మసాలా ఎక్కువైతే ట్రోల్స్ రాకుండా ఉంటాయా 

ఏదైనా మితంగా ఉండి రుచిగా అనిపిస్తేనే కడుపు నిండుతుంది. అది ఫుడ్ అయినా సినిమా అయినా రెండింటికి అదే సూత్రం వర్తిస్తుంది. అలా కాకుండా ఓవర్ డోస్ ఇస్తే మాత్రం ఉబ్బసం వచ్చి ఆసుపత్రికి పరిగెత్తాలి. ప్రస్తుతం సింగం అగైన్ బృందానికి ఇది అనుభమవుతోంది. ఎన్నడూ లేనిది ఏకంగా అయిదు నిమిషాల ట్రైలర్ ని వదిలిన రోహిత్ శెట్టి ఈ వీడియో దెబ్బకు అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయని విపరీతంగా ఆశలు పెట్టేసుకున్నాడు. తీరా చూస్తే హైప్ సంగతేమో కానీ రివర్స్ లో సోషల్ మీడియా జనాలు ట్రోలింగ్ కి దిగడంతో దర్శకుడితో సహా టీమ్ మొత్తం షాక్ తింటోంది. 

ఇలా ఎందుకు జరిగిందనే కారణాలు లేకపోలేదు. సింగం అగైన్ ఫక్తు కమర్షియల్ మాస్ సినిమా. కొంత వరకు రామాయణాన్ని వాడుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఆ ఇతిహాసంలోని ప్రతి క్యారెక్టర్ ని రిఫరెన్స్ గా తీసుకుని పాత్రలను తీర్చిదిద్దడం పట్ల నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కల్కి 2898 ఏడిలో హుందాగా కనిపించిన దీపికా పదుకునేతో లేడీ సింగంగా ఓవరాక్షన్ చేయించారని ఫ్యాన్సే అంటున్నారు. ఈమెకు తోడు భర్త రణ్వీర్ సింగ్ నేనేం తక్కువా అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇవ్వడం ట్రోలింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అజయ్ దేవగన్ ఒక్కడే హుందాగా అనిపించాడు. 

దీపావళి పండగ సందర్భంగా విడుదలవుతున్న సింగం అగైన్ బాక్సాఫీస్ వద్ద భూల్ భూలయ్యా 3తో క్లాష్ అవుతోంది. రెండూ సీక్వెల్స్ కావడంతో ఓపెనింగ్స్ పరంగా బిజినెస్ వర్గాలు టెన్షన్ గా ఉన్నాయి. ఏదో ఒకటి వాయిదా పడాలని కోరుకున్నారు కానీ నిర్మాణ సంస్థలు వేటికవే తగ్గమంటూ భీష్మించుకుని కూర్చోవడంతో ఫైట్ తప్పడం లేదు. సరే ఎంత మసాలా ఎక్కువైనా మెప్పించేలా ఉంటే సింగం అగైన్ వసూళ్లు సాధించవచ్చు కానీ మరీ టూ మచ్ అనిపించుకోకుంటే చాలు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలున్నారు.