విడుదల వలయంలో విజయ్ దేవరకొండ 12

ది ఫ్యామిలీ స్టార్ తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ చేతిలో మూడు ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ విడుదల దర్శకుడు గౌతమ్ తిన్ననూరిదన్న సంగతి తెలిసిందే. శ్రీలంకలో కీలక షెడ్యూల్ పూర్తి చేయడంతో పాటు అధిక భాగం షూటింగ్ ని ఒక కొలిక్కి తెచ్చేసారు. అధికారికంగా విడుదల తేదీని వచ్చే సంవత్సరం మార్చి 28గా చాలా ముందుగానే ప్రకటించారు. వేరొకరు డేట్ ని లాక్ చేసుకోకుండా ముందు జాగ్రత్త పడ్డారు. అయినా లాభం లేకుండా పోయింది. అదే తేదీకి పవన్ కళ్యాణ్ ఓజి వస్తుందనుకుంటే ఇప్పుడు దాని స్థానంలో హరిహర వీరమల్లు దిగుతున్నాడు.

సో పవన్ తో క్లాష్ అయ్యేందుకు విడి 12 నిర్మాత నాగవంశీ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధపడరు. ఈ మాట పలు సందర్భాల్లో చెప్పారు కూడా. లక్కీ భాస్కర్ డేట్ కనక ఓజి కోరుకుంటే తప్పుకుంటామని ఓపెన్ గా ఇంటర్వ్యూలోనే అన్నారు. అలాంటప్పుడు హరిహర వీరమల్లు వస్తున్నప్పుడు విడి 12 బరిలో ఉండటం సేఫ్ కాదు. సరే పోనీ ఏప్రిల్ కు షిఫ్ట్ అవుదామంటే 10న ప్రభాస్ ది రాజా సాబ్ కర్చీఫ్ వేసుకుని ఉంది. చాలా టైం ఉంది కనక వాయిదా పడే అవకాశాలు ఎంత మాత్రం లేనట్టే. ఆపై ఎనిమిది రోజులకే తేజ సజ్జ మిరాయ్. రెండు సినిమాలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే అయినప్పటికీ మార్పు ఉండకపోవచ్చు.

మళ్ళీ మే లేదా జూన్ కు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దానికి టీమ్ సిద్ధంగా ఉందా లేదానేది చూడాలి. హిందీ జెర్సీ డిజాస్టర్ తర్వాత గౌతమ్ తిన్ననూరి బాగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. కొత్త వాళ్ళతో మేజిక్ అనే మరో చిన్న మూవీ చేశాడు కానీ దాని తాలూకు అప్డేట్స్ సితార సంస్థ ఇవ్వడం లేదు. రామ్ చరణ్ ప్రాజెక్టు చేతి దాకా చేజారిపోయిన గౌతమ్ తిన్ననూరి ఈసారి టాప్ లీగ్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. పైగా విజయ్ దేవరకొండకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన ఒత్తిడి తన మీదే ఉంది. దానికి అనుగుణంగానే చాలా డిఫరెంట్ యాక్షన్ సబ్జెక్టు ఎంచుకున్నారట.