Movie Reviews

సమీక్ష – డాకు మహారాజ్

సీనియర్ స్టార్ హీరోల్లో వరసగా మూడు బ్లాక్ బస్టర్లున్న హీరో ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కరే. రెండో హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారనే నమ్మకంతో డాకు మహారాజ్ మీద ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. 2023 వాల్తేరు వీరయ్యతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బాబీ ఈసారి బాలకృష్ణతో ఛాన్స్ కొట్టేశాడు. సితార బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి బాక్సాఫీస్ ని కొల్లగొట్టేలా డాకు అదరగొట్టడా లేదా చూద్దాం.

కథ

టీ ఎస్టేట్ తో పాటు స్కూల్ నడుపుకునే కృష్ణమూర్తి (సచిన్ కెడ్కర్) గారాల మనవరాలు స్థానిక ఎమ్మెల్యే (రవికిషన్) తమ్ముడితో ఏర్పడిన గొడవ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. దీంతో ఎక్కడో మధ్యప్రదేశ్ జైల్లో ఉన్న డాకు మహారాజ్ (బాలకృష్ణ) కు కబురు వెళ్తుంది. పోలీసుల నుంచి తప్పించుకుని పాప కోసం వచ్చేస్తాడు. నానాజీగా పేరు మార్చుకుని పరిచయమవుతాడు. అయితే అతని అసలు పేరు అది కాదు. సివిల్ ఇంజనీర్ సీతారాంగా ఉన్న ఒక ఉన్నత విద్యావంతుడు తెగ నరికే డాకుగా మారడానికి కారణమైన బలవంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్) తో శత్రుత్వం వెనుక నేపథ్యం, ఆ పాపతో ఉన్న సంబంధం ఏంటనే ప్రశ్నకు సమాధానమే అసలు స్టోరీ.

విశ్లేషణ

కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్ములా ఉంటుంది. ఎన్ని కోట్లు పోసినా స్టార్ హీరోలతో వాటిని డీల్ చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే నడుచుకోవాలి. కాకపోతే కొత్త తరం ప్రేక్షకుల అభిరుచులు, అంచనాలకు అనుగుణంగా అప్డేట్ అవుతూనే రెగ్యులర్ ఆడియన్స్ ని మెప్పించేలా ట్రీట్ మెంట్ ఉండాలి. జైలర్, విక్రమ్ అంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఇదే. డాకు మహారాజ్ కోసం దర్శకుడు బాబీ ఈ సూత్రాన్నే అనుసరించాడు. ఎలివేషన్లకు థియేటర్ జనాలు ఊగిపోతున్న జమానాలో చూసేవాళ్లకు ఏమిస్తే కంటెంట్ కనెక్ట్ అవుతుందో కొలతలు చూసుకుని ఆ తర్వాత సబ్జెక్టు మీద ఫోకస్ పెట్టిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ట్రెండుని ఫాలో అయిపోయారు.

లైన్ పరంగా డాకు మహారాజ్ ఎప్పుడూ చూడనిది కాదు. భగవంత్ కేసరిలో తనకు సంబంధం లేని శ్రీలీలను కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్నట్టే ఇందులో కూడా ఒక పాపని రక్షిస్తూ ఊరి జనాల బాగు కోసం తపించే కథానాయకుడిగా బాలకృష్ణ కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నానాజీగా అండర్ కవర్ మోడల్ లో స్క్రీన్ ప్లే నడిపించిన బాబీ అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటనే ఆసక్తిని ఇంటర్వెల్ దాకా బోర్ కొట్టకుండా నడిపించడంలో సక్సెసయ్యాడు. మధ్యలో అవసరం లేదనిపించే దబిడి దిబిడి లాంటి పాట రాయిగా అడ్డు తగిలినా నేల క్లాసు కోసం పెట్టినది కాబట్టి దాన్ని ఒకే కోణంలో జడ్జ్ చేయలేం. విశ్రాంతి వరకు ఒక సెటిల్డ్ టెంపోలో డాకు కాలక్షేపం చేయిస్తాడు.

