ప్యాన్ ఇండియా మూవీ ట్యాగ్ తో ఇప్పటి దర్శకుల్లో అధిక శాతం తమ సినిమాలను సంవత్సరాల తరబడి తీయడం చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల హీరోలు తమ విలువైన సమయాన్ని ఒక చిత్రం కోసం ఎక్కువ కేటాయించాల్సి వస్తుండగా, ఒకవేళ అవి కనక అంచనాలు అందుకోలేకపోతే దాని తాలూకు ఒత్తిడిని భరించడంలో ఇబ్బంది పడుతున్నారు.
కానీ మణిరత్నం మాత్రం వయసు మళ్ళిన దశలోనూ వేగానికి చిరునామాగా మారడం ఆశ్చర్యపరుస్తోంది. కమల్ హాసన్ తగ్ లైఫ్ ని ఆయన పూర్తి చేసిన విధానమే దానికి నిదర్శనం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా 2025 వేసవిలో రాబోతోంది.
ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు మణిరత్నం ఇటీవలే ఒక కథ చెప్పారని చెన్నై టాక్. ముప్పై మూడు సంవత్సరాలకు ముందు దళపతి లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చాక ఈ కలయిక మళ్ళీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా సరే ఈ కాంబో కుదరలేదు.
రోజా తర్వాత మణి పూర్తిగా కమర్షియల్ జానర్ నుంచి పక్కకు వచ్చేయడంతో స్టార్ హీరోలతో చేసేందుకు మొగ్గు చూపలేదు. ఆ తర్వాత వరస ఫ్లాపులు వెనుకబడేలా చేసినా పొన్నియిన్ సెల్వన్ తిరిగి ట్రాక్ లోకి తెచ్చేసింది. ఇతర భాషలను పక్కనపెడితే తమిళంలో మాత్రం ఇది ఘనవిజయం సొంతం చేసుకున్న మాట వాస్తవం.
అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మణిరత్నం వేగంగా స్క్రిప్టులు, షూటింగులు చేసేస్తున్నారు. ప్రస్తుతం కూలికి కమిటైన రజనీకాంత్ ఆ తర్వాత జైలర్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ మణిరత్నం కనక తక్కువ టైంలో ఫినిష్ చేస్తానని మాట ఇస్తే ఆ దిశగా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.
రాజకీయ నేపథ్యంలో యువ తరహాలో ఆలోచింపజేసేలా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారని, ఫైనల్ షేప్ వచ్చే దాకా ఏదీ నిర్ధారణగా చెప్పలేమని కోలీవుడ్ సమాచారం. ఏది ఏమైనా సీనియర్ అగ్ర దర్శకుడి వేగం నుంచి ఎంతైనా ఇన్స్ పిరేషన్ తీసుకోవడం అవసరం. హీరోలు నిర్మాతలకూ ఉపయుక్తంగా ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates