శంకర్ & తమన్ ‘గేమ్ ప్రెజర్’

గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా భారతీయుడు 2 డిజాస్టర్ తో మొదటిసారి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడిన దర్శకుడు శంకర్, గుంటూరు కారం తర్వాత కనిపించకుండా పోయిన తమన్ మీద ఎక్కువ ఒత్తిడి ఉండబోతోంది. అదెలాగో చూద్దాం. దేవర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా అనిరుధ్ రవిచందర్ తననుంచి ఏది ఆశించారో దాన్ని నెరవేర్చాడు. నాలుగు పాటలే ఉండి ఒకటి ఎడిటింగ్ లో తీసేసినా సరే నెగటివ్ కామెంట్స్ రానంత బెస్ట్ వర్క్ ఇచ్చి ఫ్యాన్స్ నిరాశ పరచకుండా చూసుకున్నాడు.

సో తమన్ అంతకు మించి గేమ్ ఛేంజర్ ని నిలబెట్టాలనేది మెగాభిమానుల కోరిక. ట్విట్టర్ లో క్రమం తప్పకుండా యాక్టివ్ అప్డేట్స్ ఇస్తున్న ఈ సంగీత సంచలనం జరగండి జరగండి సాంగ్ తో అంచనాలు అందుకోలేకపోయాడు కానీ ఇప్పుడు రా మచ్చా మీద మాములు హైప్ లేదు. ప్రోమోతోనే నిర్ధారణకు రాలేం కానీ పూర్తి పాట విన్నాకే ఒక క్లారిటీ వస్తుంది. ఇక శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్లలోనూ ఎక్కువ ఇన్వాల్వ్ కావాలని నిర్ణయించుకున్నారట. ఇండియన్ 3కి సంబంధించిన పనులు మొదలుపెడదామని లైకా నుంచి పిలుపు వచ్చినా ప్రస్తుతానికి పెండింగ్ పెట్టినట్టు టాక్.

ఆచార్య చేసిన గాయం నుంచి కొరటాల శివ ఎలాగైతే దేవర రూపంలో బయట పడ్డాడో ఇప్పుడు కమల్ హాసన్ ఇచ్చిన షాక్ నుంచి శంకర్ ని కోలుకునేలా చేయాల్సింది రామ్ చరణే. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండటంతో హరిహర వీరమల్లు లాగే దీని మీద బజ్ కొంచెం తక్కువగా ఉంది. దాన్ని పెంచే దిశగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎస్విసి బృందం అదే పనిలో ఉందంటున్నారు కానీ ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు ఆ స్థాయి ఎగ్జైట్ మెంట్ ఇవ్వలేదు. దేవర హడావిడి తగ్గాక ఒక్కసారిగా స్పీడ్ పెంచుతారని తెలిసింది. గేమ్ ఛేంజర్ కాస్తా శంకర్ తమన్ లకు ప్రెజర్ గా మారిపోయిన మాట వాస్తవం.