గెట్ రెడీ…..వీరమల్లు వచ్చేస్తున్నాడు

పవన్ కళ్యాణ్ అభిమానులకు గొప్ప శుభవార్త వచ్చేసింది. అయితే వాళ్ళు ఎదురుచూస్తున్నట్టు ఓజికి సంబంధించినది కాదు. హరిహర వీరమల్లు విడుదల గురించి. 2025 మార్చి 28 ప్రపంచవ్యాప్తంగా పార్ట్ 1 స్వార్డ్ అండ్ స్పిరిట్ ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటన ఇచ్చి కొత్త పోస్టర్ వదిలారు. అధిక భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగిలింది నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్లో భారీ యుద్ధ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొనగా షూటింగ్ కొనసాగించబోతున్నారు.

ఓజి కన్నా ముందు వీరమల్లుకి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఉంది. ఇప్పటికే విపరీతమైన జాప్యానికి గురైన ఈ ప్యాన్ ఇండియా మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఓటిటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే జరిగిన ఆలస్యం మరింత కొనసాగిస్తే ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది. పైగా రెండు భాగాలు కాబట్టి ముందు దీన్ని రిలీజ్ చేస్తే సీక్వెల్ ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఏడాది లేదా రెండేళ్ల తర్వాత విడుదల చేసుకోవచ్చు. తద్వారా డిప్యూటీ సిఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు అయిదేళ్ల కాలంలో నాలుగు వచ్చినట్టవుతుంది. వీరమల్లు రెండు భాగాలు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు లిస్టులో ఉన్నాయి.

రాజకీయ పరిస్థితులు సున్నితంగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ వీలైనంత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. పని ఒత్తిడి, వివిధ శాఖల సమస్యలు, ఊహించని విధంగా వచ్చే వరద లాంటి విపత్తులు తనను ఊపిరాడనంత బిజీగా మార్చేస్తున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే మనస్థాపంతో షూటింగులు వద్దనుకున్న పవన్ ఇప్పుడు జనాలకు రోజుకో సమస్య వస్తుంటే కుదురుగా ఉండగలరా. తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎంతగా కలత చెందారో చూస్తున్నాం. ఈ లెక్కన పైన చెప్పిన నాలుగు సినిమాలు మినహాయించి పవన్ ఇకపై కొత్త నిర్మాతలకు కమిట్ మెంట్లు ఇవ్వడం డౌటే.