్తుంది సినిమా.

ఓ సినిమాను ఎక్కడైనా ఆదరించారు అంటే దానికి చాలా కారణాలు వుంటాయి. అక్కడి సామాజిక పరిస్థితులు, సినిమాలో నటించిన హీరో, అక్కడి ప్రేక్షకుల అభిరుచులు ఇలా. తమిళనాట అసురన్ సినిమాకు అంత అప్లాజ్ రావడానికి కారణం అక్కడి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అల్లిన కథ. అలాగే యువ హీరో అయి వుండి ఇద్దరు పిల్లల తండ్రిగా ధనుష్ నటించడం. అయితే డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఆసక్తి వున్న వెంకటేష్ సినిమాను చేయాలని అనుకోవడం వరకు ఓకె. కానీ ఈ సబ్జెక్ట్ తో, ఈ తరహా టేకింగ్ తో తెలుగు ప్రేక్షకులను థియేటర్ లో ఎలా కూర్చోపెట్టాలి అని అనుకున్నారో వాళ్లకే తెలియాలి.

నారప్ప సినిమాలో హై..లో మూవ్ మెంట్స్ ఏవీ ప్రత్యేకంగా వుండవు. నెరేషన్ ఫ్లాట్ గా అలా సాగిపోతూ వుంటుంది. సినిమాలో కీలకమైన సన్నివేశాలు కూడా అలా సాదా సీదాగా సాగిపోతాయి తప్ప, డ్రమెటైజ్ చేయడం లేదా సినిమాటిక్ గా మార్చడం వుండదు. ఎలివేషన్లు అన్నవి అస్సలు కనిపించవు. బహుశా ఈ సినిమా అందుకే తమిళ జనాలకు నచ్చి వుంటుంది. కానీ మన తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చేసరికి సినిమా అన్నాక కొన్నయినా సినిమాటిక్ ఎలివేషన్లు, హై మూవ్ మెంట్ సీన్లు వుండాలి. నారప్పలో అలాంటి వ్యవహారాలు ఏవీ వుండవు.

తెలుగు సినిమా తెరకు తక్కువ పరిచయం అయిన రాయలసీమ గ్రామీణ పేదరిక నేపథ్యం. అది కూడా నలభై-యాభై ఏళ్ల కిందటి నేపథ్యం అన్నది కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే అలా అని కొత్త సీన్లు ఏవీ కనిపించవు. ఇలాంటి సీన్లు అన్నీ ఏదో ఒక సినిమాలో చూసినవే. కొన్ని సీన్లు మరీ మనకు దూరంగా తమిళనాడు దగ్గరగా అనిపిస్తాయి. కానీ ఆ సీన్లలో కూడా గుండెలు పట్టేసేంత విషాదాన్ని తెరపైకి తీసుకురాలేకపోయారు.

నారప్ప సినిమా కాస్త ఇంట్రస్టింగ్ సీన్లతోనే ప్రారంభమవుతుంది. తండ్రీ కొడుకు అడవుల బాట పట్టడం, ప్రత్యర్థులు ఓపక్క, పోలీసులు మరోపక్క తరమడం, మరో వైపు తల్లి, కూతురు వేరే చోట తల దాచుకోవడం ఇలాంటి సన్నివేశాలతో సినిమా చూడాలనే ఆసక్తి జనరేట్ అవుతుంది. ఆ సమయంలో జరిగిన సంఘటనలను మిక్స్ చేసి చూపించడం కూడా బాగానే వుంటుంది. కానీ ఎప్పుడయితే నారప్ప యువకుడిగా వున్న కథను చూపించడం మొదలుపెడతారో, అక్కడ నుంచి సినిమా రొటీన్ ఫ్లిక్ గా మారిపోతుంది.

నేపథ్యం ఏమయినా గతంలో అనేకానేక సినిమాల్లో చూసిన సీన్లే కళ్ల ముందు కనిపిస్తుంటాయి. పైగా ఆ సినిమాలో మాదిరిగా సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వుండదు. ఫ్లాట్ గా, నాచురల్ గా వుంటుంది. అందువల్ల ఆసక్తి కలిగించడం కష్టం. పైగా కాస్త ఓల్డ్ గెటప్ లో వెంకటేష్ ను చూడడం బాగుంటుంది కానీ మళ్లీ మేకప్ మార్చి యంగ్ గా చూపించడం అన్నది ఆసక్తిగా చూసేలా చేయదు. వర్తమాన కథాంశంలో ప్రియమణి సినిమాకు ప్లస్ అవుతుంది. కానీ నేపథ్యంలో అలాంటి సరైన నటి కనిపించలేదు.

ఇవన్నీ అలా వుంచితే తమిళ మాతృక అసురన్ ను దాదాపు కలర్ జిరాక్స్ తీసేసాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సెట్ ప్రాపర్టీస్, మేకప్ లు, డైలాగులు, ఫ్రేమ్ లు ఇలా ఒకటేమిటి దాదాపు, నటీనటలు కొందరిని మార్చి తమిళ సినిమాను తెలుగులో చూసినట్లు తయారుచేసారు. అందువల్ల ఇప్పటికే ఓటిటి ప్లాట్ ఫారమ్ లో అసురన్ చూసేసిన వారికి ఇది ఇంక అంతగా చూడాలని అనిపించదు.

సినిమాలో డైలాగులు బాగానే వున్నాయి. కానీ జనాలకు పరిచయం తక్కువ వున్న రాయలసీమ మాండలీకం, మాడ్యులేషన్ కారణంగా అంతగా రిజిస్టర్ కావు. నేపథ్య సంగీతం బాగుంది. నారప్ప సినిమా ఎలా పనికి వస్తుంది అంటే హీరో వెంకటేష్ ఓ వైవిధ్యమైన పాత్ర చేసారు అని ప్రశంసలు అందుకోవడానికి. సీనియర్ క్యారెక్టర్ ను చాలా బాగా చేసాడు వెంకీ. కానీ యంగ్ క్యారెక్టర్ కు వచ్చేసరికి మళ్లీ రొటీన్ వెంకీనే కనిపించాడు. ప్రియమణి మంచి ఛాయిస్. చాలా బాగా చేసింది. అభిరామి కూడా ఓకె.

నెగిటివ్ క్యారెక్టర్లు అన్నింటికి చిన్న, కొత్త ఫేస్ లు తీసుకోవడం అన్నది నిర్మాతకు డబ్బులు ఆదా చేసి వుండొచ్చు కానీ సినిమాకు మైనస్ నే. ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను రావు రమేష్ కు ఇచ్చారు అంత వరకు ఓకె. రాజీవ్ కనకాలకు కాస్త నిడివి వున్న పాత్ర దొరికింది.

టోటల్ గా ఓటిటికి వెళ్లి నారప్ప బతికిపోయాడు అని అనిపిస్తుందే తప్ప, అయ్యో..ఈ సినిమా థియేటర్లోకి వచ్చి వుండాల్సింది అని మాత్రం అనిపించదు

ప్లస్ పాయింట్లు

వెంకటేష్

ప్రియమణి

మైనస్ పాయింట్లు

ఫ్లాట్ నెరేషన్

పినిషింగ్ టచ్: కలర్ జిరాక్స్

-సూర్య