అసలైన డాకు ఎంట్రీ రెండో సగంలో మొదలవుతుంది. ఎక్కడో చంబల్ లోయ బ్యాక్ డ్రాప్, మాఫియా మైనింగ్ ఆగడాలు, పేదలు చచ్చిపోవడాలు ఇదంతా చాలాసార్లు చూసిందే అయినా మార్బుల్ బిజినెస్ సెటప్ తో పాటు ఠాకూర్ ఫ్యామిలీ క్రూరత్వాన్ని కాస్తంత ఎక్కువ ఇంటెన్సిటీతో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు బాబీ. అయితే కథా కథనాలు అన్నీ ఊహాతీతంగా జరగవు. అదే డాకు ఫ్లాష్ బ్యాక్ లోని ప్రధాన లోపం. నెక్స్ట్ ఏం జరుగుతోందో ఈజీగా గెస్ చేయొచ్చు. కానీ బాలయ్యని సరికొత్తగా చూపించిన విధానం. తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా గ్రాఫ్ ని కిందకు వెళ్లకుండా నిలబెట్టుకుంటూ వచ్చాయి. మరింత బెటర్ గా ఉండాల్సింది.

విపరీతమైన సంభాషణలు లేకుండా సన్నివేశాల్లోని డెప్త్ తో హీరోయిజం పండించే డాకు మహారాజ్ అన్నివర్గాలను మెప్పిస్తుందా లేదానేది బాక్సాఫీస్ దగ్గర తేలుతుంది కానీ తను టార్గెట్ గా పెట్టుకున్న ఫ్యాన్స్, మాస్ వర్గాలను మాత్రం సంతృప్తి పరిచేలా సాగాడు. క్యారెక్టరైజేషన్ల పరంగా ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. చాందిని చౌదరి ఎందుకు ఉందో అర్థం కాదు. ఇంట్రోతో తెగ బిల్డప్ ఇచ్చిన షైన్ చామ్ టాకో తర్వాత తేలిపోయాడు. బాబీ డియోల్ తో పాటు అన్నదమ్ములుగా నటించిన మిగిలిన ఇద్దరికీ రెగ్యులర్ ట్రీట్ మెంట్ దక్కింది. క్లైమాక్స్ లో ఠాకూర్ ని అంతమొందించే ఎపిసోడ్ ఏదో అద్భుతం ఆశిస్తే అది మాములుగా ముగిసిపోవడం కొంత నిరాశే.

ప్రధాన పాత్రల మధ్య సంబంధాలను ఎమోషనల్ గా చూపించాలని ట్రై చేసిన బాబీ శ్రద్ధ శ్రీనాథ్ పాత్రను మెయిన్ ఫోకస్ గా పెట్టుకున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో అది పండకపోవడంతో బాలయ్య, పాప మధ్య కనెక్షన్ మాములుగా అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని లోపాల వల్ల హెచ్చుతగ్గులు ఎదురైనా ఓవరాల్ గా బాగానే ఉందనిపించుకోవడంలో బాబీ వర్కౌట్ చేసుకున్నాడు. సీతారాం గతాన్ని ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాల్సింది.

పండగ సీజన్ కాబట్టి డాకు మహారాజ్ పాసయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్యని కొత్త మాస్ అవతారంలో చూడాలనుకున్న వాళ్లకు నచ్చుతుంది. అలా కాదు ఇంతకు ముందు చూడనిది కావాలంటే సంతృప్తి మిశ్రమంగానే ఉంటుంది. వినోదం లేకపోవడం, కామెడీ టచ్ చేయకపోవడం కొంత లోటే అయినా హీరోయిన్లతో అతకని ప్రేమకథ, ఇరికించిన డ్యూయెట్లు లాంటివి లేకుండా బాబీ చేసిన ప్రయోగం డాకు మహారాజ్ మరీ రొటీన్ బాటలోకి వెళ్లకుండా నిలబెట్టింది. ఇది ఒక రకంగా మంచి ప్రయోగం.

నటీనటులు

వంద సినిమాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న బాలకృష్ణకు డాకు మహారాజ్, సీతారాం పాత్రలు నల్లేరు మీద నడక. అలా పరుగులు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. అలవోకగా పండించారు. అమాయకులని ఊచకోత కోశారని తెలిశాక విలన్ల ఇంటికి వెళ్లి చేసే విధ్వంసంలో రౌద్ర రూపంతో బాలయ్య బెస్ట్ చూడొచ్చు. డాకుగా ఆహార్యం, గంభీరం రెండు బాగా కుదిరాయి. పాట కొరియోగ్రఫీ ఎలా ఉందనేది పక్కనపెడితే ఈ వయసులోనూ ఎవరూ నిరాశ పడకూడదని బాలయ్య చూపిస్తున్న కమిట్ మెంట్ మెచ్చుకోదగినది. దర్శకుడు బాబీకి బెస్ట్ తీసుకునే స్వాతంత్రం ఇచ్చినా పూర్తిగా వాడుకోకపోవడం పొరపాటే. ఊర్వశి రౌతేలాకు రెండు సీన్లు, ఒక పాట తప్ప ఏం లేదు.

