ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా ప్రయోగాలు, కమర్షియల్ సబ్జెక్టులు ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తున్న సుధీర్ బాబుకి సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. దసరాకు విడుదలైన మా నాన్న సూపర్ హీరో సైతం ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోవడం అభిమానులను కలవపరిచే వాస్తవం. బ్యాడ్ టాక్ వచ్చిన విశ్వం, మార్టిన్ వసూళ్లే దీని కన్నా మెరుగ్గా ఉండటం ఎలా అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ మీద గంపెడాశలు పెట్టుకుని ప్రమోషన్ చేస్తే వాళ్ళను సైతం మా నాన్న సూపర్ హీరో చేరకపోవడం అసలు ట్రాజెడీ. వీకెండ్ బుకింగ్స్ అంతంతమాత్రమే ఉన్నాయి.
ఓపెనింగ్స్ సైతం కరువవ్వడం సుధీర్ బాబుకి స్వీయ విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చి పెడుతోంది. మహేష్ బాబు మద్దతు ఏదో ఒక రూపంలో దక్కుతూనే ఉన్నా బావ ఫ్యాన్స్ సైతం తన సినిమా చూసేందుకు మొదటి రోజు రాకపోవడం వెనుక కారణాలు పోస్ట్ మార్టం చేసుకోవాలి. ప్రతిసారి సమ్మోహనం లాంటివి సాధ్యం కావు. నిజమే. అలాని ప్రయోగాల పేరుతో లేనిపోని రిస్కులు చేస్తే మార్కెట్ ప్రమాదంలో పడుతుంది. హీరో హీరోయిన్ చనిపోయే క్లైమాక్స్ ఉన్న శ్రీదేవి సోడా సెంటర్, తెలుగు ప్రేక్షకులు ఒప్పుకునే అవకాశమే లేని ట్విస్టున్న హంట్ అసలు చేయకుండా ఉండాల్సింది.
హరోంహర మాత్రమే చెప్పుకోదగ్గ ఓపెనింగ్ తేగా దానికి ముందు వెనుక వచ్చినవి అధిక శాతం జీరో షేర్లతో ముగిసినవే. రాబోయే జటాధరా ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. ఫాంటసీ జానర్ కాబట్టి ధీమాగా ఉండటానికి లేదు. దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే షూటింగ్ దశలోనే చెక్ చేసుకోవడం అవసరం. త్వరలో కొడుకుని తెరగేంట్రం చేయించాలని చూస్తున్న సుధీర్ బాబు ముందు తాను బలంగా స్థిరపడితే తప్ప వారసుడికి సరైన గ్రౌండ్ ఇవ్వలేడు. అది జరగాలంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడాలి. డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న బాక్సాఫీస్ కు సరైన సమాధానం చెప్పాలి. వచ్చే ఏడాది బ్రేక్ దక్కుతుందేమో.