సమీక్ష – జాతి రత్నాలు

3/5

2 Hrs 25 Min   |   Comedy Drama   |   11-03-2021


Cast - Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria Abdullah

Director - Anudeep KV

Producer - Nag Ashwin

Banner - Swapna Cinema

Music - Radhan

జనం కోరినది మనం చేయడమా? మనం చేసినది జనం చూడడమా? అనే క్వశ్చను ఒకటి ఎప్పడూ క్రియేటర్ల ముందు వేలాడుతూనే వుంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులను థియేటర్లో రెండు గంటలకు పైగా కూర్చోపెట్టగలిగితేనే టికెట్ కొని వస్తారు. అలా కొనిపించడం కోసం ఈ రోజుల్లో లాజిక్ కన్నా మ్యాజిక్ నే అవసరం. అలాంటి మ్యాజిక్ చేసిన సినిమా జాతి రత్నాలు. మాటల గారడీ, వన్ లైన్ కామెడీ..వన్ మాన్ షో అని చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే.

జోగిపెట అనే చిన్న టౌన్ లో స్టార్ట్ అవుతుంది కథ. శ్రీకాంత్ (నవీన్), అతని స్నేహితులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. ఊరిలో అస్సలు వాల్యూ లేని గ్యాంగ్. ఇంజనీరింగ్ అత్తెసరు మార్కులతో పాసయిన శ్రీకాంత్ టౌన్ కు పోయి ఏదో ఉద్యోగం సంపాదించి సైబరాబాద్ శ్రీకాంత్ అనిపించుకోవాలని కోరిక. కానీ శ్రీకాంత్ కు తోకల్లా వెంట వస్తారు దోస్త్ లు ఇద్దరూ, సినిమాటిక్ గా ఓ గెటెడ్ కమ్యూనిటిలో విలాసవంతమైన ఫ్లాట్ ను ఫ్రీగా పట్టేస్తారు. ఉద్యోగాల వేట సాగిస్తూ, టౌన్ లో కూడా తమ స్టయిల్ అల్లరే సాగిస్తూ సాగిపోతున్న వారి లైఫ్ పెద్ద టర్నింగ్ ఇచ్చుకుని, ఓ ఎటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అప్పుడు ఎలా బయటపడ్డారు అన్నది మిగిలిన సినిమా.

వాస్తవం మాట్లాడుకోవాలంటే జాతిరత్నాలు అన్నది ఓ తింగరిబుచ్చి లాంటి కథ. దానికి తల తోక లాజిక్కులు వగైరా వుండవు. కానీ కాంటెంపరరీ యూత్ కు కావాల్సిన ఫన్ పుష్కలంగా వుంటుంది. కాస్త పద్దతిగా వుండేవారికి కొన్ని రకాలు మాటల వింటే చికాగ్గా వుంటుంది. కానీ అవే సంభాషణలు యూత్ కు కిక్కు ఇస్తాయి. జాతిరత్నాలు సినిమా అలాంటిదే. లాజిక్ లు వుండవు. కథకు కర్త, కర్మ, క్రియ వుండదు. కానీ నవీన్ పోలిశెట్టి బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్, పేల్చిన వన్ లైనర్లు కలిసి సినిమాను జెట్ స్పీడులో తీసుకుపోతాయి.

సినిమా తొలిసగం నార్మల్ గా ఏ హడావుడి హంగు లేకుండా స్టార్ట్ అవుతుంది. అమాయకత్వం, అతి తెలివి రెండూ కలిసినట్లు వుండే ఫేస్ నవీన్ ది. దానికి తోడు చాలా క్యాజువల్ గా వుండే డైలాగ్ మాడ్యులేషన్. అవే అతనికి బలం. అదే తన సినిమాకు బలంగా మార్చుకున్నాడు దర్శకుడు. చివరి వరకు ఇదే తరహా పద్దతిని పాటించాడు. చాలా వరకు డైలాగులు జబర్దస్త్ లోని ఆటో రామ్ ప్రసాద్ పంచ్ లను, స్టయల్ ను గుర్తుకు తెస్తాయి.

తొలి సగం కన్నా మలి సగం కాస్త డీలాగా అనిపిస్తుంది. విలన్ డెన్ సీన్లు లాంటివి పెద్దగా ఆకట్టుకోవు. కానీ ప్రేక్షకులు దాన్ని నవ్వుల నుంచి రిలీఫ్ గా తీసుకుంటారు తప్ప, ఇక్కడ లాగ్ అయింది లేదా బోర్ కొట్టింది అని అనుకోరు. అదే ఈ సినిమాకు వరం. అయితే ఇక్కడే మైనస్ కూడా వుంది. ఈ వన్ లైనర్లు, నవీన్ డైలాగ్ ఫ్లో ను ఫాలో అవ్వలేకపోతే సినిమా బోర్ కొట్టేస్తుంది. అంతే కాదు ఏముందీ సినిమాలో అన్న పాయింట్ కూడా వస్తుంది. కేవలం యూత్, ఈ తరహా ఫన్ తో టచ్ వున్నవారు మాత్రమే ఫాలో కావడానికి ఎక్కువ అవకాశం వుంది.

ఈ చిన్న సినిమాకు కాస్టింగ్ పెద్ద ప్లస్ అయింది. ఇటు నవీన్, దర్శి, రాహుల్ కాంబినేషన్ భలే సెట్ అయింది. నవీన్ తరువాత ప్లేస్ లో రాహుల్ వుంటాడు. ఈ మధ్యకాలంలో తరచు వినిపించే..తిన్నావ్ రా..ఏం కూర..ఇలాంటి ఫన్నీ డైలాగులు అన్నీ రామకృష్ణ మీద వాడేసారు. అదే విధంగా హీరోయిన్ ఫరియా కూడా ఆకట్టుకునే రూపమే. కోర్టు సీన్లలో ఆమె ఇన్నోసెంట్ ఫేస్, దానికి బ్రహ్మీ రియాక్షన్లు ప్రేక్షకులకు పట్టేస్తాయి.

టోటల్ గా నవీన్ వన్ మ్యాన్ షో జాతిరత్నాలను కమర్షియల్ వాల్యూ వున్న రత్నాలుగా మార్చేసింది.

ప్లస్ పాయింట్లు

నవీన్

డైలాగులు

చిట్టీ పాట

మైనస్ పాయింట్లు

సాదా సీదా స్క్రిప్ట్

ఫినిషింగ్ టచ్: మెరిసిన రత్నాలు

Rating: 3/5

-సూర్య

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)