ప్రగ్య జైస్వాల్ కు పరిమిత నిడివి దొరికింది. ఉన్నంతలో డీసెంట్ గా సాగింది. శ్రద్ధ శ్రీనాధ్ హుందాగా ఉంది. వేరియేషన్, ఛాలెంజింగ్ లాంటి పెద్ద పదాలు వాడేంత అయితే లేదు. బాబీ డియోల్ అతికినట్టు సరిపోయాడు. డైరెక్టరే పిండుకోలేదు. రవిశంకర్ డబ్బింగ్ బాగా కుదిరింది. రవి శంకర్ ఉన్నది కాసేపే అయినా గుర్తుంటాడు. చాందిని చౌదరిని ముందు ఏమనుకొని తీసుకున్నారో కానీ ఏ మాత్రం ఉపయోగపడని క్యారెక్టర్ దక్కింది. హిమజ, హర్షవర్ధన్ అంతే. సచిన్ కెద్కర్ కు అలవాటైన పాత్రే. రవి కాలే అంత హడావిడిలో కొంత ఉనికిని చాటుకున్నాడు. సైడ్ విలన్లతో పాటు ఇతర ఆర్టిస్టులు బోలెడు ఉన్నారు కానీ స్క్రీన్ అధికశాతం బాలయ్యే ఆక్రమించేశారు.

సాంకేతిక వర్గం

బాలయ్య అంటేనే చాలు స్పీకర్లు పగిలిపోయే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే తమన్ మరోసారి విశ్వరూపం చూపించాడు. బలహీనమైన కొన్ని సీన్లు కేవలం తన సౌండ్ వల్ల నిలబడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఉన్నవి తక్కువ పాటలే అవి ఛార్ట్ బస్టర్ స్థాయిలో లేకపోవడం ఒక్కటే కొంత అసంతృప్తి అనిపిస్తుంది. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్రేమ్స్, కలర్స్ చాలా బాగా కంపోజ్ చేసుకున్నారు. అధిక భాగం సినిమా డార్క్ టోన్ లో నడిచినప్పటికీ ఆ ఫీలింగ్ రాకుండా మేనేజ్ చేశారు. నిరంజన్ – రూబెన్ ఎడిటింగ్ బాగానే సాగినా ఇంకొంచెం కత్తెరకు పని చెప్పాల్సింది. సితార నిర్మాణ విలువల్లో కాంప్రోమైజ్ లేదు.

ప్లస్ పాయింట్స్

డాకుగా బాలకృష్ణ
తమన్ బీజీఎమ్
కెమెరా పనితనం
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్

తెలిసిన కథే
సెకండాఫ్ లో కొంత ల్యాగ్
దబిడి దిబిడి పాట
రొటీన్ ట్రీట్ మెంట్

ఫినిషింగ్ టచ్ : మాస్ మెచ్చే డాకురాజ్

రేటింగ్ : 2.75/5

This post was last modified on January 12, 2025 12:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర: ఇచ్చిపడేశాడు!

కార్పొరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో పని ఒత్తిడితో పాటు టైమ్ ను కూడా మెల్లగా పెంచుతున్న విధానంపై తీవ్ర స్థాయిలో…

30 minutes ago

తిరుప‌తి తొక్కిస‌లాట: బాధితుల‌కు ప‌రిహారం అందించిన చైర్మన్

వైకుంఠ ఏకాద‌శి రోజు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాల‌ని వ‌చ్చి.. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస లాట‌లో ప్రాణాలు కోల్పోయిన…

60 minutes ago

ఆపిల్ సీఈవో జీతం ఎంతో తెలుసా?

ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది.…

1 hour ago

బుమ్రా లేని లోటును షమీ భర్తీ చేస్తాడా?

వరల్డ్ క్రికెట్ లో కీలక సిరీస్ గా పరిగణిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి మరెంతో సమయం లేదు. పిబ్రవరిలో ఈ సిరీస్…

1 hour ago

గడ్కరీ సాబ్… మరో మారు ఆలోచించండి…!

నితిన్ గడ్కరీ... కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా పదేళ్లకుపైగా కొనసాగుతున్నారు. మోదీ కేబినెట్ లో ఆ శాఖను…

2 hours ago

బస్సు టిక్కెట్లకు విమానం ధరలు

తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. పండుగ పూట సొంతూరికి వెళ్లాలని భావిస్తున్న వారికీ ప్రయాణ కష్టాలు తప్పడం…

2 hours ago