ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో టాప్ వన్ గా నిలబడిన కల్కి 2898 ఏడికి కొనసాగింపు ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి ప్రభాస్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లోనూ ఉంది.
అయితే ఇప్పుడప్పుడే ఇది సాధ్యం కాదని పలు సందర్భాల్లో నిర్మాతలు ప్రియాంక దత్, అశ్విని దత్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు సుప్రసిద్ధ ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ నాగ అశ్విన్ తో ప్రాజెక్టు ఉందనే రీతిలో సంకేతాలిస్తూ క్యాస్టింగ్ కోసం ప్రకటన ఇవ్వడం చూశాం. వీటి సంగతెలా ఉన్నా కల్కి 2కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలైపోయాయని ఇన్ సైడ్ టాక్.
టైటిల్ కూడా మారుతుందని అంటున్నారు. ‘కర్ణ 3102 బిసి’ పేరుతో కథను కర్ణుడు ప్రభాస్, అశ్వద్ధామ అమితాబ్ బచ్చన్ మధ్య నడిచేలా, మధ్యలో విలన్ యాస్కిన్ ని మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఏడి నుంచి బిసికి వెళ్తుంది.
అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి అన్న మాట. కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ తో పాటు మహాభారత యుద్ధం తర్వాత అసలేం జరిగిందనే అంశాలు మరింత డీటెయిల్ గా చూడొచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2028లో విడుదల చేసేలా ప్లానింగ్ చేశారని అంటున్నారు.
ఇది నిజమని చెప్పడానికి ప్రస్తుతానికి ఆధారాలు లేవు కానీ లీక్స్ అయితే బలమైన సోర్స్ నుంచే వచ్చాయి. ఒకవేళ గాసిప్ అయినా ఆశ్చర్యం లేదు కానీ ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్యాన్ ఇండియా మూవీ మీద ఇంత ఎగ్జైట్ మెంట్ కలగడం కల్కికే జరిగిందని చెప్పొచ్చు.
థియేట్రికల్ గా అద్భుతాలు చేసిన కల్కి 2898 ఏడి ఓటిటిలో వచ్చాక ఆ స్థాయి స్పందన చూపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా కేవలం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ రికార్డులను దాటుతుందనుకుంటే అది సాధ్యం కానంత దూరం ఆగిపోయింది. కొన్ని విజువల్ గ్రాండియర్లు చిన్న స్క్రీన్ మీద కిక్ ఇవ్వవు మరి.